Burning Topic: బర్త్ వీసాలపై ట్రంప్ మరో షాక్!
Burning Topic: అమెరికా పౌరసత్వం కోసం సాగే 'బర్త్ టూరిజం'పై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
Burning Topic: బర్త్ వీసాలపై ట్రంప్ మరో షాక్!
Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు షాక్‌నిస్తూ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. పిల్లలకు అమెరికా పౌరసత్వం తెచ్చేందుకు సాగే 'బర్త్ టూరిజం'పై ఉక్కుపాదం మోపారు. కేవలం ఒక్క నెలలోనే 600 మందికి పైగా విదేశీ గర్భిణీల వీసాలను అగ్రరాజ్యం రద్దు చేసింది. వీరంతా 9వ నెల గర్భంతో జులైలోనే అమెరికాకు రావడం గమనార్హం.
యూఎస్ విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్.. ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. పైగా అమెరికా పౌరసత్వం అమ్మకానికి కాదంటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదూ చట్టాలను మోసం చేసే నెట్‌వర్క్‌లను పూర్తిగా అంతమొందిస్తామని కూడా ఆయన హెచ్చరించారు.
అమెరికా పౌరసత్వ చట్టాలను దుర్వినియోగం చేస్తూ సాగుతున్న 'బర్త్ టూరిజం'పై అమెరికా విదేశాంగ శాఖ అత్యంత కఠిన చర్యలు తీసుకుంది. కేవలం పిల్లలకు జన్మను ఇచ్చి, వారికి అమెరికా పౌరసత్వం కల్పించాలనే ఏకైక లక్ష్యంతో అగ్రరాజ్యంలోకి ప్రవేశించే విదేశీయుల ప్రయత్నాలకు ఇకమీదట డొనాల్డ్ ట్రంప్ సర్కార్ చెక్ పెట్టనుంది. ఈ క్రమంలోనే విదేశీ గర్భణీలకు సంబంధించిన 600కి పైగా వీసాలను అమెరికా రద్దు చేయడం అంతర్జాతీయంగా హాట్ టాపికైంది.
ఈ తరహా చట్టవిరుద్ధ కార్యకలాపాలను అడ్డుకోవడానికి అమెరికా విదేశాంగ శాఖ ప్రత్యేకంగా "బర్త్ టూరిజం ప్రివెన్షన్ టాస్క్‌ఫోర్స్"ను రంగంలోకి దించింది. వీసాదారుల కదలికలు, దరఖాస్తులను సమగ్రంగా సమీక్షించడం, వీసా వ్యవస్థను మోసం చేస్తున్న అక్రమ బర్త్ టూరిజం నెట్‌వర్క్‌లను పూర్తిగా ధ్వంసం చేయడం ఈ టాస్క్‌ఫోర్స్ ముఖ్య ఉద్దేశం.
బర్త్ టూరిజం నెట్‌వర్క్‌లు విదేశీయులకు ఆశజూపి, వీసా విధానాన్ని ఎలా మోసం చేయాలో శిక్షణ ఇస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రయాణ ఏర్పాట్లు, తాత్కాలిక నివాసం కల్పించడంతో పాటు నకిలీ పత్రాలను సృష్టించి పిల్లలకు అమెరికా పౌరసత్వం వచ్చేలా చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అమెరికా చట్టాలను భంగపరిచే ఇలాంటి అక్రమ విధానాలను అడ్డుకునేందుకు అన్ని రకాల చట్టపరమైన మార్గాలను ప్రయోగిస్తామని, దేశ పౌరుల హక్కులను కాపాడుతామని స్పష్టం చేశారు.
బర్త్ టూరిజంగా వస్తున్నవారు.. ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో డెలివరీ చేయించుకోకూడదని ట్రంప్ ప్రభుత్వం బలంగా డిసైడ్ అయ్యింది. విదేశాల నుంచి వచ్చే వారికి.. పుట్టే బిడ్డలకు.. పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం రాకుండా ఉండాలంటే.. వీసా ఇవ్వకపోవడమే సరైన మార్గం అని కూడా ట్రంప్ భావిస్తున్నారట.
ఇందులోభాగంగానే అమెరికా ప్రభుత్వం వలస విధానాలపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా తీసుకున్న ఈ ఆకస్మిక, కఠినమైన నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అగ్రరాజ్యం నిబంధనల ప్రకారం, ఆ దేశంలో జన్మించిన ఏ బిడ్డకైనా ఆటోమేటిక్‌గా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. దీనిని ఆసరాగా చేసుకుని అనేక మంది విదేశీయులు గర్భంతో ఉన్నప్పుడు B-1, B-2 టూరిస్ట్ వీసాలపై అమెరికాకు వెళ్తారు.
ఆ తర్వాత అక్కడ బిడ్డకు జన్మనిచ్చి పౌరసత్వం పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. దీనినే "బర్త్ టూరిజం" అని వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో అటువంటి ప్రయత్నాలు చెక్ పెడ్తూ బర్త్ టూరిజాన్ని అరికట్టేందుకు అమెరికా విదేశాంగ శాఖ "బర్త్ టూరిజం ప్రివెన్షన్ టాస్క్ ఫోర్స్"ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ విధానాన్ని వలస చట్టాల ఉద్దేశపూర్వక దోపిడీ, జాతీయ భద్రతకు ముప్పు అని ట్రంప్ ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.
బర్త్ టూరిజంపై అమెరికా తీసుకున్న తాజా చర్యలతో పాటు వీసా నిబంధనలను అత్యంత కఠినతరం చేయడం విదేశీ విద్యార్థులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. కఠిన తనిఖీలు, మారిన నిబంధనల వల్ల ఈ ఏడాది అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 'ఫాల్ సీజన్'లో ఏకంగా 1.12 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ తనిఖీలు, నిబంధనల అమలు మరింత కఠినంగా కొనసాగుతుందని అమెరికా విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది.
ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయంతో ఇక మీదట.. టూరిస్ట్ వీసాలపై అమెరికా వెళ్లాలనుకునే భారతీయ గర్భిణీలు తీవ్రమైన స్క్రీనింగ్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది. కేవలం డెలివరీ కోసమే అమెరికా వెళ్తున్నట్లు తేలితే వీసాలు వెంటనే తిరస్కరణకు గురవుతాయి. ప్రయాణ ఉద్దేశాన్ని దాచిపెట్టి, తప్పుడు పత్రాలతో బర్త్ టూరిజానికి పాల్పడే వారి వీసాలను రద్దు చేయడమే కాకుండా, వారిపై అమెరికాలో శాశ్వత ప్రవేశ నిషేధం విధించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వందలాది వీసాలను యూఎస్ అధికారులు రద్దు చేశారు.




