OPEC Exit: ఒపెక్‌కు యూఏఈ గుడ్‌బై.. చమురు మార్కెట్‌లో పెను మార్పులు! భారత్‌కు లాభమేనా?

OPEC Exit: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఒపెక్ (OPEC) కూటమి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల భారత చమురు కంపెనీలకు తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ లభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక కారణాల విశ్లేషణ.

Arun Chilukuri
Published on: 30 April 2026 7:49 AM IST
OPEC Exit
X

OPEC Exit: ఒపెక్‌కు యూఏఈ గుడ్‌బై.. చమురు మార్కెట్‌లో పెను మార్పులు! భారత్‌కు లాభమేనా?

OPEC Exit: ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌ - అంటే ఒపెక్. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరల్ని శాసించే, నియంత్రించే అంతర్-ప్రభుత్వ సంస్థ ఇది. . ప్రపంచ మార్కెట్‌లో చమురు డిమాండ్, సరఫరాను బట్టి ఉత్పత్తిని పెంచడం, తగ్గించడం ద్వారా ధరలలో స్థిరత్వాన్ని కాపాడి సభ్య దేశాల ప్రయోజనాలను కాపాడటంలో ఒపెక్ కీలక పాత్ర పోషిస్తుంది. 1960లో బాగ్దాద్‌లో ప్రారంభమైన ఒపెక్ ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. ఒపెక్‌లో సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇరాన్, ఇరాక్, కువైట్, వెనిజులాతో పాటు అల్జీరియా, కాంగో, ఈక్వటోరియల్ గినియా, గాబన్, లిబియా, నైజీరియా సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే ఒపెక్‌‌లో 1967 నుంచి ఉన్న యూఏఈ ఇప్పుడు షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ సంస్థ నుంచి బయటకు వస్తున్నట్లు వెల్లడించింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఒపెక్‌లో సౌదీ అరేబియా, ఇరాక్‌ తర్వాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ఉంది. సుదీర్ఘకాలంపాటు సభ్యదేశంగా కొనసాగిన యూఏఈ.. అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేంటన్నది వెల్లడించలేదు. అయితే తమ దేశ ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఒపెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని యూఏఈ తెలిపింది. మార్కెట్ డిమాండ్, పరిస్థితులకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని క్రమంగా పెంచుతామని అని స్పష్టం చేసింది. దేశీయ ఇంధన ఉత్పత్తిపై పెట్టుబడులను మరింత వేగవంతం చేస్తామని వెల్లడించింది. యూఏఈ నిర్ణయం చమురు ఎగుమతి దేశాల కూటమికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు ఇది అతిపెద్ద దెబ్బగా చెబుతున్నారు విశ్లేషకులు. భౌగోళిక ఉద్రిక్తతలు, ఉత్పత్తి పెంపు విషయంలో ఒపెక్‌లో తలెత్తిన అంతర్గత విబేధాల నేపథ్యంలో యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే హర్మూజ్‌ మూసివేతతో చమురు ఎగుమతిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒపెక్‌ దేశాలకు, యూఏఈ తీసుకున్న నిర్ణయం పెద్ధ షాక్ అనే చెప్పవచ్చు. ఇరాన్ దాడుల విషయంలో సౌదీ అరేబియా సహా ప్రాంతీయ మిత్రదేశాలు సరైన రీతిలో స్పందించకపోవడం పట్ల యూఏఈ అసంతృప్తితో ఉంది. 2015లో ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడటానికి యూఏఈ, సౌదీ అరేబియా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అయితే, యూఏఈ మద్దతు ఉన్న యెమెన్ వేర్పాటువాదులకు ఆయుధాల రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ సౌదీ అరేబియా బాంబు దాడి చేయడంతో కూటమిలో విభేదాలు తలెత్తాయి. ఇకపై పశ్చిమాసియాలో స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాలని యూఏఈ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఒపెక్‌ నుంచి యూఏఈ బయటకు తెలుస్తోంది. యూఏఈ తప్పుకోవడంతో భవిష్యత్‌లో ఒపెక్‌ మరింత బలహీనం అవుతుందని చెబుతున్నారు.

