Burning Topic: ఇరాన్‌పై అమెరికా ఆర్థిక డి-డే.. ఆంక్షలతో ఉక్కుపాదం!
Burning Topic: ఇరాన్‌పై ట్రంప్ ఆర్థిక 'డి-డే' ఆంక్షలు. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు, దక్షిణ ఫార్స్‌లో భారీ గ్యాస్ క్షేత్రం గుర్తింపు. వివరాలు చూడండి.
Burning Topic: ఇరాన్‌పై అమెరికా ఆర్థిక డి-డే.. ఆంక్షలతో ఉక్కుపాదం!
Burning Topic: ఇరాన్‌ను పూర్తిగా ఒంటరి చేసే దిశగా ఇప్పటికే కఠిన ఆంక్షలకు తెరలేపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో 'ఆర్థిక డి-డే'ను ప్రారంభిస్తున్నట్లు అధికారంగా ప్రకటించింది. ఇందులో భాగంగా ఇరాన్ చమురు రవాణా మార్గాలు, ఆర్థిక రంగాన్ని టార్గెట్ చేశారు.
ఇరాన్ అణు ఆయుధాలు కలిగి ఉండటాన్ని తాము సహించలేమని, హర్మూజ్ జలసంధి ప్రస్తుతం తమ ఆధీనంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షల విషయంలో చివరి దశలోకి ప్రవేశించామని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు.
ఆ దేశ ఆర్థిక జీవనాధారాలను పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యమన్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా కట్టడి చేశామని, ఒక శత్రు దేశంపై ఇప్పటివరకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆంక్షల పరంపరను అమలు చేస్తామని ప్రకటించారు. అమెరికా సహనాన్ని పరీక్షించే వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఇరాన్ మీద అమెరికా తాజాగా ప్రకటించిన అతిపెద్ద ఆర్థిక ఆంక్షల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లు, పశ్చిమాసియా రాజకీయాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. తమ దిగ్బంధాన్ని మరింత కఠినతరం చేశాయి అమెరికా బలగాలు.
ఇప్పటివరకు మొత్తం 70 వాణిజ్య నౌకలను ఇతర మార్గాలకు మళ్లించామని, మూడింటిని నిలిపివేసి. రెండింటిని తనిఖీ కోసం బోర్డు చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అమెరికా నౌకాదళ దిగ్బంధనం కఠినమైన ఆంక్షలతో ఇరాన్ ముడి చమురు ఎగుమతులు దాదాపు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇరాన్‌కు పెద్ద వ్యాపార భాగస్వామి అయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇప్పటికే ఇరాన్‌తో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ కరెన్సీ చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోవడమే కాకుండా, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజల్లో తీవ్రమైన ఆందోళన మరియు నిరుద్యోగం పెరిగిపోతున్నాయి.
హర్మూజ్‌లో ప్రస్తుతం నౌకలు రెండు మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో. ఒకటి ఇరాన్ సూచించిన మార్గం కాగా.. మరొకటి అమెరికా భద్రత కల్పిస్తోన్న ఒమన్ మార్గం. ఈ మార్గాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న ఇరాన్ అగ్రరాజ్యానికి ధీటుగా హెచ్చరికలు జారి చేసింది.
తమ ఆదేశాలు పట్టించుకోకుండా.. హర్మూజ్‌లో ప్రయాణ నిబంధనలను ఉల్లంఘించే నౌకలను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది. వీటికి సహకరించే నౌకలపైనా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అమెరికా చేపట్టిన ఈ ఆర్థిక యుద్ధంలో చేరితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గల్ఫ్ దేశాలను హెచ్చరించింది.
అమెరికా ఆర్థిక యుద్ధం మొదలైతే.. పర్షియన్ గల్ఫ్ నుంచి గానీ, హర్మూజ్ జలసంధి మీదుగా గానీ ఒక్క చుక్క చమురు కూడా దాటదు. అమెరికాకు సహకరించేవారిని శత్రువులుగానే పరిగణించాల్సి వస్తుందనిని ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ మొహసెన్ రజాయ్ హెచ్చరించారు.
