Burning Topic: ఎల్ నినో ఎఫెక్ట్.. జాడలేని వర్షాలు!
Burning Topic: ఎల్‌నినోతో భారత్‌లో తగ్గిన వర్షపాతం, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం. ఆర్థిక రక్షణకు ప్రభుత్వ ముందస్తు చర్యలు,'సూపర్ ఎల్‌నినో' హెచ్చరికల పూర్తి వివరాలు.
Burning Topic: ఎల్ నినో ఎఫెక్ట్.. జాడలేని వర్షాలు!
Burning Topic: వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేస్తున్నాయో చెప్పడానికి ప్రస్తుతం భారత్‌పై ప్రభావం చూపిస్తున్న ఎల్ నినో స్పష్టమైన ఉదాహరణ. మన దేశానికి జీవనాడి వ్యవసాయరంగం ఎక్కువగా నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది.
దేశంలో కురిసే 70-80% వర్షపాతం ఈ సమయంలోనే నమోదవుతుంది. నైరుతి రుతుపవనాలు ఎప్పటిలానే తొలుత కేరళలోకి జూన్ 4న ప్రవేశించాయి.
జులై 9 నాటికి దేశం మొత్తం వ్యాపించాయి. సెప్టెంబర్ 19న పశ్చిమ రాజస్థాన్ నుంచి నైరుతీ రుతుపవనాల తిరోమనం ప్రారంభమైంది. కానీ ఆశించిన వర్షాలు పడలేదు.
భారత వాతావరణ శాఖ శాఖ నివేదక ప్రకారం జూన్ 4 నుంచి సెప్టెంబర్ 19 వరకు దేశ వ్యాప్తంగా చూస్తే వర్షపాతం లోటు 15 %గా ఉంది. సాధారణంగా నైరుతీ రుతుపవనాల సమయంలో దక్షిణ భారత దేశంలో వర్షపాతం అధికంగా ఉంటుంది.
కానీ ఈసారి ఇక్కడ ఏకంగా 29% లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు మన దేశంలోకి ఆలస్యంగా ప్రవేశించాయి. వర్షాలు కూడా అంతంత మాత్రంగానే పడ్డాయి.
సాధారణంగా జూన్‌లో 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 106.8 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే జూన్ నెలలో దేశవ్యాప్తంగా చూస్తే 35 % లోటు వర్షపాతంనమోదైంది.
కాగా జులై నెలలో సగటు సాధారణ వర్షపాతం 280.5 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది ఏకంగా 283.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే జులై నెలలో సాధారణంకన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇక ఆగస్టులో 213.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
2001 తర్వాత ఆగస్ట్ నెలలో నమోదైన ఏడో అత్యల్ప వర్షపాతం ఇదేనని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితికి ముందుగానే ఊహించినట్లు ఎల్ నినో కారణం. ఈ ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగవచ్చని వాతావరణ శాస్త్రవేత్తల అంచనా.
మన దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షపాతం తగ్గడానికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు.ఎల్‌నినో అంటే ఇక్కడి ఉపరితల జలాలు సాధారణం కంటే అసాధారణంగా వేడెక్కడం.
ప్రస్తుతం పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటి పెరుగుతున్నాయి. ఆగస్టులో ఈ అసాధారణ ఉష్ణోగ్రత 2.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లు పేర్కొన్నారు.
కొన్ని అంచనాల్లో ఇంకా 4 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. ఎల్ నినో కారణంగా వాతావరణంలో వేడి విపరీతంగా పెరుగుతుంది. దీంతో వర్షపాతాలు తగ్గడమే కాకుండా ఉరుములు, మెరుపులు సహా వడగండ్ల వానలకు దారితీస్తుంది.
కొన్ని చోట్ల కురవాల్సిన దాని కంటే తక్కువగా, కొన్ని చోట్ల అకాలంగా కురుస్తుంటాయి. రుతుపవనాలు ముగిసే సమయంలో అకస్మాత్తుగా భారీ వర్షాలు పడే ప్రమాదం కూడా ఉంది
నైరుతి రుతుపవనాలు భారత దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివి. మన దేశ జీడీపీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, మార్కెట్ల గమనాన్ని ఇవి శాసిస్తాయి. దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
దేశంలో పండే ప్రధాన పంటలైన వరి, పత్తి, చెరకు, మొక్కజొన్న, వేరుశనగ, పప్పుధాన్యాల సాగు పూర్తిగా నైరుతి వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. సకాలంలో వర్షాలు పడితే పంటల దిగుబడి పెరిగి, రైతుల ఆదాయం మెరుగవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది.
వర్షాలు సక్రమంగా పడితే దేశంలోని ప్రధాన డ్యామ్‌లు, జలాశయాలు నైరుతి వర్షాల ద్వారానే నిండుతాయి. ఇది రబీ పంటల సాగుకు అవసరమైన నీటిని అందిస్తుంది.
జలాశయాల్లో నీటి నిల్వలు పెరగడం వల్ల తక్కువ ఖర్చుతో కూడిన జలవిద్యుత్ ఉత్పత్తి పెరిగి, పరిశ్రమలకు , గృహాలకు విద్యుత్ కొరత తప్పుతుంది.
ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలోని వాతావరణ మార్పులు భారత్ లోని కోట్లాది రైతుల జీవితాలను, దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ముఖ్యంగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కరవు పరిస్థితుల సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఎల్ నినో పరిస్థితులపై శాస్త్రవేత్తల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలపై దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా 350కిపైగా జిల్లాల్లో వర్షపు నీటిని నిల్వ చేయడం, జల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తక్కువ నీటితో పండే, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలైన పప్పుధాన్యాలు, సజ్జలు వంటి వాటిని సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచుతామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు.
ఐక్యరాజ్యసమితి హెచ్చరికల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఎల్ నినో గత కొన్ని దశాబ్దాల రికార్డులను అధిగమించే స్థాయికి చేరవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీని తీవ్రతను బట్టి శాస్త్రవేత్తలు దీనికి సూపర్ ఎల్ నినో, గాడ్జిల్లా ఎల్ నినో అని పిలుస్తున్నారు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ కూడా ఎల్ నినో ప్రభావం క్రమంగా తీవ్రతరం అవుతున్నదని హెచ్చరించారు.
వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు వ్యవసాయం, నీటి లభ్యత, ఆహార సరఫరాపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఎల్ నినో భారత్ మీదే కాకుండా ఇతర ఆసియా దేశాల మీద కూడా ప్రభావం చూపుతోందని ప్రపంచ ఆహార కార్యక్రమం - డబ్ల్యూపీ హెచ్చరించింది. సుమారు 5 కోట్ల మంది ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
తూర్పు ఆసియాలో ఎల్ నినో ప్రభావం కేవలం వర్షాభావానికే పరిమితం కాకుండా తీవ్ర వేడి, భారీ వర్షాలు, తుపాన్ల రూపంలోనూ కనిపించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
దీని ప్రభావ ఇప్పటికే చైనా, జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల మీద ఇప్పటికే కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావంతో శ్రీలంకలో గత దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నట్లు నివేదిక తెలిపింది.
1.6 లక్షలకుపైగా ప్రజలు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లాంటి ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఆహార భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
ఈ ప్రాంతంలో ఈసారి బియ్యం ఉత్పత్తి 8 నుంచి 10 శాతం వరకు తగ్గవచ్చని చెబుతున్నారు. ఆహార భద్రతను కేవలం వ్యవసాయ సమస్యగా కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా పలు దేశాలు పరిగణిస్తున్నాయి. అనేక దేశాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి.




