Burning Topic: ముక్కలు కావటానికి సిద్ధంగా ఉన్న గ్రేట్ బ్రిటన్!

Burning Topic: బ్రిటన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడేందుకు స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ చారిత్రక ఒప్పందం. ప్రధాని ఆండీ బర్న్‌హామ్‌కు సవాల్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Sept 2026 8:13 AM IST
Burning Topic
X

Burning Topic: ముక్కలు కావటానికి సిద్ధంగా ఉన్న గ్రేట్ బ్రిటన్!

Burning Topic: యునైటెడ్ కింగ్‌డమ్.. యూరోప్‌‌లోని ఓ ప్రధాన దేశంగా, ఒకప్పుడు భారత దేశాన్ని పాలించిన దేశమని చరిత్ర చెబుతుంది. బ్రిటన్, ఇంగ్లాండ్ పేర్లు కూడా వ్యవహారంలో ఉన్నాయి. ఈ దేశానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అనేక ఆక్రమణలు, సామ్రాజ్యాల విస్తరణ, పారిశ్రామిక విప్లవం, ప్రజాస్వామ్య పరిణామాల సమాహారం ఇది.

బ్రిటన్‌లో రాచరిక వ్యవస్థ కొనసాగుతున్నా.. ప్రపంచానికి ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిచయం చేసిన ఘనత బ్రిటన్‌కు ఉంది. బ్రిటన్ పార్లమెంట్‌ను "మదర్ ఆఫ్ పార్లమెంట్స్" అని పిలుస్తారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు నిర్వహించి ప్రధానమంత్రిని ఎన్నుకొని పరిపాలన కొనసాగిస్తున్నారు.

చరిత్రలోకి వెళ్లి చూస్తే 80 ఏళ్ల క్రితం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాలను ఆక్రమించుకుని.. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించిన ఘనత బ్రిటన్‌కు ఉంది.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాలకూ స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఓ చిన్న దేశంగా మిగిలిపోయిన యునైటెడ్ కింగ్‌డమ్‌కు కొత్త ముప్పు పొంచి ఉంది.

ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాన్ని నిర్మించిన బ్రిటన్‌ ప్రభ ఇప్పటికే సమక బారింది. 80 ఏళ్ల క్రితం భారత దేశాన్ని విభజించిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఇప్పుడు నాలుగు దేశాలుగా ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడింది. యునైటెడ్ కింగ్‌డమ్ అంటే బ్రిటన్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ భాగాలు కలిసి ఉన్న సంయుక్త దేశం. కానీ ఇప్పుడు ఆ దేశాల ఐక్యతపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తాజా స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్లు కార్డిఫ్ వేదికగా సమావేశమై ఇంగ్లాండ్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడటానికి అవసరమైన రెఫరెండం, భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే హక్కు ప్రజలకు ఉందని స్పష్టం చేస్తూ ఓ చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం యునైటెడ్ కింగ్‌డమ్‌ నుంచి తాము విడిపోవడానికి రాజ్యాంగ ప్రక్రియను ప్రారంభించాలని ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్‌ను డిమాండు చేశారు.

యునైటెడ్ కింగ్టమ్‌ నుంచి విడిపోయి పూర్తి స్వయం ప్రతిపత్తిగల దేశాలుగా ఉండాలని స్కాట్‌లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ దేశాలు బలంగా కోరుకుంటున్నాయి. స్వాతంత్ర్యాన్ని కోరుకునే ఫస్ట్ మినిస్టర్లు ఒకేసారి అధికారంలో ఉండటం ఇదే తొలిసారి అదే జరిగితే ఆ రాజ్యంలో ఇంగ్లాండ్ ఒకటే మిగులుతుంది.

కార్డిఫ్‌లో జరిగిన సమావేశంలో స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్, ఎస్‌ఎన్‌పీ నేత జాన్ స్విన్నీ, వేల్స్ ఫస్ట్ మినిస్టర్, ప్లాయిడ్ కమ్రీ పార్టీ చీఫ్ రూన్ ఆప్ ఇయర్వర్త్, నార్తర్న్ ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్, సిన్ ఫెయిన్ పార్టీ నేత మిషెల్ పాల్గొన్నారు. వీరు సంతకం చేసిన ఈ అగ్రిమెంటులోని అత్యంత కీలకమైన అంశం స్వయం నిర్ణయాధికారం.

వెస్ట్‌ మినిస్టర్‌‌గా పిలిచే బ్రిటన్‌ పార్లమెంట్, ప్రభుత్వానికి కాలం చెల్లిపోయిందనడానికి ఇంతకు మించిన సంకేతం లేదని ఒప్పందంలో పేర్కొన్నారు.. రాజ్యాంగ మార్పునకు సిద్ధంగా ఉండాలని, తమ భవిష్యత్ యూరోప్ యూనియన్‌తో ముడిపడి ఉందని వీరు ఆండీ బర్నహామ్‌ ప్రభుత్వానికి తెలియజేశారు.

తమ సంస్కృతులను కాపాడుకునేలా సొంత నిర్ణయాలు తామే తీసుకోవాలని స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌ ప్రజలు భావిస్తున్నారని నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా స్కాట్లాండ్‌‌లో స్వతంత్ర దేశంగా మారాలనే ఉద్యమం అత్యంత బలంగా ఉంది. ముఖ్యంగా స్కాటిష్ నేషనల్ పార్టీ ఈ డిమాండ్‌ చేస్తోంది.

