Jordar News: కవితక్క కు షాక్ ఇచ్చిన మహారాష్ట్ర లీడర్లు

Jordar News: బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చి కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్న కవితకు 'TRS' పేరు పెద్ద సమస్యగా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Jun 2026 7:19 AM IST
Jordar News
X

Jordar News: కవితక్క కు షాక్ ఇచ్చిన మహారాష్ట్ర లీడర్లు

Jordar News: కవితక్క పెట్టిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుతోని ఎవ్వల్కి పెద్దగ అభ్యతరం ఉండకపోవచ్చుగనీ., ఆ పార్టీని గుడ టీఆర్ఎస్ అని పిల్సుడే ఇప్పుడు పెద్ద చర్చకు, రచ్చకు దారి తీసింది. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టీఆర్ఎస్ పేరుతోనే దున్యా అందరికి పరిచయం అయ్యింది. ఇప్పుడా పార్టీ బీఆర్ఎస్ గ పేరు మార్సుకున్నా ఇంకా కారు పార్టీ అన్నా, కేసీఆర్ పార్టీ అన్నా ఊళ్లల్ల ముసలోల్లేగాదు ఇంకా శానా మంది ఇప్పట్కి సుతం టీఆర్ఎస్ పార్టీ అనే అనుకుంటరు.

కావట్టి., టీఆర్ఎస్ అనే పేరు అచ్చేతట్టు ఎవ్వల్కి ఆ పేరు ఇయ్యద్దని కారు పార్టీ లీడర్లు కేంద్రం ఎన్నికల సంఘం దగ్గర మొర వెట్టుకున్నరు. 14 ఏండ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటంల టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ సెంటిమెంట్‌తోని ముడిపడి ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదైర్రు. అయితే., దీని మీద బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అభ్యంతరం జెప్తరని ముందు నుంచి అనుకున్నదేగనీ., ఇప్పుడు రంగంలకు వేరే పార్టీ గుడ దిగింది.

టీఆర్ఎస్ పేరు మీద ఏమన్న అభ్యంతరాలుంటె జెప్పుర్రని కవితక్క పేపర్ల అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చింది గదా అప్పట్ల. ఇగ దీని మీద కవిత పార్టీ కోసానికి దరఖాస్తు చేస్కునే ముందు రోజే మేం దరఖాస్తు చేస్కున్నంగావట్టి., టీఆర్ఎస్ పేరు మాకే ఇయ్యాల్నని పట్టువడ్తున్నరు మహారాష్ట్ర లీడర్లు. మహారాష్ట్రలున్న సోలాపూర్ కేంద్రంగ పన్జేస్తున్న తెలంగాణ రాష్ట్రసామాజిక సేన గుడ ఇదే టీఆర్ఎస్ పేరు కోసం పట్టువడ్తున్నది. దయానంద్ మహాదేవ్ మామ్‌డ్యాల్ అనే అన్న ఈ సంస్థను నడుపుతున్నడట. అట్లా టీఆర్ఎస్ పేరు మీద మొత్తం 7 వందల దాంక అభ్యంతరాలు అచ్చినయట కేంద్ర ఎన్నికల సంఘానికి.

ఇదిట్లుంటే., తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర గుడ ఇప్పటికే టీఆర్ఎస్ పేరు మీద రొండు రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నయట. దాంట్ల తెలంగాణ రాజ్య సమితి పార్టీ లీడర్లు గుడ కవిత పార్టీ మీద అభ్యంతరం జెప్పిర్రట. ఇగీ పేరు మీదైతున్న రచ్చ గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చేతందుకు కవితక్క సిద్ధమైతున్నదట. కనీ., టీఆర్ఎస్ పేరు మీద పెద్ద ఎత్తున అభ్యంతరాలు అచ్చుడు, రాష్ట్రం కోసం పోరాటాలు జేశ్న పార్టీ, అందునా పదేండ్లు తెలంగాణను ఏలిన పార్టీ పేరు గావట్టి., కవిత కొత్త పార్టీకి టీఆర్ఎస్ పేరు దక్కుడు జర్రంత కష్టమే అయ్యేతట్టున్నదని అంటున్నరు రాజకీయ విశ్లేషకులు. సూడాలె మరి ఏం జరుగుతదనేది.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story