Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు ఎవరు ?

Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ విదేశీ విద్య కోసం తప్పుకోవాలని భావిస్తుండటంతో కొత్త నియామకంపై హైకమాండ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 Oct 2026 8:05 AM IST
Off The Record
X

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు ఎవరు ?

Off The Record: కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ పదవికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్ర నాయకత్వం, పార్టీ అధిష్టానం మధ్య వారధిలా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలను ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తారు. వివాదాల పరిష్కారం నుంచి పార్టీ కార్యక్రమాల సమన్వయం వరకు కీలక బాధ్యతలు వారి భుజాలపై ఉంటాయి.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మీనాక్షి నటరాజన్ 2025 ఫిబ్రవరి 14న బాధ్యతలు చేపట్టారు. నిజాయితీ, నిక్కచ్చితనంతో గుర్తింపు పొందిన ఆమె.. పార్టీని క్రమబద్ధీకరించడానికి పలు ప్రయత్నాలు చేశారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఈ బాధ్యతలను నిర్వర్తిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌లో సమన్వయం పెంచేందుకు కృషి చేశారు.

అయితే ప్రస్తుతం మీనాక్షి నటరాజన్‌కు లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి స్కాలర్‌షిప్ లభించినట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం సుమారు పది నెలల పాటు విదేశాలకు వెళ్లే అవకాశం ఉండటంతో బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆమె పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన రిలీవింగ్ అభ్యర్థనను కూడా ఏఐసీసీకి అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది.

కానీ ఈ ప్రతిపాదనకు దాదాపు నెల రోజులు గడుస్తున్నా అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మీనాక్షి నటరాజన్ స్థానంలో కొత్త ఇన్‌చార్జ్‌ను నియమిస్తారా..? లేదా ఆమెనే కొనసాగిస్తారా..? అనే అంశంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.

ఇక ఇదే సమయంలో తెలంగాణ రాజకీయంగా కీలక దశలో ఉంది. ముందున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ విస్తరణ కార్యక్రమాలు, ప్రభుత్వ-పార్టీ సమన్వయం వంటి అంశాలు కాంగ్రెస్‌కు సవాళ్లుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ బాధ్యతలు మరింత కీలకంగా మారుతున్నాయి. అయినప్పటికీ కొత్త నియామకం దిశగా స్పష్టమైన కదలికలు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే కొత్త ఇన్‌చార్జ్ నియామకంపై ఏఐసీసీ స్థాయిలో కసరత్తు జరుగుతోందని సమాచారం. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ముకుల్ వాస్నిక్, శక్తిసిన్హా గోహిల్, అశోక్ గెహ్లాట్ వంటి అనుభవజ్ఞుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా ఈ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్న వర్గాలు, సీనియర్ నాయకుల మధ్య సమన్వయం సాధించడం అంత సులభం కాదని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. అందుకే త్వరగా ఇన్‌చార్జ్ విషయంలో స్పష్టత వస్తే ఎన్నికల సన్నాహకాలకు, పార్టీ అంతర్గత వ్యవహారాలకు వేగం పెరుగుతుందని భావిస్తున్నారు.

ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ అంశం కూడా ఇంకా పూర్తి కాలేదు. రెండేళ్లకు పైగా వివిధ కార్పొరేషన్లు, చైర్మన్ పదవులపై స్పష్టత లేకపోవడం కొంత అసంతృప్తికి కారణమైంది. ఈ అంశాలతోపాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త ఇన్‌చార్జ్ బాధ్యతలు చేపడితే ఈ పెండింగ్ అంశాలపై కూడా ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి.

మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ అంశం ఇప్పుడు పార్టీ అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. మీనాక్షి నటరాజన్ కొనసాగుతారా..? లేక కొత్త ముఖానికి అవకాశం దక్కుతుందా..? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కన్ఫ్యూజన్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు తెరదించి స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా కీలకమైన ఈ సమయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణపై ప్రభావం చూపే అవకాశం ఉంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్