Burning Topic: దేశం కోసం రాజీనామా చేసిన బ్రిటన్ ప్రధాని
Burning Topic: బ్రిటన్ రాజకీయాల్లో మరోసారి పెను సంక్షోభం రేగింది. సొంత పార్టీ ఎంపీల తిరుగుబాటుతో లేబర్ పార్టీ ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు.
Burning Topic: దేశం కోసం రాజీనామా చేసిన బ్రిటన్ ప్రధాని
Burning Topic: పదేళ్లలో ఏకంగా ఆరుగురు ప్రధానమంత్రులు మారారు.. ఇప్పడు ఏడో ప్రధానమంత్రి రానున్నారు. బ్రిటన్‌లో అధికార లేబర్ పార్టీలో అంతర్గత తిరుగుబాటు, ఎన్నికల్లో పరాజయాల కారణంగా కీర్ స్టార్మర్ రాజీనామా చేయక తప్పలేదు. ఇప్పుడు కొత్త ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ వస్తారా? మరో కొత్త నాయకుడు తెరపైకి వస్తారా? అన్నది తేలాలి.. బ్రెగ్జిట్‌తో ప్రారంభమైన రాజకీయ అస్థిరత, ఆర్థిక సవాళ్లు, ప్రజల పెరుగుతున్న అసంతృప్తి అక్కడి రాజకీయాలను వెంటాడుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ ఏకంగా ఐదుగురు ప్రధానులను మార్చడంతో విసుగెత్తిన ప్రజలు లేబర్ పార్టీని ఎన్నుకున్నారు. ఇప్పుడు లేబర్ తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన చట్టసభల వ్యవస్థలలో యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్ ఒకటి. దాదాపు 800 సంవత్సరాల చరిత్ర దీని సొంతం. దీన్ని ప్రపంచ పార్లమెంట్ వ్యవస్థకు తల్లిలాంటిదని అభివర్ణిస్తారు. ఇప్పుడు అక్కడి పార్లమెంటరీ ప్రజస్వామ్య వ్యవస్థను చూపి ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చింది. తరచూ ప్రధానమంత్రులు మారిపోవడం అనే కొత్త ఆచారం బ్రిటన్‌లో వచ్చేసిట్లుంది. దశాబ్ద కాలంగా ప్రధానమంత్రి పదవి నుంచి అగ్రనేతలు వైదొలగుతున్న పరిస్థతి కనిపిస్తోంది. ఈ పదేళ్లలో ఆరు ప్రధానమంత్రులు రాగా, ఇప్పుడు ఏడో ప్రధాని రాకకోసం బ్రిటన్ ఎదురు చూస్తోంది.
తాజాగా సమర్థవంతమైన పరిపాలన అందించట్లేడంటూ సొంత లేబర్ పార్టీ ఎంపీల నుంచే తీవ్రస్థాయిలో ఒత్తిడి నేపథ్యంలో బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామాచేశారు. లేబర్ పార్టీ నేత హోదా నుంచీ తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
లండన్‌లోని ప్రధానమంత్రి కార్యాలయం 10, డౌనింగ్ స్ట్రీట్ భవనం నుంచి స్టార్మర్ బయటికొచ్చి మీడియాతో భావోద్వేగంతో మాట్లాడారు. నేను అమితంగా ఇష్టపడే దేశం మరింతగా ముందడుగేసేందుకే నిర్ణయం తీసుకున్నా. అందుకే ఇప్పుడు కూడా దేశం కోసం రాజీనామా చేస్తున్నానని అన్నారు. ‘‘ సెప్టెంబర్‌లో పార్లమెంట్ సమావేశమయ్యేలోపు కొత్త ప్రధాని ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది.
అందుకు నా వంతుగా సాయపడతా. సవాళ్లను ఎదుర్కొనే నేతను బ్రిటన్ ఎన్నుకోబోతోంది. మా పార్టీ మరింత మెరుగ్గా పరిపాలించబోతోందని తెలిపారు. కొత్త నాయకుడి ఎంపిక పూర్తయ్యే వరకు తాను ప్రధానిగా కొనసాగుతానని చెప్పారు. అధికార బదిలీ ప్రశాంతంగా జరిగేలా సహకరిస్తానని వెల్లడించారు. తన జీవితంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం అత్యంత గర్వకారణమని పేర్కొన్న స్టార్మర్, దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయంగా పెంచేందుకు కృషి చేశానని తెలిపారు.
