Burning Topic: ఇరాన్ పై ట్రంప్ వ్యూహం.. ప్రపంచానికి ముప్పు తప్పదా?
Burning Topic: అమెరికా మరియు ఇరాన్ మధ్య ముదురుతున్న వివాదం! హర్మూజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ప్రపంచ దేశాలపై పడే ప్రభావం ఏంటి? చమురు ధరలు 150 డాలర్లకు చేరుకోనున్నాయా?
Burning Topic: ఇరాన్ పై ట్రంప్ వ్యూహం..ప్రపంచానికి ముప్పు తప్పదా?
Burning Topic: ఇరాన్‌తో శాంతిచర్చలు విఫలమవడంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మూజ్ జలసంధిని దిగ్భంధించాలని తమ నావికాదళానికి ఆదేశాలిచ్చారు. ఇందులో నౌకలు ప్రవేశించకుండా, తిరిగి వెళ్లకుండా అమెరికా నౌకలు త్వరలో ఆపరేషన్ మొదలుపెడతాయన్నారు. హర్మూజ్‌ను తెరుస్తామని వాగ్దానం చేసిన ఇరాన్ వాగ్దానం మాట తప్పిందన్నారు. ఈ చర్యలతో అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో సుదీర్ఘ పోస్టు చేశారు. హర్మూజ్‌లో ఇరాన్‌కు సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెంబడించి అడ్డుకోవాలని తమ నౌకాదళానికి ఆదేశాలు ఇచ్చారు ట్రంప్. ఈ టోల్ చెల్లించే ఎవరికీ అంతర్జాతీయ సముద్రాలపై సురక్షితమైన ప్రయాణం ఉండబోదన్నారు. ఇరాన్‌కు డబ్బులే కావాలి. మరీ ముఖ్యంగా అణ్వాయుధం కావాలి. అందుకే మేం హార్మూజ్‌ను దిగ్భందిస్తాం అని వ్యాఖ్యానించారు ట్రంప్. శాంతియుతంగా వెళ్లే నౌకలపై దాడులు చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందన్నారు.
హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామంటూ అమెరికా చేసిన ప్రకటనతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ నౌకాదళ విభాగం హర్మూజ్‌లో కీలకమైన నౌకామార్గం పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసింది. అమెరికన్ యుద్ధ నౌకలు హార్మూజ్ జలసంధిలో అడుగుపెట్టడాన్ని IRGC నేవీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. శత్రువులు ఏ చిన్న పొరపాటు చేసినా.. ప్రాణాంతక సుడిగుండాల్లో చిక్కుకుపోతారని హెచ్చరించింది. అమెరికా హార్మూజ్ ప్రాంతంలో చేపట్టిన మైన్-క్లియరింగ్ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా ఇరాన్ ఈ హెచ్చరికలు చేసింది. తమ నేవీ రేడియో సంకేతాల ద్వారా అమెరికా నౌకలకు 30 నిమిషాల గడువు ఇచ్చిందని, ఆ గడువు దాటితే దాడులు తప్పవని హెచ్చరించినట్లు పేర్కొంది. డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ పెంచామని, జలసంధిపై తమకు తిరుగులేని నియంత్రణ ఉందని వారు స్పష్టం చేశారు. హర్మూజ్‌లో 800కు పైగా అంతర్జాతీయ వాణిజ్య నౌకలు నిలిచిపోయాయని తెలుగుస్తోంది.
1980లలో ఇరాన్-ఇరాక్ యుద్ధం తర్వాత ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో హర్మూజ్ జలసంధి మూసివేత జరగలేదు. తాజా యుద్ధంలో తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు హర్మూజ్ ద్వారా పయనించే నౌకలపై రుసుం వసూలు చేస్తామంటోంది ఇరాన్. ఈ మార్గం గుండా సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ, ఇరాన్ దేశాల నుంచి ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరా అవుతోంది. వీటిలో ఎక్కువ భాగం ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా చైనాకు వెళ్తుంది. ఇంతటి కీలకమైన జలసంధి మూసుకుపోతే.. రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది. చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయం అయినా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజలాడిస్తుంది. సుప్రీంనేత ఖమేనీ మృతి చెందడంతో రగిలిపోతున్న ఇరాన్ హర్ముజ్‌ను మూసివేపింది. ఫిబ్రవరి మధ్యలో సైనిక విన్యాసాల కోసం జలసంధిలో కొంతభాగాన్ని ఇరాన్ మూసివేయగా.. అప్పుడు చమురు ధరలు 6 శాతం మేర పెరిగాయి.
ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమైన వేళ మరోసారి అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందంతో 100 డాలర్లకు దిగువకు వచ్చిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 8 శాతం పెరిగి 103 డాలర్లకు చేరింది.. ట్రంప్ హెచ్చరించినట్లు హర్మూజ్‌ను పూర్తిగా దిగ్బంధిస్తే చమురు ధర 150 డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే 20 శాతం క్రూడ్ ఆయిల్, ఎల్‌ఎన్‌జీ ఈ జలమార్గం ద్వారానే వెళ్లాలి. రవాణా నిలిచిపోవడంతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. హర్మూజ్ జలసంధికి ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. పెర్షియన్ గల్ఫ్ నుండి ఓపెన్ సముద్రంలోకి వెళ్లడానికి ఇది ఏకైక మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు ఇరాన్ వ్యాపార అవకాశంగా మారింది. మార్చి మొదటి వారం నుండి ఇది దాదాపుగా మూతపడింది.
