Big Story: తెర మీదకు మరోసారి క్యూబా..!
Big Story: క్యూబాపై అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి తీర్మానానికి భారత్ మద్దతు. ఐరాసలో మాట్లాడిన సౌమ్యా నాయర్, పర్వతనేని హరీష్.
Big Story: తెర మీదకు మరోసారి క్యూబా..!
Big Story: క్యూబాపై అమెరికా దీర్ఘకాలంగా కొనసాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే చట్టాలను తాము తిరస్కరిస్తున్నామని భారత్ స్పష్టం చేసింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 130 ఓట్లు పడగా, 17 వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో 25 దేశాలు సమావేశానికి హాజరు కాలేదు.దీంతో సదరు తీర్మానం ఆమోదం పొందింది.
కాగా 1960ల నుంచి క్యూబాపై అమెరికా ఆంక్షలు విధించింది. ప్రధానంగా క్యూబాను ఆర్థికంగా దెబ్బతీయడమే అమెరికా ఆంక్షల అసలు ఉద్దేశం. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా అనేక రంగాల్లో క్యూబా పురోగతి దెబ్బతిన్నది. ప్రధానంగా క్యూబా ఆరోగ్యరంగంపై ఆంక్షల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.క్యూబాలో 60 శాతానికి పైగా అత్యవసర మందులు అలాగే వైద్య సామాగ్రికి తీవ్ర కొరత ఏర్పడింది.
కాగా తాజా తీర్మానానికి చట్టబద్ధత ఉండదు. అయితే ఆంక్షలు పూర్తిగా తొలగిపోవాలంటే అమెరికా తన అంతర్గత చట్టాల ద్వారా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంగతి ఎలాగున్నా క్యూబా పై విధించిన ఆంక్షల విషయంలో అమెరికాకు కొంతకాలంగా ప్రపంచదేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం అంతర్జాతీయ సవాళ్లను చర్చలు, దౌత్యం ద్వారానే ఉత్తమంగా పరిష్కరించవచ్చనదే తమ నమ్మకం అన్నారు సమతిలోని శాశ్వత మిషన్ కు చెందిన సౌమ్యా నాయర్. ఈ స్ఫూర్తితోనే క్యూబా ప్రజల సార్వభౌమాధికారాన్ని తాము గౌరవిస్తున్నట్లు సౌమ్యా నాయర్ వెల్లడించారు.
క్యూబా ప్రజలు అంతర్జాతీయ సహకారంలో మరింత పూర్తిస్థాయిలో పాల్గొనాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు.. వారి చట్టబద్ధమైన అభివృద్ధి ఆకాంక్షలను కొనసాగించడానికి వీలు కల్పించే వాతావరణాన్ని సృష్టించడం కూడా ముఖ్యమని సౌమ్యా నాయర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్యూబాపై అమెరికా చాలా కాలంగా విధించిన ఆంక్షలను వీలైనంత త్వరగా ఎత్తివేస్తారని భారతదేశం ఆశిస్తోందన్నారు. అంతేకాదు అమెరికా విధించి ఆంక్షలు ..క్యూబా అభివ్రుద్దికి విఘాతం కలిగిస్తున్నాయన్నారు. అమెరికా ఆంక్షల కారణంగా క్యూబా ఆరోగ్య వ్యవస్థ 60 శాతానికి పైగా అత్యవసర మందుల కొరతను ఎదుర్కొంటోందని ఆమె వెల్లడించారు. అదే సమయంలో గత ఐదేళ్లలో క్యూబాలో ఆహార ఉత్పత్తి 50 శాతానికి పైగా పడిపోయిందన్నారు.ఆరోగ్య సంరక్షణ, విద్య, నీటి సరఫరా, ఆహార పంపిణీ, రవాణాతో సహా అత్యవసర సేవలకు అమెరికా విధించిన ఆంక్షలు తీవ్ర విఘాతం కలిగించాయన్నారు.
ఇదిలా ఉంటే, రాజకీయ నాయకత్వం, నిర్ణయాత్మక పాత్రల్లో మహిళల ప్రాతినిధ్యానికి ఎప్పుడూ మద్దతుగా ఉంటామని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మహిళల భద్రత, శాంతిపై జరిగిన బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడారు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు, స్త్రీ, పురుషుల మధ్య సమానత్వాన్ని సాధించే లక్ష్యాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తాయో ఐక్యరాజ్యసమితిలో పర్వతనేని హరీష్ వివరించారు.
అంతేకాదు రాజకీయాల్లో అయినా, సాయుధ దళాల్లో అయినా మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభించేలా చూడటంలో భారతదేశం ముందుందని హరీష్ వెల్లడించారు. అలాగే నూతన సాంకేతికత కూడా లింగ అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నాయకత్వ పాత్రల్లో మహిళలకు చోటు కల్పించడంలో నారీ సశక్తికరణ అధినియమ్ 2023 ఒక ప్రధాన ఉదాహరణగా నిలుస్తుందని హరీష్ తెలియచేశారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల సమాజంలో స్పష్టమైన మార్పు వస్తుందన్నారు ఆయన.చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను భారత్ అమలు చేసి చూపించిందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు మూడో వంతు సీట్లను రిజర్వ్ చేస్తూ 1993లో భారతదేశం తీసుకున్న నిర్ణయం పది లక్షలకు పైగా మహిళలను నాయకత్వ పాత్రల్లోకి తీసుకువచ్చిందని పర్వతనేని హరీష్ వెల్లడించారు. అంతేకాదు భారతదేశంలో 2023 మహిళా రిజర్వేషన్ చట్టం ఈ నిబంధనను జాతీయ, రాష్ట్ర శాసనసభలకు కూడా విస్తరించిందన్నారు. అదేవిధంగా, ప్రైవేట్ రంగంలో నిర్ణయాధికార పాత్రల్లో మహిళలకు మార్గం సుగమం చేసే చర్యలు కూడా కొనసాగుతున్నాయన్నారు.




