Burning Topic: భారత్‌తో మళ్ళీ కయ్యానికి కాలు దువ్వుతున్న ట్రంప్!

Burning Topic: రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై భారీ సుంకాలు విధించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదం. భారత్‌పై పడే ప్రభావంపై విశ్లేషణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Sept 2026 8:27 AM IST
Burning Topic
X

Burning Topic: భారత్‌తో మళ్ళీ కయ్యానికి కాలు దువ్వుతున్న ట్రంప్!

Burning Topic: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధించేలా డొనాల్డ్‌ ట్రంప్‌కు అధికారం కల్పించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ముందడుగు పడింది. ‘లిండ్సేఓ గ్రాహం శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ యాక్ట్‌ ఆఫ్‌ 2026’ మీద నిర్వహించిన ఓటింగ్ 214–211 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.

ఈ బిల్లులో భారత్‌, చైనా వంటి రష్యా చమురు కొనుగోలు చేసే దాదాపు 10 దేశాలపై గరిష్ఠంగా 100 శాతం టారిఫ్‌ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే, హౌస్‌లో ఈ దశలో జరిగిన ఓటింగ్‌ తుది ఆమోదం కాదు. పూర్తి ఆమోదం పొందిన తర్వాతే అధ్యక్షుడి సంతకం కోసం వైట్‌హౌస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.

కాగా ఈ బిల్లు ఇప్పటికే 86-11తో ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే రష్యా వాణిజ్య భాగస్వామ్య దేశాల పేర్లను నేరుగా ప్రస్తావించలేదు. కేవలం చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకునే ఐదు అతిపెద్ద దేశాలంటూ పేర్కొన్నారు.

కాగా 100 శాతం సుంకాలు ఎదుర్కొనే దేశాల జాబితాలో భారత్‌తో పాటు చైనా, తుర్కియే, అజర్‌బైజాన్‌, హంగేరీ, స్లోవేకియా, యూఏఈ, సింగపూర్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ పేర్లను చేర్చాలని డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుడు స్టేనీ హోయర్‌ ప్రతిపాదించారు. కాగా ఈ బిల్లుపై అమెరికా రాజకీయ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రష్యా సైనిక చర్యలను అడ్డుకోవడానికి ఈ చట్టం ఎంతో అవసరమని కొందరు వాదిస్తుండగా, డెమొక్రాటిక్ పార్టీకి చెందిన మరికొంతమంది నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ సభ్యుడు గ్రెగొరీ మీక్స్ మరో సవరణను ప్రవేశపెడుతూ, అధ్యక్షుడికి అంతలా అపరిమితమైన టారిఫ్ అధికారాలు కట్టబెట్టే సెక్షన్‌ 113 సరికాదని, దీనివల్ల అమెరికాలోనే ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. అధ్యక్షుడికి ఉన్న విస్తృత టారిఫ్ అధికారాల నిబంధనను పూర్తిగా తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఈ బిల్లును తీసుకొచ్చింది. అప్పట్లో దీనిని ట్రంప్‌ ఆర్థిక బంకర్‌ బస్టర్‌గా అభివర్ణించారు. రష్యా అధికారులు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టుల లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు.

సవరణలోని సెక్షన్ 113 ప్రకారం, చట్టం అమల్లోకి వచ్చిన 30 రోజుల్లోగా సంబంధిత దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వస్తువులపై గరిష్ఠంగా 100 శాతం వరకు అదనపు సుంకం విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. ఈ సుంకం ఇప్పటికే ఉన్న ఇతర డ్యూటీలు, పన్నులు, ఫీజులకు అదనంగా ఉంటుందని సవరణలో స్పష్టం చేశారు.

ఈ సవరణ అమల్లోకి వస్తే, రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తున్న భారత్‌ వంటి దేశాలపై అమెరికా తన గరిష్టంగా వంద శాతం వరకు దిగుమతి సుంకాలు విధించేందుకు చట్టపరమైన వెసులుబాటు లభిస్తుంది. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలను ఆ దేశం నుంచి దూరం చేయడం అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది.

