Burning Topic: పుతిన్‌కు జెలెన్‌స్కీ షాక్ !

Burning Topic: మాస్కోపై ఉక్రెయిన్ 1000 డ్రోన్ల భారీ దాడి. రష్యా ఎన్నికల్లో పుతిన్ పార్టీ విజయం, మరోవైపు ట్రంప్‌తో జెలెన్‌స్కీ కీలక చర్చలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 Sept 2026 7:29 AM IST
Burning Topic
X

Burning Topic: పుతిన్‌కు జెలెన్‌స్కీ షాక్ !

Burning Topic: ఓవైపు రష్యా పార్లమెంట్‌ డ్యూమా ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంటే మరోవైపు భీకర దాడులతో విరుచుకుపడింది ఉక్రెయిన్. గతంలో ఎన్నడూలేని విధంగా రాత్రికి రాత్రే 1000 డ్రోన్లతో ఏకకాలంతో దాడి చేసింది.

రష్యా రాజధాని మాస్కోతో పాటు ఇతర చుట్టుప్రక్కల ఉన్న కీలక సైనిక లక్ష్యాలు, మౌలిక సదుపాయాలపై దాడులకు తెగబడింది ఉక్రెయిన్ ఆర్మీ. అటు రష్యా ఆక్రమిత క్రిమియాపైనా పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది.

ఈ దాడుల్లో మాస్కో ప్రాంతంలో ముగ్గురు, రష్యా ఆధీనంలోని ఖెర్సన్ ప్రాంతంలో మరో ఇద్దరు మరణించినట్లు తెలిపారు అధికారులు. 20 మంది వరకూ గాయపడ్డారు.

ఇది మాస్కో చరిత్రలోనే అతిపెద్ద డ్రోన్‌ దాడి ఇదేనని చెబుతున్నారు. ఈ దాడుల్లో పలు భవనాలు, చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతిన్నాయి. మాస్కో ఆయిల్‌ రిఫైనరీలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాల్లో భారీగా పొగ వ్యాపించింది..

కాగా మాస్కో వైపు దూసుకొచ్చిన 450కుపైగా డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. తాజాగా జరుగుతున్న తమ దేశ పార్లమెంట్ ఎన్నికలను అడ్డుకునేందుకే ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడిందని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ఆరోపించారు.

ఈ దాడిని స్పష్టంగా ప్రణాళిక చేశారని, అయినా శత్రువు అందులో విజయవంతం కాలేదని చెప్పారు. మాస్కోలోని సైనిక సరఫరాలను, విద్యుత్తు వ్యవస్థల్ని స్తంభింపజేసేలా ఈ దాడులకు పాల్పడింది ఉక్రెయిన్.

వీటి కారణంగా మాస్కోలోని ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. పలు విమానాలు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. 21 అంతస్తుల భవనంపై డ్రోన్ కూలిపోవడంతో మంటలు చెలరేగాయి.

దీంతో సుమారు 400 మందిని భవనం నుంచి ఖాళీ చేయించాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల చివరి రోజున అదను చూసి దాడి చేసింది ఉక్రెయిన్.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ సైనిక డ్రోన్ సాంకేతికతలో అగ్రగామిగా నిలిచింది. రష్యా లోపలికి చొచ్చుకెళ్లి దాడులు చేయడానికి, దేశీయంగా ఉత్పత్తి చేసిన సుదూర డ్రోన్‌లతో పాటు క్షిపణులను కూడా మోహరిస్తోంది.

ఉక్రెయిన్​ డ్రోన్ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలను, రక్షణ పరికరాల తయారీదారులను ఆకట్టుకుంటోంది. ఈ దాడులను విజయవంతం చేసిన తమ సైనిక సిబ్బంది, గూఢచర్య విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.

“గత రాత్రి మాస్కో ప్రాంతంలో మా దాడులు చాలా ప్రభావాన్ని చూపించాయి. రష్యా చమురు పరిశ్రమలోని కీలక సదుపాయాతో పాటు. అనేక లాజిస్టిక్స్‌కు కూడా దెబ్బతిన్నాయి..

