Off The Record: ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తప్పా?

Off The Record: మాజీ మిస్ పూణే, నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 May 2026 6:41 AM IST
Off The Record
X

Off The Record: ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తప్పా?

Off The Record: ఆమె ఒక ప్రముఖ మోడల్. నటిగానూ పలు సినిమాలు చేసింది. ఉండేది ఢిల్లీలోని నోయిడాలో. ఈ జర్నీలోనే ఓ డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది. అతను లాయర్. కొన్నేళ్ల పరిచయం అనంతరం.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. దాంపత్య జీవితం ఎంతో బాగుంటుందని ఎన్నో కలలు కన్నది. కన్నవారిని విడిచిపెట్టి.. అత్తింటింటికి వెళ్లింది. కానీ అనుకున్నది ఒకటి అయినది మరొకటి. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అత్తారిల్లే.. నరక కూపలంగా మారింది. ఇక్కడ తాను ఉండలేని దయచేసి నన్ను తీసుకెళ్లండి అని కన్నతల్లికి మెసెజ్‌ చేసి వేడుకునే వరకు భర్త ఇంట్లో నరకయాతన అనుభవించింది. చివరికి.. అదే అత్తింట్లో.. విగత జీవిగా మారింది. కన్నవారికి దూరమై అనంత లోకాలకు చేరింది. ఇది నోయిడాలోని.. ట్విషా మరణ.. విషాద గాథ.

మాజీ మిస్‌ పుణె, ఎంబీఏ గ్రాడ్యుయేట్ ట్విషా శర్మ మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత వారం అత్తవారింట్లో అనుమానాస్పద రీతిలో శవమై కనిపించగా.. ఆమె మరణానికి సంబంధించి పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్విషా శర్మది ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా. 2012లో మిస్‌ పుణెగా నిలిచిన ఆమె.. కొంతకాలం ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తెలుగులో 2021లో వచ్చిన ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రంలో నటించారు. పలు బ్రాండ్లకు ప్రచారకర్తగానూ కనిపించారు. ఒక డేటింగ్ యాప్‌లో పరిచయమైన లాయర్‌ సమర్థ్‌ సింగ్‌ను ప్రేమించి.. 2025, డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. అతడిది మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌. వివాహం జరిగిన ఐదు నెలల తర్వాత ఈ నెల 12న ట్విషా శర్మ అత్తవారింట్లో ఉరివేసుకొని మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి. అంతను ముందు నుంచే అత్తింట్లో వేధింపులు మొదలైనట్టు తల్లికి పలుమార్లు మెసెజ్ పెట్టింది ట్విషా. అమ్మా.. నన్ను బతకనివ్వరు.. తీసుకెళ్లిపోండి’. మృతి చెందడానికి ముందు తన తల్లి, స్నేహితురాలికి ట్విషా పలు సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, తన జీవితం నరకంలా మారిందని ఏప్రిల్ 30న తన తల్లికి సందేశం పంపింది. తాను ఈ వివాహ బంధంలో చిక్కుకుపోయానని, సంతోషంగా లేనంటూ ఆవేదన చెందుతూ తన స్నేహితులకు పంపిన మెసేజ్‌ల్లోనూ రాసింది. దీంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కట్నం కోసం.. అత్తింటివారు వేధింపులకు గురి.. ట్విషాను హత్య చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే..

ట్విషా శర్మ భర్త లాయర్ కాగా.. అత్త గిరిబాలా సింగ్ విశ్రాంత న్యాయమూర్తి. తమకు ఉన్న పరిచయాలతో.. కేసును పక్కదారి పట్టిస్తున్నారని, వ్యవస్థలను

మ్యానేజ్ చేసి.. ఆత్మహత్యాగా చిత్రీకరిస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెను చంపేసి.. ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించారని, తమ కుమార్తె మరణానికి ఆమె భర్త, అత్తే కారణమని ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భోపాల్‌లోని కటారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. వరకట్న వేధింపుల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం భర్త సమర్థ్‌ పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఐతే పోలీసులు మాత్రం..ట్విషా తన అత్తగారింటి టెర్రస్‌లో జిమ్ పరికరాన్ని ఉపయోగించి ఉరివేసుకున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక కూడా పోస్టుమార్టం ఫలితాలతో సరిపోలిందని కమిషనర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేందుకు, అసలు వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సీబీఐ ఎక్వైంరీకి అప్పగించింది.

