Burning Topic: వెనెజువెలా చమురును దక్కించుకున్న అమెరికా!

Burning Topic: అమెరికా చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. 65 బిలియన్‌ బ్యారెళ్ల చమురు నిల్వలపై మెజారిటీ నియంత్రణ సాధించినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Aug 2026 6:49 AM IST
Burning Topic
X

Burning Topic: వెనెజువెలా చమురును దక్కించుకున్న అమెరికా!

Burning Topic: ప్రపంచ చమురు రంగంలో సంచలనం చోటు చేసుకుంది. వెనెజువెలాకు చెందిన సుమారు 65 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలను స్వాధీనం చేసుకునేలా ఈ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్‌తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ జరిగిన చర్చల అనంతరం ఈ భారీ ఒప్పందం ఖరారైందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ట్రంప్. వె వారాలపాటు కొనసాగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరిందన్నారు.

అమెరికా పన్ను చెల్లింపుదారులపై అదనపు భారం లేకుండానే ఈ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఇంధన ఒప్పందం అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం వల్ల అమెరికా చమురు నిల్వలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరుగుతాయని చెప్పారు.

దేశీయంగా చమురు సరఫరా గణనీయంగా పెరగడంతో భవిష్యత్తులో గ్యాసోలిన్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని మార్కో రూబియో తెలిపారు. అమెరికాకు స్థిరమైన, తక్కువ ధరకు ముడి చమురు లభించే అవకాశం ఉంటుందని, తద్వారా పెట్రోల్‌ ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

వెనెజువెలాలో దాదాపు 100 బిలియన్‌ డాలర్ల మేర ప్రైవేటు పెట్టుబడులు రావచ్చని, వేలాది అధిక వేతన ఉద్యోగాలు ఏర్పడటంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు.

కాగా 65 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలపై అమెరికాకు నియంత్రణ ఏ విధంగా లభిస్తుంది? అసలు ఈ ఒప్పందం ఏ రూపంలో అమలు కానుందనే స్పష్టత ఇవ్వలేదు. ఏ చమురు క్షేత్రాలు ఇందులో భాగం కానున్నాయి? ఏ కంపెనీలు పాల్గొంటాయి? ఒప్పందానికి సంబంధించిన చట్టబద్దత, పెట్టుబడుల విధానం, చమురు క్షేత్రాల ఎంపిక స్పష్టమైన తర్వాతే ఈ డీల్‌ ప్రభావం ఎంత ఉంటుందో అంచనా వేయగలమని నిపుణులు చెబుతున్నారు.

వెనెజువెలా చమురు రంగం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్ ఎప్పటి నుంచో కన్నేశారు. 1999లో వెనెజువెలాలో అధికారంలోకి వచ్చిన హ్యూగో చావెజ్ ఆ దేశంలోని చమురు కంపెనీలన్నింటినీ జాతీయం చేశారు.

ఈ నిర్ణయం అమెరికాను ఆర్థికంగా, రాజకీయంగా పెద్ద దెబ్బ తింది. అమెరికా చమురు కంపెనీలు వెనెజువెలాలో వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. జాతీయం చేయడం వల్ల తమ బిలియన్ల డాలర్ల ఆస్తులను, చమురు బావులను రాత్రికి రాత్రే కోల్పోయాయి.

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెనిజువెలా చమురు పరిశ్రమను అమెరికా కంపెనీలకు తిరిగి అప్పగించాలనే ప్రతిపాదనను తీసుకొచ్చారు. వెనెజువలా అధ్యక్షుడు నికొలస్‌ మదురో అమెరికా అధ్యక్షుడిని మొదటి నుంచి లెక్క చేయలేదు.

దీంతో ఈ ఏడాది జనవరి 3వ తేదీన నార్కోటెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలపై వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య జరిపి మదురోను అరెస్టు చేసి తమ దేశానికి తరలించింది. నికొలస్‌ మదురోను సైనిక చర్య అధ్యక్ష ద్వారా పదవి నుంచి తొలగించిన తర్వాత వెనెజువెలా చమురు రంగంపై అమెరికా దృష్టి మరింత పెరిగింది.

అమెరికా రిఫైనరీలకు స్థిరమైన ముడి చమురు సరఫరా ఉండేలా చూడటంతోపాటు అమెరికా కంపెనీల పెట్టుబడులను ప్రోత్సహించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మదురోను తొలగించిన దాదాపు 8 నెలల తర్వాత వెనెజువెలా చమురుపై ఒప్పందం కుర్చుకోవడం సంచలనం సృష్టిస్తోంది.

ప్రస్తుతం డెల్సీ రోడ్రిగెస్‌ అక్కడ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నారు. మదురోను తొలగించిన తర్వాత ఆమె అమెరికాకు విధేయురాలిగా మారారు. తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతుండగా, అమెరికా దేశ చమురు నిల్వలపై నియంత్రణ సాధించేందుకు ఈ ఒప్పందాన్ని ప్రకటించింది.

వచ్చే వారం వెనెజువెలా అధికారులు అమెరికా సంస్థలకు, చమురు అన్వేషణ, ఉత్పత్తి హక్కులు కల్పించే ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం వెనెజువెలా. అక్కడ మొత్తం 303 బిలియన్‌ బ్యారెళ్ల వరకు ముడి చమురు నిల్వలు ఉన్నట్లు అంచనా.

ఇది ప్రపంచ చమురు నిల్వల్లో దాదాపు 17 శాతానికి సమానం. అయితే అక్కడి చమురు పరిశ్రమ సంవత్సరాల తరబడి పెట్టుబడుల కొరత, నిర్వహణ లోపాలు, ఆంక్షల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. భారీ నిల్వలు ఉన్నప్పటికీ ప్రస్తుతం రోజుకు సుమారు 12.5 లక్షల బ్యారెళ్ల చమురును మాత్రమే ఉత్పత్తి చేస్తోంది.

ప్రస్తుతం ప్రపంచ చమురు ఉత్పత్తిలో వెనిజువెలా వాటా సుమారు 1 శాతంగా ఉందని అంచనా. ఈ పరిస్థితిని మార్చి వెనెజువెలా చమురు ఉత్పత్తిని పెంచడం, అమెరికా రిఫైనరీలకు అదనపు ముడి చమురును అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు ట్రంప్.

ఈ ఒప్పందం అమెరికాకు భాగానే ఉపయోగంగా ఉన్నా వెనెజులాకు ఎలా మేలు చేస్తుందో తెలియదు. ఆ దేశం అధికారికంగా స్పందించలేదు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత ఆర్నెళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. దీంతో అగ్రరాజ్యంలో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు కూడా గణనీయంగా తగ్గాయి.

జనవరి నుంచి 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా తగ్గిన అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వలు, ఆగస్టు ప్రారంభానికి 300 మిలియన్ బ్యారెళ్ల కంటే దిగువకు పడిపోయాయి. దీంతో ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

మరోవైపు హర్ముజ్ జలసంధిలో సైతం ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో దేశంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా గ్యాస్ నిల్వలు పెంచుకోవడానికి వెనెజువెలాతో ట్రంప్ ఈ భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

దీని ప్రకారం.. వెనెజువెలా చమురు ఉత్పత్తిలో కొంతమేర యాజమాన్య వాటాతో సహా అసలు ధరకే కొనుగోలు చేసే హక్కు అమెరికాకు ఉంటుందని చెబుతున్నారు. అయితే అగ్రరాజ్యంలో చమురు రేట్లు వెంటనే తగ్గేపరిస్థితి ఉండదని నిపుణులు చెబుతున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story