Off The Record: మాకు వాటా ఇవ్వకపోతే బొమ్మ ఆపేస్తాం?
Off The Record: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు, థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ముదిరింది.
Off The Record: మాకు వాటా ఇవ్వకపోతే బొమ్మ ఆపేస్తాం?
Off The Record: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక్కటే డిస్కషన్. అదే రెంటల్ సిస్టమ్ VS పర్సంటేజ్ షేరింగ్. పెద్ద సినిమాల రిలీజ్‌లు తగ్గిపోవడం, చిన్న చిత్రాలకు ప్రేక్షకుల రాక పెద్దగా లేకపోవడంతో పాటు.. హిట్ పర్సెంటేజ్ అంతంత మాత్రమే ఉండటంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లను నడపడమే కష్టమైపోయింది. దీంతో గత కొంతకాలంగా మాకూ పర్సంటేజ్ కావాలంటూ గొంతెత్తిన తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్.. ఇటీవల కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో చదలవాడ శ్రీనివాసరావు, శిరీష్, సునీల్ నారంగ్, శ్రీధర్, అనుపమ్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, బాలగోవింద్ వంటి ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతమున్న రెంట్ సిస్టమ్‌ను పూర్తిగా పక్కన పెట్టి, పర్సంటేజ్ షేరింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఎగ్జిబిటర్లంతా కలిసి నిర్ణయించారు. ఇన్నేళ్లుగా థియేటర్లకి రెంట్లు కట్టలేక అవస్థలు పడుతుండటంతో ఎగ్జిబిషన్ సిస్టంని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ కొత్త రెవెన్యూ మోడల్‌ను తెరపైకి తెచ్చారు.
ప్రస్తుత తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా రెంటల్ విధానంపైనే సింగిల్ స్క్రీన్ థియేటర్లు నడుస్తున్నాయి. ఇందులో థియేటర్ యజమాని ముందుగానే ఒక ఫిక్సుడ్అమౌంట్ను డిస్ట్రిబ్యూటర్‌కు చెల్లించి సినిమా ప్రదర్శన హక్కులు పొందుతాడు. సినిమా హిట్, ఫ్లాప్తో సంబంధం లేకుండా ఈ మొత్తం డిస్ట్రిబ్యూటర్‌కు వెళ్లిపోతుంది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్‌కు, ప్రొడ్యూసర్ కు భద్రత ఎక్కువగా ఉంటుంది. కానీ, థియేటర్ యజమానికి మాత్రం రిస్క్ ఉంటోంది. కలెక్షన్లు తగ్గినా ముందే నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించాల్సి రావడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, ఓటీటీ ప్రభావంతో ప్రేక్షకులు తగ్గిపోవడం వంటి కారణాలతో ఎగ్జిబిటర్లు లాస్అవుతున్నారు. అందుకే ఇకపై లాభమైనా, నష్టమైనా సమానం ఉండాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు. దీని ద్వారా సినిమాకు ఎంత వసూలైతే అందులో ముందే అనుకున్న పర్సెంటేజ్ ప్రకారం ఇద్దరు పంచుకోవాలన్న మాట. చిన్న సినిమాల సంగతి ఎలా ఉన్నా .. ఇప్పుడొచ్చిన చిక్కంతా పెద్ద సినిమాల గురించే. ఏడాదిలో దాదాపు 40 వారాల పాటు చిన్న సినిమాలకు పర్సంటేజ్ పద్ధతిని అమలు చేస్తున్నారు. కానీ లాభాలు వచ్చే పెద్ద సినిమాల సమయానికి వచ్చేసరికి సుమారు 10 వారాలు మళ్లీ పాత రెంట్ పద్ధతిని తెరపైకి తెస్తున్నారు. దీనివల్ల థియేటర్లకు వచ్చే లాభం కంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పుష్ప వంటి భారీ చిత్రాలకు ఇతర రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లకు కూడా పర్సంటేజ్ షేరింగ్ ఇస్తున్నప్పుడు, మన తెలంగాణలో ఎందుకు ఇవ్వరనేది అసోసియేషన్ వేస్తున్న సూటి ప్రశ్న. ఐతే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రతిపాదనకు ఒప్పుకోవడం లేదు. తమ పెట్టుబడులు భారీగా ఉంటాయని, ఈ పర్సంటేజీ విధానం వల్ల తమ డబ్బుల రికవరీ కష్టమవుతుందని అంటున్నారు.