తాజా పరిణామాలతో హర్మూజ్ మీదుగా రావాల్సిన 15 భారతీయ నౌకలు ప్రస్తుతం ఈ జలసంధి వద్దే చిక్కుకుపోయాయి. ఈ జలసంధి మార్గంలో మొత్తం 25 భారత నౌకలుండగా.. వీటిలో 10 ఇప్పటికే సురక్షితంగా హర్మూజ్‌ను దాటాయి. వీటిలో ఎల్‌ఎన్‌జీ, ఎల్పీజీ క్వారియర్లు, క్రూడాయిల్ ట్యాంకర్లతో పాటు ఓ కెమికల్ కంటైనర్ కూడా ఉన్నట్టు సమాచారం. భారత నౌకాదళం.. హర్మూజ్‌లో నిలిచిపోయిన వాణిజ్య నౌకలతో సమన్వయం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆరు ఓడలు ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ సమీపంలో మోహరించాయి. భారత్‌కు అవసరమైన ముడి చమురు, సహజ వాయువులో అధిక భాగం హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్రోలియం, విద్యుత్, ఎరువుల రంగాల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. దేశంలో గ్యాస్, పెట్రోల్ , ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాని, సరఫరాలో అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఇప్పటికే ఆదేశించారు
మరోవైపు హర్మూజ్‌లో ఇరాన్‌కు కాదని ఏ వాణిజ్య నౌక కూడా స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం లేదు. ఇందుకు కారణం ఈ జలసంధిలో అమర్చిన సీమైన్స్.. ఫిబ్రవరి నెలాఖరులో తమపైఅమెరికా - ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించగానే ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయం మొదలు పెట్టింది. అందులోకి ప్రవేశించే నౌకలకు నిప్పు పెడతామమని హెచ్చరింది. కొన్ని నౌకలపై దాడులు కూడా జరిగాయి. బహ్రెయిన్, ఖతర్, యూఏఈ, సౌదీల వంటి గల్ఫ్ దేశాల నుంచి ముడిచమురు, పెట్రో సరకులతో బయల్దేరే నౌకలు హార్మూజ్‌ను దాటకూడదనే లక్ష్యంతో ఆ మార్గంలో సీమైన్స్ ఏర్పాటుచేసిన ఇరాన్ ఇప్పుడు వాటి జాడ వెతికేందుకు తిప్పలు పడుతోంది. వాటిని అమర్చేటప్పుడు లేదా నీటిలోకి వదిలేటప్పుడు ఒక క్రమపద్దతిలో నమోదుచేయలేదని తెలుస్తోంది. సీమెన్స్ ఎక్కడెక్కడ పెట్టామో మరచిపోయామని చెబుతోంది ఇరాన్. అంతేగాక సముద్ర జలాల ప్రవాహంతో అవి అటూ ఇటూ కొట్టుకుపోయే ప్రమాదముంది. దీంతో హర్మూజ్‌లో ప్రయాణించే నౌకలకు కొత్త టెన్షన్ పట్టుకుంది
సాధారణంగా యుద్ధం, ఉద్రిక్తతల సమయంలో శత్రువుల నౌకలను దెబ్బతీయడానికి సముద్రం అడుగున పేలుడు పదార్థాలను అమర్చుతారు. వీటినే సీమైన్స్ అంటారు. ఏదైనా నౌక వీటిని తాకినా లేదా వాటి దరిదాపుల్లోకి వచ్చినా వెంటనే పేలిపోతాయి. అప్పుడు జరిగే నష్టం తీవ్రత భారీగా ఉంటుంది.. సీమైన్స్ వేయడం సులభమే కానీ.. తొలగించడం అంత తేలికైన పని కాదు. ఒక్కో బాంబును కనిపెట్టడానికి రోజుల సమయం పడుతుంది. అమెరికా, బ్రిటన్, జపాన్, దేశాల దగ్గర మైన్స్‌ను కనిపెట్టే అధునాతన టెక్నాలజీ ఉంది. ఇటీవల అమెరికా తన డ్రోన్ల ద్వారా ఈ మైన్స్‌ను వెతికే ప్రయత్నం చేయగా, ఇరాన్ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఇరాన్ సీమైన్స్ వేసిన చోట గుర్తుగా కొన్ని చిన్న పడవలను నిలిపి ఉంచింది.. కానీ సముద్రపు అలల ధాటికి ఆ పడవలు అటు ఇటు కొట్టుకుపోయాయి. సముద్రంలో అడుగున ఉన్న సీమైన్స్ కూడా ఒక చోట నుంచి మరోచోటికి కదిలిపోయాయి దీనివల్ల ఇప్పుడు ఏ నౌక ఎప్పుడు పేలుతుందో తెలియని గందరగోళం నెలకొంది. దీంతో అగ్రరాజ్యం తలపట్టుకుంది.