2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో లేబర్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన స్టార్మర్, రెండేళ్లు కూడా పూర్తి కాకముందే పదవి వీడాల్సి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వరుస రాజకీయ సంక్షోభాలు, బ్రెగ్జిట్ ప్రభావం, ఆర్థిక ఇబ్బందులు, ప్రజల అసంతృప్తి కారణంగా బ్రిటన్‌లో ప్రధానులు తరచూ మారుతుండగా, స్టార్మర్ రాజీనామా ఆ జాబితాలో మరో అధ్యాయంగా నిలిచింది.
స్టార్మర్‌పై కొంతకాలంగా సొంత పార్టీ ఎంపీల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. స్టార్మర్ లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్న తన మిత్రుడు పీటర్ మాండెల్సన్‌ను అమెరికాలో బ్రిటన్ రాయబారిగా నియమించడం విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాత సంక్షేమ సంస్కరణలు దెబ్బకొట్టడం, అధిక ధరలు, ట్యాక్స్‌లతో సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎక్కువైంది. ఇటీవలి స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోరంగా వెనుకబడటం, ప్రజాదరణ తగ్గిపోవడం, ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి పెరగడం స్టార్మర్‌పై ఒత్తిడిని పెంచాయి.
బ్రిటన్ సమకాలీన చరిత్రను గమనిస్తే 2016లో బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత రాజకీయ అస్థిరత మొదలైంది. అప్పట్లో బ్రిటన్‌కు నాయకత్వం వహిస్తున్నది డేవిడ్ కామెరూన్. యూరోపియన్ యూనియన్‌లో కొనసాగాలని ప్రచారం చేశారు కామెరాన్. అయితే బ్రిటన్ ప్రజలు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆయన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత థెరిసా మే బాధ్యతలు చేపట్టారు.
ఈయూతో కొత్త ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని పార్లమెంట్ పలుమార్లు తిరస్కరించడంతో ఆమె 2019లో పదవి నుంచి తప్పుకున్నారు. అప్పుడు బోరిస్ జాన్సన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. కాగా, కరోనా లాక్‌డౌన్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించడం ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసింది. మంత్రుల వరుస రాజీనామాలతో 2022లో బోరిస్ ఆయన ప్రధాని పదవి వీడాల్సి వచ్చింది.
బోరిస్ జాన్సన్ తర్వాత లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆమె ప్రతిపాదించిన పన్ను కోతల ప్రణాళిక మార్కెట్లలో తీవ్ర కలకలం రేపింది. దీంతో కేవలం 50 రోజుల్లోనే ఆమె రాజీనామా చేశారు. బ్రిటన్ చరిత్రలో అత్యల్ప కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా లిజ్ ట్రస్ నిలిచారు. ఆ తర్వాత భారత సంతతి నేత రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు. అధిక ద్రవ్యోల్బణం, జీవన వ్యయ సంక్షోభం, వలసల సమస్యల మధ్య ఆయన ప్రభుత్వం పనిచేసింది.
ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కూడా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై పడింది. 2024 ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంతో సునాక్ అధికారాన్ని కోల్పోయారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కీర్ స్టార్మర్ కూడా ప్రజల అంచనాలను అందుకోలేకపోయారు.ఆర్థిక వృద్ధి, జీవన వ్యయ నియంత్రణ, ప్రజా సేవల మెరుగుదల వంటి అంశాల్లో ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో ఒత్తిడి పెరిగింది. చివరకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత పెరగడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది.
కీర్ స్టార్మర్ రాజీనామాతో తదుపరి బ్రిటన్ ప్రధాని ఎవరు అనే ప్రశ్న మొదలైంది. ఇప్పుడు అందరి కళ్లూ గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ మీదే నిలిచాయి. ప్రజలు ఆయన్ని కింగ్ ఆఫ్ నార్త్ అని పిలుస్తారు. ఇటీవల నార్త్ ఇంగ్లాండ్ పార్లమెంటరీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 56 ఏళ్ల బర్న్‌హామ్ విజయం సాధించారు. తదుపరి ప్రధానిగా ఆయన పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. బర్న్‌హామ్ 1970 జనవరి ఏడున ల్యాంక్‌షైర్‌లోని మెర్సీసైడ్‌లో జన్మించారు.