మల్టీప్లెక్స్‌లకు ఒక రూల్, సింగిల్ స్క్రీన్‌లకు మరో రూల్ ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్టీప్లెక్స్‌లు ఇప్పటికే పర్సంటేజ్ సిస్టమ్‌తో సేఫ్ జోన్‌లో ఉంటే, సామాన్యులకు వినోదాన్ని పంచే సింగిల్ స్క్రీన్లు మాత్రం అద్దెల భారంతో డీలా పడిపోతున్నాయ్ .అందుకే ఈ డిఫరెన్స్ లేకుండా అందరికీ ఒకే చట్టం ఉండాలన్నది ఎగ్జిబిటర్ల డిమాండ్. మరోవైపు సినిమాల రన్ టైమ్ తగ్గిపోవడం సింగిల్ స్క్రీన్ల పాలిట శాపంగా మారిందనే చెప్పాలి. ఆడియన్స్ తక్కువ టైమ్ లోనే ఎక్కువ థియేటర్లలో సినిమా చూసేయడం, దాంతో పాటు ఓటీటీలలో చాలా త్వరగా స్ట్రీమింగ్ అవుతుండటంతో థియేటర్ల వైపు జనాలు చూడని పరిస్థితి. ఇలా సినిమాలు ఆడని పరిస్థితుల్లో కూడా థియేటర్స్ కి రెంట్స్ కట్టడం సాధ్యం కాదని, అందుకే వసూళ్లలో వాటా ఇచ్చే పద్ధతి అయితేనే నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు ఇద్దరికీ అనువుగా ఉంటుందంటూ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది.
లాభ నష్టాలను నిర్మాత, థియేటర్ యజమాని సరిసమానంగా పంచుకోవడమే చిత్ర పరిశ్రమకు శ్రీరామరక్ష అని అసోసియేషన్ స్పష్టం చేసింది. సినిమా బాగుంటే ఇద్దరూ లాభపడాలి, ఫలితం తేడా కొడితే రిస్క్ కూడా ఇద్దరూ షేర్ చేసుకోవాలి. కేవలం అద్దెల రూపంలో థియేటర్లను నష్టాల్లోకి నెట్టడం సరికాదని సమావేశం తీర్మానించింది. ఈ భేటీలో తీసుకున్న సమిష్టి నిర్ణయం.. ఎగ్జిబిషన్ వ్యవస్థలో సరికొత్త మార్పులు తెస్తుందని, దీనిపై టాలీవుడ్ పెద్దలు సానుకూలంగా స్పందిస్తారని ఎగ్జిబిటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు, థియేటర్ల ఎగ్జిబిటర్స్ మధ్య చాన్నాళ్లుగా నలుగుతున్న వివాదం ఇప్పుడు మరింత ముదిరింది. ఓటీటీ రిలీజ్ విండో, థియేటర్ల అద్దె విధానాలపై ఇరు వర్గాల మధ్య తీవ్ర విభేదాలు వ్యూహాత్మక ఘర్షణకు దారితీశాయి. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అత్యవసర, కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇండస్ట్రీ మనుగడను శాసించే కొన్ని ముఖ్యమైన అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఈ వివాదంలో ఇరు వర్గాల వాదనలు, డిమాండ్లు భిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా రెండు అంశాలు ఈ ఘర్షణకు కేంద్ర బిందువులుగా మారాయి. థియేటర్లను కేవలం ఫిక్స్‌డ్ అద్దె ప్రాతిపదికన నడపడం వల్ల తాము నష్టపోతున్నామని ఎగ్జిబిటర్స్ వాదిస్తున్నారు. దీనికి బదులుగా సినిమా కలెక్షన్లలో పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేస్తుండటం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారని ఎగ్జిబిటర్ల ఆందోళన. థియేటర్ రిలీజ్ తర్వాత కనీసం 6 నుండి 8 వారాల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయకూడదనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని వారు కోరుతున్నారు.