రష్యా యుద్ధ యంత్రాంగాన్ని నడిపిస్తున్న బిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు జెలెన్‌స్కీ. ఇకనైనా మాస్కో యుద్ధాన్ని ముగించి, శాంతి దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నట్లు జెలెన్​స్కీ తెలిపారు.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాపై జరిగిన అతిపెద్ద ఇదేనని విశ్లేషకులు తెలిపారు. ఈ భారీ స్థాయి దాడి రష్యా ఎన్నికల చివరి రోజునే జరగడం యాదృచ్ఛికం కాదని అంటున్నారు.

కాగా ఉక్రెయిన్‌ దాడులతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా రక్షణ వ్యూహాన్ని సమీక్షించి, అవసరమైతే తమ న్యూక్లియర్ ట్రయాడ్‌ను సిద్ధంగా ఉంచే అంశాలపై దృష్టి సారించినట్లు సంకేతాలు ఇచ్చారు.

ఆ తర్వాత కొద్ది సేపటికే ఉక్రెయిన్ మీద వైమానిక దాడులను తీవ్రం చేసింది రష్యా. రాజధాని కీవ్‌తో పాటు సుమీ, ఒడేసా ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా జరిపిన దాడుల్లో కీవ్ ప్రాంతంలో కనీసం నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.

మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్‌లు ఒకరిపై ఒకరు సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణి దాడులను మరింత తీవ్రతరం చేస్తున్న సమయంలో ఈ తాజా దాడులు చోటుచేసుకున్నాయి.

కాగా రష్యా పార్లమెంట్ డ్యూమా ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అనుకూలంగా వచ్చాయి. ఐదేళ్ల క్రితం ఉక్రెయిన్ మీద యుద్ధం ఆరంభించినప్పటి నుంచి రష్యా అనేక ఆర్ధిక ఇబ్బందులకు ఎదుర్కొంది.

అయినప్పటికీ పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీకి 57.5 శాతం ఓట్లు లభించాయి. 450 సీట్లు ఉన్న డ్యూమాలో యునైటెడ్ రష్యా పార్టీ రికార్డు స్థాయిలో 355 సీట్లను కైవసం చేసుకుంది.

ఈ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ 40 సీట్లతో రెండవ స్థానంలో నిలవగా, లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి 25 సీట్లు, న్యూ పీపుల్ పార్టీకి 20 సీట్లు దక్కాయి. దేశ వ్యాప్తంగా 11.1కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 2014లో ఉక్రెయిన్‌ నుంచి స్వాధీనం చేసుకున్న క్రిమియాలోని ఓటర్లు కూడా ఇందులో పాల్గొనడం గమనార్హం.

రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో కూడా పోలింగ్‌ నిర్వహించడాన్ని ఉక్రెయిన్ తప్పుబట్టింది. కాగా పుతిన్ విధానాలను వ్యతిరేకించే ప్రతిపక్షం దాదాపుగా లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి

మరోవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలను మళ్లీ మొదలు పెట్టింది అమెరికా. ఈ దిశగాడొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ‌తో ఫోన్‌లో చర్చించారు..

ఐక్యరాజ్య సమతి సమావేశాల నేపథ్యంలో ఇద్దరూ న్యూయార్క్‌లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ భేటీ ద్వారా యుద్ధాన్ని ముగించే దిశగా తదుపరి చర్యలపై చర్చించే అవకాశం ఉందని జెలెన్‌స్కీ తెలిపారు.

నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి పరిష్కారం కనుగొనడం తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ట్రంప్‌తో చర్చల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు తీసుకోగల చర్యలు, భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై ఆలోచనలు చర్చకు వచ్చినట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఇంధన భద్రత, ఆహార భద్రత, ప్రజల ప్రాణాల రక్షణ వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్