Burning Topic: ట్రంప్ పెజెష్కియాన్ మధ్య మాటల యుద్ధం!
Burning Topic: ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర వాగ్వాదం. న్యూయార్క్‌లో ఇరు దేశాల అధికారుల మధ్య మూడు గంటల పాటు రహస్య చర్చలు.
Burning Topic: ట్రంప్ పెజెష్కియాన్ మధ్య మాటల యుద్ధం!
Burning Topic: ఐక్యరాజ్య సమితి 81వ సర్వసభ్య సమావేశం సందర్భంగా పశ్చియాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య పోరాటానికి కాస్త బ్రేక్ వచ్చినా, ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఫిబ్రవరి 2026 చివరిలో ఇరాన్‌పై ముందస్తు దాడి చేయగడంతో మొదలైన పోరాట ప్రభావం హర్మూజ్ జలసంధి కేంద్రంగా చమురు సంక్షోభానికి దారి తీయడం తెలిసిందే. ఈ పోరాటంలో అగ్రరాజ్యం ఆశించిన ఫలితాలు ఇప్పటి వరకూ రాకపోగా గ్యాసోలిన్ ధరల పెరుగుదలతో సొంత దేశంలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ఏమాత్రం లొంగేది లేదని ఇరాన్ ధీటుగా బదులివ్వడంతో పాటు ప్రతి దాడులను తీవ్రం చేసింది. కాగా ఐక్యరాజ్య సమితి సమావేశాల కోసం న్యూయార్క్‌లో అడుగు పెట్టిన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అన్ని దేశల దృష్టిని ఆకర్శిస్తున్నారు. సమితి ఆతిధ్య దేశా హోదాలో ఆయనకు అమెరికా వీసా ఇవ్వక తప్పలేదు.
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. తమతో శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోతే ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామని, అవసరమైతే ప్రపంచ పటం నుంచే తుడిచేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై భారీ దాడులను పునఃప్రారంభించాలా వద్దా అనే విషయంపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
ఇరాన్‌పై ఆరు నెలలకు పైగా కొనసాగిస్తున్న యుద్ధాన్ని సమర్థించుకున్నారు. తన చర్యల ద్వారా ఇరాన్ అణ్వాయుధం పొందకుండా నిరోధించామన్నారు. ఇరాన్‌పై యుద్ధం తన రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయదని, వచ్చే రెండున్నరేళ్లు ఈ పదవిలోనే కొనసాగనున్నానని చెప్పారు. ఇరాన్‌పై ఆర్థికంగా ఒత్తిడిని పెంచాలని ఇతర దేశాలకు విజ్ఞప్తి చేసిన ట్రంప్.. ఉగ్రవాదానికి టెహ్రాన్ ప్రధాన స్పాన్సర్ అని ఆరోపించారు. ఈ సమయంలో సభలోనే ఉన్న ఇరాన్ బృందం ట్రంప్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసింది.
మరుసటి రోజున ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొన్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అమెరికా అధ్యక్షుని ప్రసంగానికి ధీటుగా సమాధానం ఇచ్చారు. తమతో ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌ను నామరూపాల్లేకుండా చేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలిపారు. అమెరికా తమను దెబ్బతీసిన మాట వాస్తవమే అయినప్పటికీ, తాము మాత్రం మోకరిల్లలేదన్నారు.
బలవంతపు చర్యలను తాము అంగీకరించబోమన్నారు. అయితే దౌత్యం, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అమెరికా ఉగ్రవాదానికి ఇరాన్ ప్రజలు బలయ్యారని పెజెష్కియాన్ ఆరోపించారు. దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీతోపాటు యుద్ధంలో మరణించిన 150మంది పాఠశాల విద్యార్థుల ఫొటోలను ఆయన ప్రదర్శించారు. తాము ఉగ్రవాదులం కాదని, తమను తాము రక్షించుకున్నామని తెలిపారు. గత 200 ఏళ్లలో తాము ఏ దేశం మీదా దాడులకు దిగలేదని స్పష్టం చేశారు.
అణు తనిఖీల విషయంలో అమెరికా ద్వంద్వ ప్రమాణాలను పెజెష్కియన్ ప్రశ్నించారు. ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు, ఇతర ఆయుధ సామర్థ్యాలు ఉండగా, ఇరాన్ మాత్రం అంతర్జాతీయ తనిఖీల కోసం ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆక్షేపించారు. అణ్వాయుధాలు ఇజ్రాయెల్ చేతిలో ఉండగా, తనిఖీలు చేస్తామంటూ ఇరాన్‌ను వేధిస్తున్నారని విమర్శించారు. శాంతియుత అణు సాంకేతికతను పొందడం ఇరాన్ హక్కు అని ఉద్ఘాటించారు.
పౌర వినియోగ అణు కార్యకలాపాలకు, అణ్వాయుధాల తయారీకి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందన్నారు. శాంతియుత అణు సాంకేతికతపై ఆంక్షలు విధించాలన్న ఆలోచన మానుకోవాలని సూచించారు. ఇతర దేశాల అనుమతితో సంబంధం లేకుండా తమను తాము రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందని ఉద్ఘాటించారు.హార్మూజ్ జలసంధి గుండా ఇరాన్ నౌకల రాకపోకలకు ఇతర దేశాలు అడ్డుకుంటున్నాయని ఆరో పించారు. హార్మూజ్ వల్ల తమకు ప్రయోజనం లేనప్పుడు ఇతర దేశాలు కూడా ప్రయోజనం పొందడానికి వీల్లేదన్నారు.
మరోవైపు న్యూయార్క్‌లో పెజెష్కియాన్‌కు అమెరికా అసాధారణ రీతిలో భద్రత కల్పించింది. యుద్ధం కొనసాగుతున్న సమయంలో శత్రుదేశంలోకి దేశాధినేత వెళ్లడమే అసాధారణ అంశమైతే ప్రత్యర్థికి అత్యున్నత స్థాయిలో భద్రత కల్పించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సమితి సమావేశాల కోసం ఇరాన్ బృందాన్ని దేశంలోకి అనుమతించినప్పటికీ, వారి కదలికలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది.
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో న్యూయార్క్‌లో చర్చలు జరపడానికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు.కాగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఈ చర్చల్లో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు జేర్డ్ కుష్నర్ పాల్గొనగా, ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రాతినిధ్యం వహించారు. ఈ సమావేశం చాలా ఫలవంతమైనది’గా ట్రంప్ అభివర్ణించారు.