తమ దేశ ప్రయోజనాల రీత్యా ఒపెక్ నుంచి యూఏఈ బయటకు రావాలని తీసుకున్న నిర్ణయం వెనుక సౌదీ అరేబియా, పాకిస్థాన్ వైఖరులే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇటీవల యూఏఈపై ఇరాన్ 537 బాలిస్టిక్ క్షిపణులు, 26 క్రూయిజ్ మిసైళ్లు, 2,256 డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడులు యూఏఈ మౌలిక వసతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై చర్యలు చేపట్టింది. ప్రతిగా భారీ నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయంలో పాకిస్థాన్‌ మధ్యవర్తి వ్యవహారంపై యూఏఈ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ మీద కఠిన వైఖరి తీసుకునే విషయంలో పాకిస్థాన్ తటస్థంగా ఉండటంపై యూఏఈ అసంతృప్తితో ఉంది. దీంతో తమకు బాకీగా ఉన్న రుణం 3.5 బిలియన్ డాలర్ల రుణం తక్షణమే తిరిగి చెల్లించమని డిమాండ్ చేసింది. ఇది పాకస్థాన్‌ ఆర్థిక వ్యవస్థకు పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. కాగా యూఏఈ డిమాండ్‌ తర్వాత సౌదీ అరేబియా వెంటనే పాకిస్తాన్‌కు 3 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది.

ఇదిలా ఉండగా.. యూఏఈకి భారత్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. అయితే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మరియు టర్కీ ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. వారి మధ్య త్రైపాక్షిక సైనిక ఒప్పందంపై చర్చ జరుగుతోంది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌, భారత్‌ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. మన దేశ చమురు అవసరాల్లో 85 శాతానికిపైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దిగుమతులు తగ్గి ఇబ్బంది పడుతున్నారం. ఈ నేపథ్యంలో భారత్‌కు అత్యంత సన్నిహిత దేశమైన యూఏఈ.. ఒపెక్ నుంచి బయటికి రావడం మనకు లాభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు యూఏఈ నేరుగా భారత చమురు కంపెనీలతోనే ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. దీంతో మధ్యవర్తులు, ఆంక్షలు లేకుండా తక్కువ ధరకే ముడి చమురు లభించే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ దరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

ఒపెక్ నుంచి బయటకు రావడంతో.. చమురు ఉత్పత్తికి సంబంధించి యూఏఈ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎంత ఉత్పత్తి చేయాలి.. ఎవరికి విక్రయించాలి.. ఇలా అన్నీ యూఏఈ చేతుల్లోనే ఉంటాయి. తమ సరకును ఎప్పుడు.. ఎంతకు అమ్ముకోవాలనేది యూఏఈ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ఉత్పత్తి కోటాల నుండి విముక్తి పొందడంతో రోజుకు 4.8 మిలియన్ బ్యారెల్స్ వరకు ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ మార్కెట్లో సరఫరా పెంచి ధరలను తగ్గిస్తుంది. దీంతో భారత్‌కి క్రూడ్ ఆయిల్ దిగుమతి ఖర్చు తగ్గి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.2022లో భారత్ యూఏఈ నుండి $11 బిలియన్ విలువైన క్రూడ్ దిగుమతి చేసుకోగా, 2026లో ఇది $14 బిలియన్‌కి పెరిగింది. యూఏఈ వాటా భారత్ క్రూడ్ దిగుమతుల్లో 10.3% నుండి 11.4%కి పెరిగింది. యూఏఈతో భారత్ ఎనర్జీ భాగస్వామ్యం మరింత బలపడుతుంది. LNG, LPG రంగాల్లో కూడా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story