రష్యా నుంచి సముద్రమార్గంలో ముడి చమురు కొనుగోలు చేసే అతిపెద్ద దేశాల్లో భారత్, చైనా ఉన్నాయి. దీంతో ఈ సవరణలోని టాప్-5 నిబంధన భారత్‌కు కీలకంగా మారింది. అయితే ఈ సవరణలో భారత్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.

కాగా ఈ బిల్లు పాసైనంత మాత్రాన తక్షణమే భారత్‌పై 100 శాతం టారిఫ్‌ల భారం పడదని, అమెరికా అధ్యక్షుడు ప్రత్యేకంగా ఆ నిర్ణయం తీసుకుంటేనే ఇది వర్తిస్తుందని చెబుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గిస్తున్న దేశాలకు సుంకాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంది.

సహజ వాయువు విషయంలో కొన్ని ప్రత్యేక మినహాయింపులు ప్రతిపాదించారు. కానీ రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురు కొనుగోలు చేసే దేశాలకు అదే తరహా స్పష్టమైన మినహాయింపు కనిపించడం లేదు. అయితే. అమెరికా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని భావిస్తే, కొన్ని ఆంక్షలు, పరిమితులు లేదా సుంకాలను మినహాయించే అవకాశం ఉంటుంది.

నవంబరులో 3న జరిగే మధ్యంతర ఎన్నికలకు ముందే ఈ బిల్లును ఆమోదింపచేసుకోవాలని ట్రంప్‌ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పరిమిత సమయంలో ఎలాంటి సవరణలు ఆమోదం పొందుతాయి? చివరికి ఈ బిల్లు ఎలాంటి రూపు సంతరించుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని గట్టిగా సమర్థిస్తూ, దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించడం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా గట్టిగా నిలబడ్డామనే సంకేతాలను ఓటర్లకు ఇవ్వడానికి అధికార పార్టీ ప్రత్యకంగా ఈ బిల్లును ఒక అస్త్రంగా మలుచుకుంటోంది.

రష్యాపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా దేశంలో తమ దేశభక్తిని, నిబద్ధతను చాటుకోవాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు. ఈ పరిణామాలు భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై తాత్కాలికంగా ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ ఒకటి. ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్‌ తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించింది.

మన దేశ చమురు దిగుమతుల్లో సుమారు 30% నుండి 40% పైగా వాటాను రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రష్యా నుండి సుమారు రూ. 3.4 లక్షల కోట్లు విలువైన ముడి చమురును కొనుగోలు చేసింది. గ్లోబల్ ట్రేడ్ డేటా ప్రకారం, మే 2026లో రష్యా చమురు వాటా 40% దాటగా, జూలై 2026 నాటికి అది ఏకంగా 50.83% కి అంటే రోజుకు దాదాపు 2.47 మిలియన్ బ్యారెళ్లు) చేరి రికార్డు సృష్టించింది.

ఇప్పుడు ప్రతిపాదిత అమెరికా చట్టం అమల్లోకి వస్తే.. రష్యా నుంచి ఇంధన దిగుమతులు కొనసాగించే దేశాలపై అదనపు టారిఫ్‌లకు మార్గం ఏర్పడుతుంది.

మరోవైపు సౌదీ అరేబియాలోని కీలక ఆయిల్ పైప్‌లైన్ మూసివేత భారత చమురు దిగుమతులపై తీవ్రప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్‌కు సౌదీ అరేబియా నుంచి ముడిచమురు దిగుమతులు తక్కువే అయినా దీర్ఘకాలంపాటు అంతరాయం కొనసాగితే దేశీయంగా ఇంధన ధరలపై ప్రభావం పడనుంది.

హూతీ తిరుగుబాటుదారులు జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో సౌదీ ముందుజాగ్రత్త చర్యగా తన 1,200 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్‌ను మూసివేసింది. ఈ పైప్‌లైన్ ద్వారా సౌదీ ఎర్ర సముద్ర తీరానికి రోజుకు సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది.

ఇది ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 4-5శాతంగా ఉంది. సౌదీ పైప్‌లైన్ మూసివేతతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 107 డాలర్లు దాటగా, యూఏఈకి చెందిన మర్బన్ క్రూడ్ 119 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. పశ్చిమ తీరానికి రష్యా నుంచి వచ్చే చమురు సైతం బ్యారెల్‌కు 2.50 డాలర్ల ప్రీమియంలో ఉంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్