తొలుత నిర్వహించిన పోస్టు మార్టంలో తనకు తానే హానీ చేసుకుందని రిపోర్ట్‌ రాగా.. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో రెండో పోస్ట్‌మార్టానికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఆమె భర్త సమర్థ్‌సింగ్ కూడా లొంగిపోవాలని సూచించింది. పిటిషనర్ తరపు న్యాయవాదులు రెండో పోస్ట్‌మర్టం అవసరం అని పట్టుబట్టగా.. వ్యతిరేక పక్షం తీవ్రంగా వ్యతిరేకించారు. భోపాల్ ఎయిమ్స్ నిర్వహించిన పోస్ట్‌మార్టం సరిపోతుందని.. రెండో పోస్ట్‌మార్టం కోరడం వైద్య సమాజాన్ని అవమానించడమేనని వాదించారు. వైద్యుల సామర్థ్యంపై అవిశ్వాసం వ్యక్తం చేయడమేనని ఆరోపించారు. చివరికి వాదనలు అనంతరం రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో అత్తగారు, రిటైర్డ్ జిల్లా జడ్జి గిరిబాలా సింగ్‌కు చిక్కులు మొదలయ్యాయి. గిరిబాలా సింగ్‌కు భోపాల్ పోలీసులు తుది నోటీసు జారీ చేశారు. పలుమార్లు సమన్లు పంపినా దర్యాప్తుకు సహకరించలేదని ఆరోపిస్తూ విచారణ అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. భోపాల్ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మూడు నోటీసులు ఇచ్చామని.. అయినప్పటికీ గిరిబాలా సింగ్ స్పందించలేదని తెలిపారు. అందుకే ఆమె ముందస్తు బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు.

ట్విషా మృతిపై..అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే అత్త, భర్త కలిసే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా..? కేసులో తాము ఇరుక్కోకుండా... గతంలో జడ్జిగా చేసిన తన పరపతిని ఉపయోగించి తమకు అనుకూలంగా రిపోర్టులు వచ్చేలా పక్కదారి పట్టిస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అదనపు కట్నం కోసం ట్విషాను మానసిక వేదనకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా ఆమెను పురిగోల్పారా అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐతే తమకు ఇష్టం లేకపోయినా.. ట్విషా అబార్షన్ చేసుకుందనే వాదనను తెరపైకి తెస్తున్నారు గిరిబాలా సింగ్‌. ఏ కుటుంబానికైనా మొదటి బిడ్డ చాలా ముఖ్యం, కానీ ఆమె మమ్మల్ని ఒక్క క్షణం కూడా సంతోషంగా ఉండనివ్వలేదు. ట్విషా ఫోన్ చేసి తాను MTP మాత్రలు తీసుకున్నానని చెప్పినప్పుడు సమర్థ్ కోర్టులోనే ఉన్నాడు. ఆమె మే 7న ఆ మాత్రలు తీసుకుందని గిరిబాల సింగ్ అన్నారు. భర్త భర్తల మధ్య గొడవకు ఇదే కారణమైందా లేక..

తమపై ఎలాంటి తప్పు లేకుండా ఉండేందుకు.. గిరిబాల సింగ్ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారా అన్న సందేహాలూ కలుగుతున్నాయి. పిల్లల్ని కనాలా వద్దా.. అనేది తల్లి ఇష్టమని. అబార్షన్ చేసుకునే ఆప్షన్ ఒక తల్లిగా ఆమెకు ఉండాదా అనే పాయింట్స్ రేజ్ అవుతున్నాయి. ఇది హత్య అయినా..ఆత్మహత్య అయినా అత్తింటివారిని బాధ్యులుగా చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి సీబీఐ ఎక్వైంరీతో ఏం తేలనుంది. నిజాలు వెలుగు చూస్తాయా..? లేక పవర్‌ ఉన్నవారి చేతిలో వ్యవస్థలు ఆటబొమ్మలుగా మారుతాయా అనేది చూడాలి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story