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్య సించారు. 15 ఏళ్ల వయసులోనే లేబర్ పార్టీలో చేరారు. పార్లమెంట్ సభ్యురాలు టెసా జోవెల్ వద్ద పరిశోధకునిగా పనిచేశారు. తర్వాత 1995లో బ్రిటన్‌లో పెద్ద కార్మిక సంఘాల్లో ఒకటైన ట్రాన్స్‌పోర్ట్ అండ్ జనరల్ వర్కర్స్ యూనియన్‌లో సేవలందించారు.001లో లీగ్ నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. గోర్డెన్ బ్రౌన్ హయాంలో ఆర్థిక శాఖలో పనిచేశారు. తర్వాత సాంస్కృతిక శాఖ మంత్రిగా, ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించారు.
ఆండీ బర్న్‌హామ్ 2015, 2017లో రెండు సార్లు పార్టీ అగ్రనాయకత్వ పదవికి కోసం పోటీపడి విఫలమయ్యారు. తర్వాత 2019లో గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ ఎన్నికల్లో నిలబడి విజయం సాధించారు. కన్జర్టేటివ్ ప్రభుత్వ హయాంలో కోవిడ్ సంక్షోభసమయంలో ప్రభుత్వతీరును ఎండగట్టారు. లండన్, ఆగ్నేయ ప్రాంతాలతో పోలిస్తే మాంచెస్టర్ వంటి ఉత్తర ఇంగ్లండ్ ప్రాంతాలకు నిధులు కేటాయింపులు సరిగా లేవని ఉద్యమించారు. దీంతో జాతీయస్థాయిలో ఈయన పేరు మార్మోగిపోయింది.
పార్టీలో బర్న్‌హామ్‌కు ఇప్పటికే 300 మంది ఎంపీల మద్దతు ఉండటంతో ఆయన ఎంపిక నల్లేరుపై నడక అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థులకు ఓటేసేందుకు అర్హులైన సభ్యులు లేదా అనుబంధ సంస్థల సభ్యులు ఎలక్టోరల్ విధానంలో ఓట్లేస్తారు. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన నేతనే ప్రధాని పదవికి అర్హుడవుతారు. జూలై 9వ తేదీ నుంచి పార్టీలో తదుపరి నేత, ప్రధాని పదవుల కోసం నామినేషన్ల ప్రక్రియ ఆరంభంకానుంది. జూలై 17వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తిచేస్తుంది.
బ్రిటన్‌కు ఏడో ప్రధాని ఎవరు అవుతారు? ఆండీ బర్న్‌హామ్ అధికార పగ్గాలు చేపడతారా? లేక మరో కొత్త నాయకుడు తెరపైకి వస్తారా? అన్నది త్వరలో తేలనుంది. అన్నీ సవ్యంగా పూర్తయితే జూలై మూడో వారంలోపే బర్న్‌హామ్‌ను ఏకగ్రీవంగా పార్టీ నేతగా ఎన్నుకునే ఆస్కారముంది. మరోవైపు ల్యారీ అనే పిల్లి వార్తల్లోకి వచ్చింది. 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని బ్రిటన్ ప్రధానమంత్రి అధికార నివాసంలో నివసిస్తున్న ఈ ప్రసిద్ధ పిల్లికి ఎలుకల్ని పట్టుకునేందుకు “ చీఫ్ మౌసర్ ఆఫ్ ది కేబినెట్ ఆఫీస్ ” అనే అధికారిక హోదాను కట్టబెట్టారు. అక్కడ దశాబ్దాలుగా ఇలాంటి ‘మౌసర్ క్యాట్’లను నియమించే సంప్రదాయం ఉంది. ల్యారీ 2011 నుంచి ఇక్కడ నివసిస్తోంది ఈ మార్జాలం10, డౌనింగ్ స్ట్రీట్‌లో గత పదేళ్లలో ఆరుగురు ప్రధాన మంత్రులను చూసింది.




