Off The Record: ఉప్పల్ ఎమ్మెల్యేకు సొంత పార్టీలోనే షాక్!
Off The Record: ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డిపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు చేశారు.
Off The Record: ఉప్పల్ ఎమ్మెల్యేకు సొంత పార్టీలోనే షాక్!
Off The Record: ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉప్పల్ డివిజన్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు సమావేశమై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పార్టీ నాయకులతో సమన్వయం లోపించిందని విమర్శించారు.
పార్టీ కార్యకలాపాలు, స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత వంటి అంశాలపై ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు లోకల్ గులాబీ లీడర్లు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప్పల్ పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మరింత చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎమ్మెల్యే వైఖరి కారణంగా కార్యకర్తల్లో నిరుత్సాహం పెరుగుతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు లేకపోవడం వల్ల కొందరు పార్టీని వీడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా పార్టీ అధిష్ఠానం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా ఎమ్మెల్యే పూర్తిగా అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉప్పల్‌లో నెలకొన్న పరిస్థితులపై బీఆర్ఎస్ అధిష్ఠానం వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..ఎమ్మెల్యే వ్యవహారశైలికి సంబంధించిన పూర్తి వివరాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఉప్పల్ బీఆర్ఎస్‌లో కొత్త రాజకీయ చర్చకు దారితీస్తుండగా, పార్టీ అధిష్ఠానం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఒకవైపు సొంత పార్టీలో అసంతృప్తి స్వరాలు వినిపిస్తుండగా, మరోవైపు సీఎం పర్యటనకు ఘన స్వాగత ఏర్పాట్లు చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఏమిటన్నదానిపై ఉప్పల్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు బీఆర్ఎస్ స్థానిక రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అని చర్చించుకుంటున్నారు.