ఎగ్జిబిటర్స్ డిమాండ్లపై యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాత పద్ధతిలోనే రెంటల్ బేసిస్ మీద మాత్రమే థియేటర్లు కొనసాగాలని, ప్రస్తుత పరిస్థితుల్లో పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు. సినిమా నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో, కలెక్షన్లలో వాటాలు ఇస్తే తాము కోలుకోలేమని వారు వాదిస్తున్నారు. ఓటీటీ ఒప్పందాలు అనేవి పూర్తిగా నిర్మాత వ్యక్తిగత, వ్యాపార నిర్ణయాలని, వాటిపై ఆంక్షలు విధించడం సరికాదనేది గిల్డ్ అభిప్రాయం. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీఓ ఇచ్చినప్పటికీ… టికెట్ ధరలు పెంచేది లేదని ఎగ్జిబిటర్స్ స్పష్టం చేయడం గమనార్హం. ధరలు పెంచితే సామాన్య ప్రేక్షకుడు థియేటర్‌కు పూర్తిగా దూరమవుతాడని, దానికంటే తమకు లాభదాయకమైన పర్సెంటేజ్ విధానం కావాలనేది వారి పట్టుదల. ఈ వివాదం త్వరగా సర్దుమణగకపోతే టాలీవుడ్ బాక్సాఫీస్‌పై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. రాబోయే పెద్ద సినిమాల విడుదలకు థియేటర్ల కొరత ఏర్పడవచ్చు, లేదా ప్రదర్శనలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్త కార్యదర్శిగా ఉన్న నట్టి కుమార్ తన పదవికి రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయం ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపికైంది. పర్సెంటేజ్ విధానాన్ని సరిగ్గా నిర్వహించడంలో కౌన్సిల్ ఘోరంగా విఫలమైందని, దీనివల్ల ఎగ్జిబిటర్లు ఆధిపత్యం చెలాయిస్తుంటే, సొంతంగా సినిమాలు నిర్మించే నిర్మాతలు మాత్రం రోడ్డున పడుతున్నారని మనసులోని మాటని బయటపెట్టారు నట్టి కుమార్. గతంలో రిలీజైన చిన్న సినిమాలకి సరైన థియేటర్లు దొరకక, దొరికినా పర్సెంటేజ్ షేర్ లో అన్యాయం జరిగి భారీ నష్టాలను ఫేస్ చేశాయని ఆయన గుర్తు చేశారు. 2025-26 సీజన్ లో విడుదలైన పలు భారీ బడ్జెట్ చిత్రాల సమయంలో చిన్న సినిమాల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, మండలి కేవలం పెద్ద నిర్మాతల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. నిజానికి గత నాలుగు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరైన సందడి లేదు. సంక్రాంతి తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టే భారీ చిత్రాలు రాకపోవడంతో ఎగ్జిబిటర్లు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు జూన్ 4న వస్తున్న పెద్ది సినిమా రిలీజ్ టైంలో ఎగ్జిబిటర్లు తమ మొండిపట్టును కొనసాగించడం ఇండస్ట్రీకి ఆరోగ్యకరం కాదని తేల్చి చెప్పారు. ఎగ్జిబిటర్లకు ఉన్న ఇబ్బందులు తమకు తెలుసని, కానీ నిర్మాతలకు కూడా తమదైన సమస్యలు ఉంటాయన్నారు.
టాలీవుడ్‌లో ఒకప్పుడు దాసరి నారాయణరావు వంటి వారు ఉంటే ఏ సమస్యనైనా చిటికెలో పరిష్కరించేవారు. ఇప్పుడు అటువంటి బలమైన పంచాయితీ పెద్ద ఎవరూ లేకపోవడం ఈ వివాదం ముదరడానికి ప్రధాన కారణం. మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకోవాలని చాలా మంది కోరుకుంటున్నప్పటికీ, ఆయన మాత్రం మౌన ముద్ర వీడటం లేదు. గతంలో కొన్ని వివాదాల్లో తలదూర్చి పరిష్కారం చూపినా, చివరికి ఎవరో ఒకరు తనను బ్లేమ్ చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు. అందుకే, నాకెందుకు వచ్చిన గొడవ అన్నట్లుగా ఆయన సైలెంట్‌గా ఉంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఐతే కేవలం థియేటర్ రెంటల్ విధానం మార్చినంత మాత్రాన సమస్య సాల్వ్ అవుతుందా లేక ఓటీటీ రిలీజ్ డేట్లను ఎనిమిది వారాలకు పెంచాలా? అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి ఈ సమస్యలో రెండు వర్గాల వాదనలోనూ కొంత న్యాయం ఉంది. మల్టిప్లెక్స్‌లకు లేని నిబంధనలు తమకెందుకు అని సింగిల్ స్క్రీన్ యజమానులు అడుగుతుంటే.. మెయింటెనెన్స్ సరిగ్గా లేని థియేటర్లకు షేరింగ్ ఎలా ఇస్తామని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. నిర్మాతలు, థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రంగంలోకి దిగింది. సినిమా వసూళ్లలో వాటాల పంపిణీపై స్పష్టత, థియేటర్ల నిర్వహణ-అద్దె భారంపై చర్చ, థియేటర్లలో విడుదలైన సినిమా ఎన్ని రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వాలనే నిబంధనపై ఒక నిర్ణయానికి రావడం వంటి అంశాలపై.. చర్చించారు. పర్సంటేజ్ సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చాంబర్ ప్రకటించింది. కమిటీలో 18 మంది సభ్యులు ఉంటారని.. 1-2 నెలల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఈ టైంలో సినిమా రిలీజులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఏ, బి, సి సెంటర్లను బట్టి పర్సంటేజ్‌ను కమిటీ డిసైడ్ చేస్తుందమని... వచ్చే రెండు నెలల్లో పూర్తి నిర్ణయాలు ప్రకటిస్తామని ఛాంబర్ తెలిపింది. మరి ఈ సమస్య ఎలా సద్దు మనుగుతుందో.. ? థియేటర్లలో బొమ్మ పడటానికి.. అడ్డంకులు తొలగుతాయో లేదో చూడాలి.




