BURNING TOPIC: మళ్లీ ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్‌కు బిగ్ షాక్!

BURNING TOPIC: భారత్, చైనా సహా 16 దేశాలపై అదనపు దిగుమతి సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Nov 2026 7:29 AM IST
BURNING TOPIC
X

BURNING TOPIC: మళ్లీ ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్‌కు బిగ్ షాక్!

BURNING TOPIC: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య సుంకాల అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. భారత్‌తో పాటు చైనా, యూరోపియన్‌ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా తదితర 16 దేశాలపై అధిక సుంకాలు విధించేందుకు సిద్ధమవుతోంది ట్రంప్ యంత్రాంగం. ఆయా దేశాలు అందిస్తున్న రాయితీలతో పారిశ్రామిక ఉత్పత్తులను అధికంగా తయారు చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లలో చౌక ధరలకు విక్రయిస్తున్నాయన్న ఆరోపణలతో ఈ చర్యలు చేపట్టనుంది.

దీనివల్ల అమెరికా తయారీ సంస్థలు పోటీని తట్టుకోలేకపోతున్నాయని చెబుతున్నారు కొత్త సుంకాలు విధించే అంశానికి సంబంధించి అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విచారణ చేపట్టింది. 1974 నాటి ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 ప్రకారం ఈ ఏడాది మార్చి 11న ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు నష్టం కలిగించే అన్యాయమైన వాణిజ్య విధానాలపై చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం అధ్యక్షుడికి అధికారం కల్పిస్తుంది.

డొనాల్డ్ ట్రంప్ 2025 ఏప్రిల్‌లో అనేక దేశాలపై భారీగా దిగుమతి సుంకాలు ప్రకటించడం తెలిసిందే.అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు ఆ సుంకాలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. దీంతో వాటి స్థానంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా జులైలో 60 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై 10 నుంచి 12.5 శాతం వరకు సుంకాలు విధించింది.

కాగా కొత్తగా విధించబోయే సుంకాల శాతం ఎంత ఉంటుందనే విషయంపై కూడా స్పష్టత లేదు. అనేక రకాల దిగుమతి వస్తువులపై ఇవి వర్తించే అవకాశం ఉంది. అయితే స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్స్ వంటి కొన్ని ఉత్పత్తులకు మినహాయింపు లభించవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే జాతీయ భద్రతా కారణాలతో ఈ వస్తువులపై ఇప్పటికే అమెరికా ప్రత్యేక సుంకాలు విధిస్తోంది.ఇప్పటికే ఉన్న సుంకాలకు అదనంగా కొత్త భారం పడబోంది.

ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ కొత్త సుంకాలు గతంలో విధించిన టారిఫ్‌ల స్థానంలో తీసుకొస్తున్న చర్యల్లో భాగమని తెలుస్తోంది. చైనా, భారత్, దక్షిణ కొరియా, జపాన్‌, యూరోపియన్‌ దేశాలు తమ పరిశ్రమలకు భారీగా సబ్సిడీలు ఇస్తూ తక్కువ ధరకే వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్నాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్ ఆరోపిస్తున్నారు.

ఆ వస్తువులను అమెరికన్ మార్కెట్‌లో చౌకగా విక్రయించడం వల్ల, స్థానిక పరిశ్రమలు పోటీ పడలేక దెబ్బతింటున్నాయని ఆయన తెలిపారు. అందుకే ఆయా దేశాలపై అదనపు సుంకాలు విధించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ‘సెక్షన్ 301’పై తాము చేపడుతున్న విచారణ ఈ వారంలో తుది దశకు చేరుకుంటుందని జేమిసన్ గ్రీర్ వెల్లడించారు.

ఈ విచారణ పూర్తయితే భారీ సుంకాలు విధించేందుకు అమెరికా సన్నద్ధమవుతోంది. భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, కెమికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్ రంగాలపై ఎక్కువ ప్రభావం పడనుంది.

కాగా తాజా పరిణామాలు భారత్‌-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 2026 ఫిబ్రవరి 7న ఇరు దేశాలు మధ్యంతర వాణిజ్య ఒప్పంద ముసాయిదాను ప్రకటించాయి. ఇందులో భాగంగా భారత ఉత్పత్తులపై పరస్పర సుంకాలను 25 % నుంచి 18 %కి తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది.

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్ల కారణంగా విధించిన మరో 25% పెనాల్టీ సుంకాన్ని తొలగించేందుకు కూడా అంగీకరించింది. అయితే అదే నెలలో అమెరికా సుప్రీంకోర్టు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద విధించిన పరస్పర సుంకాలను కొట్టివేయడంతో ఒప్పందంపై అనిశ్చితి నెలకొంది.

అమెరికా మార్కెట్‌లో భారత్‌పై విధించే సుంకాలు.. బంగ్లాదేశ్, వియత్నాం, కంబోడియా వంటి పోటీ దేశాలపై విధించే సుంకాల కంటే తక్కువగా ఉండాలని న్యూఢిల్లీ కోరుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా 16 దేశాలపై సుంకాలు విధించాలన్న ట్రంప్ ప్రభుత్వ ఆలోచన భారత్‌-అమెరికా వాణిజ్య చర్చలకు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

అమెరికా సుంకాల వ్యవహారంలో చైనా పారిశ్రామిక ఉత్పత్తుల అంశం కూడా కీలకంగా మారింది. కార్లు, సోలార్ ప్యానెళ్లు, సిమెంట్, స్టీల్ వంటి రంగాల్లో చైనా ఉత్పత్తి సామర్థ్యంపై పలు వాణిజ్య భాగస్వామ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశీయంగా డిమాండ్ తగ్గడంతో చైనా కంపెనీలు తమ ఉత్పత్తులను విదేశీ మార్కెట్లలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

అయితే కొత్త సుంకాల విషయంలో ట్రంప్‌కు అమెరికా కాంగ్రెస్ నుంచి కూడా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లో డెమొక్రాట్లకు మెజారిటీ వచ్చినా.. సుంకాలను రద్దు చేయడానికి లేదా తగ్గించడానికి ఆమోదించే బిల్లులను అధ్యక్షుడు వీటో చేసే అధికారం ట్రంప్‌కు ఉంది.

మొత్తం మీద, అమెరికా కొత్తగా ప్రతిపాదిస్తున్న దిగుమతి సుంకాలు భారత్‌తో పాటు ఇతర వాణిజ్య భాగస్వామ్య దేశాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం ఎలా మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్