వాస్తవానికి 2014లో స్వాతంత్ర్యంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అప్పుడు 55% మంది UKలోనే కొనసాగాలని, 45% మంది స్వాతంత్ర్యానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో స్కాట్లాండ్ స్వాతంత్ర్య ప్రయత్నం అప్పట్లో విఫలమైంది.

అయితే బ్రెగ్జిట్ తర్వాత పరిస్థితులు మారాయని ఎస్‌ఎన్‌పీ వాదిస్తోంది. స్కాట్లాండ్‌ ప్రజలు ఈయూలోనే ఉండాలని అనుకుంటున్నారని, ఈయూ నుంచి బ్రిటన్‌ బయటకు రావడం వారికి నచ్చలేదని, అలాగే తమ ప్రాంతంలోని చమురు సంపదపై నిర్ణయాధికారం తమకే ఉండాలనుకుంటున్నారని చెబుతున్నారు. స్కాటిష్ నేషనల్ పార్టీ మరోసారి స్వాతంత్ర్యంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.

ఇక ఉత్తర ఐర్లాండ్ విషయానికొస్తే.. అక్కడి ప్రజల్లో చాలామంది పక్కనే ఉన్న రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌ దేశంతో కలిసిపోవాలని కోరుకుంటున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌ పాలన నుంచి వేరుపడి, గతంలో తమకున్న గుర్తింపును తిరిగి పొందాలని కోరుకుంటున్నారు.

బ్రెగ్జిట్ కారణంగా వాణిజ్యపరంగా నష్టపోతున్నామని అనుకుంటున్నారు. ఇక తమ చట్టాలను తామే చేసుకోవాలని, తమకంటూ ప్రత్యేకమైన భాష, సంస్కృతిని కాపాడుకోవాలని వేల్స్‌ ప్రజలు ఆశిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ మూడు ప్రాంతాల ఫస్ట్ మినిస్టర్ల డిమాండ్లను ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్‌ పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించలేదు.

ఈ హెచ్చరికను ప్రధాని పక్కనబెట్టారని, రాజ్యాంగ చర్చల కంటే జీవన వ్యయాన్ని తగ్గించడానికి సంబంధించిన చర్యలకే ఆయన ప్రాధాన్యమిస్తున్నారని ఆండీ బర్న్‌హామ్‌ కార్యాలయం స్పష్టం చేసింది. విభజనకు బదులుగా ఉమ్మడి విలువలకు కట్టుబడి, సమస్య పరిష్కారానికి ప్రజలు కలిసి వచ్చినప్పుడే యూకే అత్యుత్తమంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

స్వాతంత్ర్యం, విభజన వంటి రాజ్యాంగ అంశాల కంటే ప్రజల రోజువారీ ఆర్థిక సమస్యలకే ఆండీ బర్న్‌హామ్‌ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం 3దేశాల మధ్య కుదిరిన ఒప్పందానికి తక్షణ చట్టపరమైన బలం లేదు. దీంతో స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ వెంటనే బ్రిటన్ నుంచి విడిపోయే పరిస్థితి లేదు.

అయితే రాజకీయంగా మాత్రం దీని ప్రభావం భారీగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మూడు ప్రాంతాల లక్ష్యాలు, రాజకీయ వ్యూహాలు ఒకేలా లేకపోవడంతో తక్షణమే యునైటెడ్ కింగ్‌డమ్‌ విచ్ఛిన్నమవుతుందని చెప్పలేం. కానీ బ్రిటన్ రాజకీయాల్లో ఐక్యతపై ప్రశ్నలు మరోసారి ప్రధాన రాజకీయ అజెండాగా మారుతున్నాయి.

ఇప్పటివరకు బ్రిటన్‌ను ఒకే దేశంగా నిలబెట్టిన రాజకీయ వ్యవస్థకు ఈ కూటమి పెద్ద సవాల్‌గా మారనుంది. మొత్తం మీద భవిష్యత్తులో “యునైటెడ్ కింగ్‌డమ్” కలిసి ఉంటుందా? లేక బ్రిటన్‌తో ఒక్కొక్క దేశం బ్రేకప్ చెప్తుందా అనే దానికి కాలమే సమాధానం చెప్పనుంది.

కాగా ఇటీవల ఇటీవల రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాను అవి సంయుక్త ఐర్లాండ్‌ను చూడాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. అది ఎప్పటికైనా జరగాల్సిందే.. ఇప్పుడే జరిగితే మంచిదంటూ ఎప్పటి నుంచో ఉన్న వివాదాస్పద అంశాన్ని ప్రస్థావించారు.

ట్రంప్ వ్యాఖ్యలు చేసిన 48 గంటల్లోనే అవగాహన ఒప్పందంపై మూడు దేశాలు సంతకాలు చేయడం గమనార్హం. 1922లో బ్రిటన్ నుంచి ఐర్లాండ్ స్వాతంత్ర్యం పొందింది. అయితే ఉత్తర ఐర్లాండ్ మాత్రం యూకేలో ఉండిపోయింది. మరొక భాగం రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌ స్వతంత్ర దేశంగా మారింది.

కాగా యునైటెడ్ కింగ్‌డమ్‌ విచిన్నమైతే మిలిగే అతి పెద్ద భూభాగం బ్రిటన్. విడిపోతే దాని రాజకీయ, ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఆ పరిస్థితుల్లో ఐర్లాండ్ ఏకీకరణ వంటి ప్రశ్నలు UK భవిష్యత్తును మరింత ప్రమాదంలో పడేయనున్నాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్