Burning Topic: H-1B వీసాలపై భారతీయులకు బిగ్ షాక్..!

Burning Topic: అమెరికాలో హెచ్‌-1బీ, ఓపీటీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు ప్రతిపాదన. భారతీయ నిపుణులు, విద్యార్థులకు భారీ ఎదురుదెబ్బ. ట్రంప్ కొత్త ఇమిగ్రేషన్ నిబంధనలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Aug 2026 11:00 AM IST
Burning Topic
X

Burning Topic: H-1B వీసాలపై భారతీయులకు బిగ్ షాక్..! 

Burning Topic: రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన ఇమిగ్రేషన్ సంస్కరణలు డాలర్ డ్రీమర్స్ ఆశల మీద నీళ్లు జల్లుతున్నాయి.

ట్రంప్‌ వీసాల విషయంలో మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగాలు, చదువుల కోసం వెళ్లే వారికి ట్రంప్‌ యంత్రాం తీసుకురాబోతున్న కొత్త నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్‌-1బీ, ఎఫ్‌-1, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లపై భారీ ఫీజులు విధించే ప్రతిపాదనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఈ వీసా దరఖాస్తులపై కొత్తగా 1,03,265 డాలర్ల రుసుమును ప్రతిపాదించారు. అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ మినహాయింపునకు అర్హత ఉన్నవారు సహా హెచ్‌-1బీ వీసా క్యాప్‌ పరిధిలోకి వచ్చే అన్ని దరఖాస్తులకు ఇది వర్తిస్తుందని అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ తెలిపింది. హెచ్‌-1బీ వీసా క్యాప్‌ మినహాయింపు ఉన్న దరఖాస్తులకు మాత్రం ఈ రుసుము వర్తించదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఉన్న హెచ్‌-1బీ దరఖాస్తు రుసుముతో కలిపి కాకుండా.. ప్రత్యేక, అదనపు ఫీజుగా ఈ 1,03,265 డాలర్లను వసూలు చేయనున్నారు. ఈ మేరకు ఫెడరల్‌ రిజిస్టర్‌లో ఒక నోట్‌ను పోస్ట్‌ చేశారు. దీన్ని అధికారికంగా ప్రచురించి.. 30 రోజుల వరకు ప్రజాభిప్రాయాలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.

ఈ సంవత్సరం చివరినాటికి కొత్త రుసుమును అమల్లోకి తీసుకురావాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ భావిస్తోంది. హెచ్‌-1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయాలన్న ట్రంప్‌ సర్కారు ప్రణాళికకు న్యాయస్థానంలో ఇప్పటికే చుక్కెదురవగా.. మళ్లీ ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం గమనార్హం.

దీన్ని సవాలు చేస్తూ కూడా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో చదువు, ఉపాధి అవకాశాల ప్రయత్నించేవారిలో ఎక్కువగా భారతీయ విద్యార్థులు, నిపుణులలే ఉంటారు. రోజు రోజుకీ మారుతున్న నిబంధనలు వారికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే అమెరికాలో స్థిరపడాలని కలలుగనే భారతీయ నిపుణులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. 2024లో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ 3,99,402 H-1B పిటిషన్లను ఆమోదించగా, అందులో ఇండియాలో జన్మించిన వారికి సంబంధించిన లబ్ధిదారుల వాటా దాదాపు 71 శాతంగా ఉంది.

అందువల్ల H-1B ఫీజు భారీగా పెరిగితే అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయ నిపుణులు, వారిని స్పాన్సర్‌ చేసే కంపెనీలపై ఆర్థిక భారం గణనీయంగా పెరగవచ్చు.కొత్త ఫీజులతో పాటు H-1B ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనను కూడా ఉంది.

H-1B ఉద్యోగం కోల్పోయినవారు 60 రోజుల వరకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నిబంధన తొలగిస్తే.. ఉద్యోగం ముగిసిన వెంటనే కొత్త మార్గం చూసుకోవాల్సి రావచ్చు. లేదంటే అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ స్టేటస్‌ ఉల్లంఘనకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

అమెరికాలో చాలామంది భారతీయ విద్యార్థులు ఎఫ్‌-1 విద్యార్థి వీసాతో అమెరికాలో ప్రవేశించి.. అక్కడ చదువు పూర్తయ్యాక ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ ద్వారా తమ రంగంలో పని చేస్తుంటారు. అయితే ఓపీటీ కార్యక్రమంపైనా కొత్త ఫీజు విధించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.

ఈ ఫీజు సుమారు 1 లక్ష డాలర్ల వరకు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే అసలు ఫీజు ఎంత, ఎవరికి వర్తిస్తుంది వంటి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ పరిశీలన దశలో ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్‌ సంస్థలు చెబుతున్నాయి.

ఇప్పటికే H-1Bపై ఆధారపడుతున్న భారతీయ టెక్‌ నిపుణులు, అమెరికాలో చదువుతున్న విద్యార్థులు, వారిని నియమించుకునే కంపెనీల్లో ఈ ప్రతిపాదనలు తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికాలో భారతీయ మూలాలున్న వారి సంఖ్య 52 లక్షలకు పైగా ఉండటంతో, ఇమ్మిగ్రేషన్‌ విధానాల్లో వచ్చే మార్పులు భారతీయులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరోవైపు అమెరికా ప్రభుత్వం సుమారు 2 లక్షల మంది విదేశీయుల వ్యాపార, పర్యాటక వీసాలను రద్దు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2016-2026 మధ్య జారీ చేసిన బీ1, బీ2 వీసాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఇదే జరిగితే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సామూహిక వీసాల రద్దుగా నిలిచే అవకాశం ఉంది.

వ్యాపార ప్రయాణాల కోసం B1 వీసాలు జారీ చేస్తారు. పర్యాటకం, కుటుంబ సందర్శనలు, వైద్య చికిత్సల కోసం B2 వీసా జారీ చేస్తారు. అయితే స్వల్పకాలం సందర్శన కోసం వచ్చే కొందరు విదేశీయులు అక్కడే శాశ్వతంగా నివాసం ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అటువంటి నాన్-ఇమిగ్రెంట్ వీసాలను గుర్తించి.. రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఈ వీసాలు రద్దు చేసినప్పటికీ వారిని తక్షణమే దేశం నుంచి బహిష్కరించబోరని.. పునర్‌వర్గీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి కొత్తగా వస్తున్న నిబంధనలన్నీ భారతీయులకు ఆందోళన కలిగించేవే..


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story