Burning Topic: ట్రంప్ తీరుతో అట్టుడుకుతున్న అమెరికా
Burning Topic: అమెరికాలో ట్రంప్ పాలనపై ఎందుకు ఇంత వ్యతిరేకత? ట్రంప్ విధానాలను 52% మంది అమెరికన్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
Burning Topic: ట్రంప్ తీరుతో అట్టుడుకుతున్న అమెరికా
Burning Topic: అగ్రరాజ్యంలో మళ్ళీ అవే సెగలు. అదే అసహనం. డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన రెండేళ్లలోనే.. ఆందోళనకారుల నిరసనలతో అమెరికా అట్టుడుకుతోంది. ఇది ట్రంప్ విధానాలపై ప్రజల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తి.. వీధుల్లో కనిపిస్తున్న వ్యతిరేకతకు నిదర్శనంగా చెబుతున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. తాజా సర్వేల ప్రకారం 52 శాతం మంది అమెరికన్లు ట్రంప్ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ముఖ్యంగా యువతలో 18 నుంచి 34 ఏళ్ల లోపు వయస్సున్న 51 శాతం మంది ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తున్నారట. ఉపాధి, హక్కులు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ‘నెవర్ ట్రంప్’ వంటి ఉద్యమాలు మళ్లీ యాక్టివ్ అయ్యాయి. ట్రంప్ తన 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలసీ నిర్ణయాలు, విదేశాంగ విధానాల వల్ల ఈ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ట్రంప్, ఎలాన్ మస్క్ వంటి మిత్రుల మధ్య కూడా రాజకీయ పొత్తులు చెడిపోవడం, కీలక బిల్లుల విషయంలో విభేదాలు రావడం ఆయన పాలనలోని అస్థిరతకు అద్దం పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇరాన్ వంటి దేశాలతో యుద్ధం చేయడమే కాక మిత్రదేశాల పట్ల ట్రంప్ అనుసరిస్తున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల అమెరికా అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతోందని విమర్శలు వస్తున్నాయి. స్వదేశంలోనే ఈ యుద్ధ చర్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సైనిక నాయకత్వంతో ఘర్షణకు దారితీస్తున్నాయని, సైన్యంలో కూడా అసమ్మతి సెగలు కనిపిస్తున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలు, టారిఫ్ విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ అమలు చేస్తున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనల వల్ల అమెరికాలోని వలసదారుల్లో, ముఖ్యంగా భారతీయుల్లో ఆందోళన పెరుగుతోంది. సుమారు 40 శాతం మంది భారతీయులు అమెరికాను వీడి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. మరోవైపు.. రష్యా నుంచి చమురు దిగుమతులు, సుంకాల విషయంలో భారత్‌పై ట్రంప్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, హెచ్చరికలు అమెరికన్లలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయట.
భారత్, చైనా నరకకూపాలంటూ ట్రంప్ రీట్వీట్ చేయడంపై డెమోక్రాట్లు మండిపడ్డారు. భారతీయ అమెరికన్లనే కాదు, ప్రపంచంలో అమెరికాకు కీలక భాగస్వామైన భారత్‌ను కూడా అధ్యక్షుడు అవమానించారని డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు రాజా క్రిష్ణమూర్తి ఆక్షేపించారు. భారత సంతతి వ్యక్తులను ట్రంప్ చులకన భావంతో చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా డిమాండ్ చేశారు. రేడియో ప్రయోక్త మైఖేల్ సావెజ్ వ్యాఖ్యలతో ట్రంప్ ఏకీభవించడం.. అధ్యక్ష కార్యాలయ గౌరవాన్ని దిగజార్చాడమేనని కాంగ్రెస్ ముక్తకంఠంతో ఖండించింది.
ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలకు చైనా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ట్రంప్ తీరును ఎండగడుతూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపికయ్యాయి. భారత్, చైనా మధ్య ఉన్న సంబంధాలు, ప్రస్తుత పరిస్థితులపై ట్రంప్ చేసిన రెచ్చగొట్టే పోస్టులను చైనా విదేశాంగ ప్రతినిధి యూ జింగ్ తీవ్రంగా ఖండించారు. వైరల్ అయ్యే మాటలు కాలక్రమేణా చెరిగిపోవచ్చు.. కానీ రెండు దేశాల మధ్య ఉండే అసలైన భాగస్వామ్యం ఎప్పటికీ చెదిరిపోదంటూ ఆమె ఎక్స్ వేదికగా బదులిచ్చారు. ప్రపంచ దేశాలు పరస్పరం విమర్శించుకోవడం కంటే, దేశాల మధ్య శాశ్వత బంధం ముఖ్యం అనే సంకేతాన్ని ఇచ్చారు. అంతర్జాతీయ వేదికలపై ప్రభావవంతమైన నేతలు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలన్నారు. రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడితే ప్రయోజనం ఉండదని యూ జింగ్ చురకలు అంటించారు. ముఖ్యంగా భారత్ వంటి పొరుగు దేశంతో చైనాకు ఉన్న సంబంధాలను మూడో శక్తి ఏవిధంగానూ ప్రభావితం చేయలేరన్నారు. దౌత్య మార్గాల్లోనే సమస్యలు పరిష్కారం అవుతాయని డ్రాగన్ కంట్రీ స్పష్టం చేసింది.
మరోవైపు ట్రంప్‌కు తాజాగా కోర్టుల నుంచి రెండు ప్రధాన విషయాల్లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. విదేశీయులకు శరణార్థి హోదా కల్పించడం ద్వారా అమెరికాలో ఆశ్రయం కల్పించడాన్ని నిలిపివేస్తూ ట్రంప్ వెలువరించిన కార్యనిర్వాహక ఆదేశాలను ఒక అప్పీళ్ల కోర్టు రద్దుచేసింది. అమెరికా దక్షిణ సరిహద్దుల నుంచి కొనసాగుతున్న వలసల నిరోధానికి ట్రంప్ ఈ ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దులో ఆశ్రయం కోరే హక్కును ప్రవాస చట్టాలు కల్పిస్తున్నాయని, ఆ హక్కును అతిక్రమించే అధికారం అధ్యక్షుడికి లేదని కొలంబియా సర్క్యూట్‌కు చెందిన న్యాయమూర్తుల కమిటీ తేల్చిచెప్పింది. అటు.. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ విధించిన భారీ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన అధికార పరిధిని మించి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరింట మూడో వంతు మెజారిటీతో కోర్టు ఈ విషయం స్పష్టం చేసింది. దీనివల్ల ప్రభుత్వం దాదాపు 170 బిలియన్ డాలర్ల వరకు రీఫండ్ చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుత సమాచార వక్రీకరణల యుగంలో ఒక కంప్యూటర్ కలిగివున్న ఏ వ్యక్తి అయినా తనను తాను జీసస్‌గా, డాక్టర్‌గా చిత్రీకరించుకోవచ్చని ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్ పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను దెప్పి పొడిచారు. ఇటీవల ట్రంప్ తనను తాను క్రీస్తుగా చిత్రీకరించుకుంటూ సోషల్ మీడియా పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సమాచార వక్రీకరణల యుగంలో ఏదీ సరైనదో, ఏది కాదో తెలుసుకోలేని పరిస్థితిలోకి ప్రజల్ని నెట్టడమనేది నియంతలు అనుసరిస్తున్న మౌలిక రాజకీయ వ్యూహమని ఆయన అన్నారు.
ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 'గోల్డ్ కార్డ్' వీసా పథకం ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో దీనిని ఒక 'అట్టర్ ఫ్లాప్' షోగా మీడియా వర్గాలు అభివర్ణిస్తున్నాయి. దాదాపు 10 లక్షల మంది ఈ కార్డు కోసం క్యూ కడతారని అమెరికా ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు కేవలం ఒక్కరికి మాత్రమే ఈ గోల్డ్ కార్డ్ జారీ అయ్యింది. ఈ కార్డు పొంది అమెరికా పౌరసత్వం వైపు అడుగులు వేయాలంటే ఒక వ్యక్తి సుమారు 8.5 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత భారీ మొత్తం వెచ్చించడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే ఈ పథకం ఫెయిల్యూర్‌కు కారణమని పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఉద్యోగుల తరపున సంస్థలు స్పాన్సర్ చేయాలనుకుంటే కూడా సుమారు 15 వేల డాలర్లుచెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీములో లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని ట్రంప్ ప్రభుత్వం భారీగా ప్రచారం చేసినప్పటికీ, వాస్తవ గణాంకాలు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయని తేలింది. మొత్తానికి సంపన్నులను, పలు రంగాల్లో నిపుణులను ఆకర్షించడానికి తెచ్చిన ఈ 'గోల్డ్ కార్డ్' పథకం విఫలమై.. తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇలా ట్రంప్ తన చేష్టలతో ఇంటా బయటా విమర్శలు, ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు.




