Off The Record: జగన్ సైలెన్స్ స్కెచ్!
Off The Record: విజయవాడ మేయర్ ఎన్నిక త్రిముఖ పోరుగా మారుతున్న వేళ వంగవీటి రాధా, ఏబీ వెంకటేశ్వరరావు, రాయన భాగ్యలక్ష్మిల మధ్య రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
Off The Record: జగన్ సైలెన్స్ స్కెచ్!
Off The Record: విజయవాడ మేయర్ ఎన్నిక త్రిముఖ పోరుగా కనిపిస్తున్నా.. రాజకీయ చర్చ మాత్రం ఇద్దరి చుట్టూనే తిరుగుతోంది. కూటమిలోని జనసేన పార్టీ తరఫున వంగవీటి రాధాకు పోటీగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్వతంత్రంగా బరిలో దిగినా.. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు పొందారు. దీంతో ఈ పోటీకి కొత్త మలుపు వచ్చింది.
అయితే రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ ఏంటంటే.. ఏబీవీ కారణంగా వైసీపీ బలహీనపడుతోందా..? లేక కూటమే ఇబ్బంది పడుతోందా..?
ఇక్కడే మరో అనుమానం కూడా తెరపైకి వచ్చింది. వైసీపీ అధికారిక అభ్యర్థిగా మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో ఆమె ప్రచారం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే చర్చ సాగుతోంది. సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో కూడా పోరు "రాధా వర్సెస్ ఏబీవీ"గా మారిపోయిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
దీంతో కొందరు రాజకీయ విశ్లేషకులు ఓ ప్రశ్న వేస్తున్నారు. భాగ్యలక్ష్మి కేవలం అధికారిక అభ్యర్థేనా..? అసలు లక్ష్యం ఏబీవీని బలపరచడమేనా..? అయితే దీనికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారం లేదు. ఇది రాజకీయ ప్రచారాల్లో వినిపిస్తున్న అనుమానం మాత్రమే. ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావుకు, వైసీపీ ప్రభుత్వానికి మధ్య సంబంధాలు తీవ్ర వివాదాస్పదంగా ఉండేవి.
ఒక దశలో ఏబీవీకి అపాయింట్ ఇవ్వకుండా అప్పటి జగన్ సర్కార్ చర్యలు కూడా తీసుకుందన్న అవవాదు లేకపోలేదు. రాజకీయంగా, పరిపాలనా పరంగా రెండు వైపులా ఘర్షణలు జరిగాయి. అలాంటి ఏబీవీ ఇప్పుడు బరిలో ఉంటే.. జగన్ అనుకూల ఓటు ఆయనవైపు ఎందుకు వెళ్లాలి..? అదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇది వ్యక్తుల మధ్య సంబంధాల అంశం కాదు. ఎన్నికల్లో ఎవరికి నష్టం.. ఎవరికి లాభం అన్న లెక్కలే ముఖ్యమట. ఇదే ఫార్ములా జగన్ సీక్రెట్ వ్యూహం అంటున్నారు రాజకీయ పండితులు.
విజయవాడలో కూటమి తరఫున వంగవీటి రాధాకృష్ణ బరిలో ఉన్నారు. ఆయన గెలిస్తే ఈపాటికే ముగ్గురు కూటమి ఎమ్మెల్యేలు ఉన్న కృష్ణా జిల్లాలో అధికార పార్టీ జోష్ మరింత పుంజుకుంటుంది. అయితే రాధా గెలుపు మార్జిన్ తగ్గినా.. లేక పోటీ తీవ్రంగా మారినా.. అది రాజకీయంగా కూటమిపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒకవేళ..
ఏబీ వెంకటేశ్వరరావు బలపడితే.. కూటమి ఓట్లలో కొంత చీలిక రావచ్చు. వైఎస్ జగన్ కూడా ఈ పరిణామాన్నే కోరుకుంటున్నారని, అందుకు సైలెన్స్‌గా గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారని కొందరు పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతోకొంత ఉండే అవకాశం లేకపోలేదు. అలా కూటమి వ్యతిరేక ఓటును కూడా ఏబీవీకి పడేలా స్కెచ్ వేస్తున్నారట.
ఇలా ఉండగా.. ఏబీవీ పోటీ వెనుక టీడీపీ వ్యూహం ఉందని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో ఆరోపించారు. సాయిరెడ్డితోపాటు మరికొందరు రాజకీయ విమర్శకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి.. కమ్మ సామాజికవర్గాన్ని సంతృప్తి పరిచేలా టీడీపీ అధిష్టానమే ఏబీవీతో నామినేషన్ వేయించిందన్న పుకార్లు కూడా వినిపించాయి. అదే సమయంలో టీడీపీ నేతలు వాటిని ఖండించారు.
ఇలా వెంకటేశ్వరరావుకు టీడీపీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా..? లేక వైసీపీ ఓట్లు పోల్ అవుతాయా..? అన్న గందరగోళమైతే లేకపోలేదు.
ఇంతకీ రాయన భాగ్యలక్ష్మి తరఫున ప్రచారం చేయాల్సిన వైసీపీ సీనియర్లంతా చేతులెత్తేశారన్న వాదనలు బలంగానే ఉన్నాయి. వైసీపీ అధికారికంగా భాగ్యలక్ష్మికే మద్దతు ఇస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ప్రచారం ఆశించినంత దూకుడుగా కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
మరోవైపు జగన్ కాంగ్రెస్, వామపక్షాలకు దగ్గరవుతున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. అలాగే.. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ మేయర్ రేసులో ఉన్నారు. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే కేంద్రంలోని బీజేపీకి కొంతకాలంగా దూరం దూరంగా ఉంటున్న వైఎస్ జగన్.. కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారనే వాదనకు బలం చేకూరుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొందరు రాజకీయ పరిశీలకులు చెబుతున్నది ఒక్కటే..
జగన్ ప్రధాన లక్ష్యం గెలుపు మాత్రమే కాకుండా.. కూటమి శక్తిని బలహీనపర్చడం కూడా కావొచ్చు. విజయవాడలో కూటమి అజేయం కాదని నిరూపించగలిగితే... అది రాజకీయంగా వైసీపీకి నైతిక బలం ఇస్తుందన్న అభిప్రాయం రీసౌండ్ చేస్తోంది.