ఇరాన్‌ను మరో వెనెజువెలాగా మార్చాలని అమెరికా ప్రయత్నించిందని దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ విమర్శించారు. ఈ దురాక్రమణను ఎదుర్కొని ఇరాన్ ధైర్యంగా నిలబడిందని తెలిపారు. తమ ప్రజల దృఢ సంకల్పాన్ని, శక్తిని ప్రశంసించారు. ఇరాన్ తన ప్రతిఘటన, సంఘీభావం, ఐక్యతతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని కొనియాడారు.
పశ్చిమాసియా కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో మసూద్ పెజెష్కియన్ ఈ వ్యాఖ్యలు చేశారు.అమెరికా-ఇజ్రాయెల్‌తో యుద్ధ సమయంలో మనం ఒకరికొకరు మద్దతుగా నిలిచాం. పరస్పరం సహాయం చేసుకుని కలిసికట్టుగా నిలబడ్డాం. ఇప్పుడే అదే విధంగా కలిసికట్టుగా నిలబడాలి.
ఇరాన్ నాయకత్వం చూపిన మార్గాన్ని అనుసరించాలి. సంఘీభావం, ఐక్యతను పాటించాలి. మనం వివేకంతో వ్యవహరిస్తే ఏ శక్తి కూడా మనల్ని లొంగిపోయేలా బలవంతం చేయలేదు అని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు పెజెష్కియాన్.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారెన్ ట్రంప్‌ను హత్య చేస్తామని బెదిరిస్తూ.. ఇరాన్ ప్రభుత్వ అనుబంధ ఛానల్ ప్రకటించడం కలకలం రేపింది. ఆయన తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది.
బారెన్ ఏ సమయంలో ఎక్కడ ఉంటారు? అతడిని లక్ష్యం చేసుకొనేందుకు సరైన చోటు ఏది? అనే విషయాలను అందులో చూపించారు. బారెన్‌తో ఉండే కుటుంబ సభ్యులు, స్నేహితుల దృశ్యాలు.. సీక్రెట్ సర్వీస్ అధికారులను తప్పించుకొని అతడి నివాసంలోకి ప్రవేశించే మార్గాలను కూడా అందులో చూపారు.
గత నెల జులైలో ‘ట్రంప్ సతీమణి మెలానియాను ఎలా హత్య చేయాలి?’ అనే వీడియోను కూడా ఇలాగే చూపించారు. కాగా అమెరికాలోని ఉన్నతాధికారులను, కీలక నేతలను హతమార్చడానికి ఇరాన్ కుట్ర పన్నుతోందని ఇటీవల అక్కడి ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అలీ ఖమేనీ అంత్యక్రియల సమయంలో.. ట్రంప్‌ను చంపుతామని బెదిరించడాన్ని ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న దశలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దక్షిణ ఫార్స్ ప్రావిన్స్‌లో భారీ గ్యాస్ క్షేత్రాన్ని కనుగొన్నట్లు ఇరాన్ చమురు మంత్రి మొహ్సన్ పక్నెజాద్ ప్రకటించారు. కొత్తగా గుర్తించిన చమురు క్షేత్రంలో 7,500 బిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా.
ఇందులో 73 % ఉత్పాదకత ద్వారా సుమారు 5,700 బిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్‌ను సులభంగా వెలికితీయవచ్చని మొహ్సన్ పక్నెజాద్ తెలిపారు. ఇక్కడి గ్యాస్ నిక్షేపాలు శుద్ధమైన రకానికి చెందినది కావడంతో, దీని అభివృద్ధి, నిర్వహణకు అయ్యే ఖర్చులు చాలా వరకు తగ్గుతాయని స్పష్టం మంత్రి చెప్పారు ఈ నిల్వలు దాదాపు 15 సంవత్సరాల పాటు దేశ గ్యాస్ అవసరాలను తీర్చగలవని చెబుతున్నారు. గ్యాస్‌తో పాటు భారీ మొత్తంలో గ్యాస్ కండెన్సేట్ కూడా లభించిందని, 10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కొత్త సంపదను తెచ్చిపెడుతుందని తెలిపారు.




