Off The Record: నామినేటెడ్ పోస్టుల కోసం నిజామాబాద్ నేతల ఎదురుచూపులు!

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల భర్తీకి ముమ్మర కసరత్తు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Aug 2026 11:14 AM IST
Off The Record
X

Off The Record: నామినేటెడ్ పోస్టుల కోసం నిజామాబాద్ నేతల ఎదురుచూపులు!

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో కష్టకాలంలోనూ పార్టీలోనే కొనసాగుతున్న నాయకులకు పదవులు కట్టబెట్టడం ద్వారా రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలని అధిష్టానం ఆలోచిస్తుందట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. పూర్తిస్థాయిలో పార్టీ నేతలకు పదవులు దక్కలేదన్న వాదన లేకపోలేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కొంతమేర పార్టీ నేతలకు అవకాశాలు వచ్చాయి.

మరోవైపు అక్టోబర్ వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదట. దీనికితోడు రాష్ట్రస్థాయి వివిధ కార్పొరేషన్ చైర్మన్‌ల పదవీకాలం ఇటీవల ముగిసింది. ఈ నేపథ్యంలో సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో అధికార పార్టీ నేతలను నియమించి కొందరు నేతల్నైనా సంతృప్తి పరచాలన్న ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందట.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు నేతలు పదవులు కోల్పోయారు. మరో ఇద్దరు నేతల పదవీకాలం త్వరలోనే ముగియనుంది. వచ్చే నెలలో మార్కెట్ కమిటీల పదవీకాలంతోపాటు గ్రంథాలయ సంస్థల చైర్మన్ పదవీ కాలం కూడా ముగియబోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్ పదవులతోపాటు జిల్లా స్థాయిలో పదవులపై సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారట. ఇదివరకు రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్‌లుగా జిల్లాకు చెందిన ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, కాసుల బాలరాజ్ పని చేశారు.

వీరి పదవీకాలం జులై 8న ముగిసింది. ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా ఉన్న తాహీర్ బీన్ అహ్మద్ పదవి మరో ఆరు నెలల్లో ముగియనుండగా.. రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ పదవీకాలం వచ్చే నెలలో ముగుస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం త్వరలో భర్తీ చేసే నామినేటెడ్ పదవుల్లో గతంలో పదవులు దక్కిన వారికి మళ్లీఅవకాశం ఇస్తుందా..? లేక కొత్తవారికి అవకాశం దక్కుతుందా..? అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాలకు ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో గత పాలకవర్గాలే కొనసాగుతున్నాయి. వీటిలో చాలామంది గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వారే ఉన్నారు. వారంతా పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన గ్రామ, మండల కాంగ్రెస్ నేతలు రైతులుగా ఉంటే వారికే నామినేటెడ్ పద్ధతిలో సొసైటీ చైర్మన్, డైరెక్టర్ పదవులు ఇచ్చేందుకు హై కమాండ్ కసరత్తు చేస్తోందట.

ప్రతి మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నందున సీనియర్ లీడర్లకు పదవులు దక్కనున్నాయన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, నియోజకవర్గం స్థాయి నేతల సిఫారసు మేరకు సొసైటీ చైర్మన్, డైరెక్టర్ పదవులను కట్టబెట్టనున్నారని సమాచారం.

పీఏసీఎఎస్‌ల మాదిరిగానే జిల్లా సహకార బ్యాంకు చైర్మన్, డైరెక్టర్ పదవులను నామినేటెడ్ పద్ధతిలోనే నియమించే అవకాశాలు ఉన్నట్లు అధికార పార్టీలో ప్రచారం జోరుగా జరుగుతోంది. డీసీసీబీ చైర్మన్ పదవికి జిల్లా స్థాయి ప్రోటోకాల్ ఉంటుంది. దీంతో ఆ పదవులకు పోటీ సహజంగానే అధికంగా ఉంది.

మాజీమంత్రి సుదర్శన్ రెడ్డికి సన్నిహితుడు డీసీసీబీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు మారా చంద్రమోహన్, మరో సీనియర్ నాయకుడు పురం రెడ్డి, ఇటీవల నగర మేయర్‌గా పోటీ చేసి ఓటమిపాలైన తాటిపల్లి సమంత రెడ్డి భర్త నరేందర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలానికి చెందిన ఘడ్కోలు భాస్కర్ రెడ్డితో పాటు పలువురు డీసీసీబీ కుర్చీని ఆశిస్తున్నారట. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడుగు గంగాధర్ రాష్ట్రస్థాయి చైర్మన్ పదవి ఆశించినప్పటికీ దక్కలేదు. రైతు కమిషన్ సభ్యునిగా ఉన్న ఆయన త్వరలో భర్తీ చేసే రాష్ట్రస్థాయి చైర్మన్ పదవిని ఆశిస్తున్నారట.

ఆయనతోపాటు ఇటీవల పదవీకాలం ముగిసిన వీరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, కాసుల బాలరాజ్ సైతం రాష్ట్రస్థాయి పదవులు దక్కుతాయని ఆశగా ఉన్నట్టు ఊహాగానాలు రీసౌండ్ చేస్తున్నాయి. అయితే సామాజికవర్గాల వారీగా పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నేతలకు ఈసారి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్లు పదవులపై గంపెడ ఆశతో ఉన్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story