Burning Topic: మేం లొంగం.. ట్రంప్‌కు కెనడా ప్రధాని వార్నింగ్!
Burning Topic: అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమైంది కెనడా ఎగుమతులపై 50% సుంకాలు విధిస్తానన్న ట్రంప్ ప్రకటనకు కెనడా దీటుగా ప్రతీకార సుంకాలు ప్రకటించింది.
Burning Topic: మేం లొంగం.. ట్రంప్‌కు కెనడా ప్రధాని వార్నింగ్!
Burning Topic: రెండూ ఇరుగు పొరుగు దేశాలు.. నినన మొన్నటి దాకా మిత్ర దేశాలు.. కానీ ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఉరిమి పడుతున్నాయి. అమెరికా- కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. గత వారం వాషింగ్టన్ డీసీ, ఒట్టావా మధ్య జరిగిన ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు విఫలం కావడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
అమెరికా బేరసారాల చివరి దశలో కెనడాకు నష్టం కలిగించేలా కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. తమ వైపు నుంచి చాలా తక్కువ ప్రయోజనాలను ఆఫర్ చేస్తూ, కెనడా నుంచి భారీ రాయితీలను కోరింది.. దీంతో కెనడా చర్చల నుంచి అర్ధంతరంగా తప్పుకోక తప్పలేదు.
దీనిపై యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కెనడా చర్చల నుంచి తప్పుకోవడం మంచి అవకాశం వదులుకోవడమేనని, చివరి క్షణంలో కొత్త డిమాండ్లు తీసుకురావడం, గతంలో ఇచ్చిన కొన్ని హామీల నుంచి వెనక్కి తగ్గడం వల్లే ఒప్పందం కుదరలేదని విమర్శించింది.
ఇరు దేశాల చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు తనదైన శైలిలో సుంకాలతో విరుచుకుపడ్డారు. కెనడా నుంచి దిగుమతయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమోటివ్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. 2027 జనవరి నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపారు.
అమెరికాను కెనడా చాలా ఏళ్లుగా కొల్లగొడుతూ వస్తోందని ఆయన ఆరోపించారు. కెనడా తమ రైతుల ఉత్పత్తులపై అత్యధిక పన్నులు విధిస్తూ ఏటా 60 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుకు కారణమైందని ఆరోపించారు. దీని వల్ల అమెరికాకు భారీ వాణిజ్య లోటు ఏర్పడుతోందని ఆరోపించారు.
ఇకపై కెనడాను ప్రత్యేకంగా చూడటం కుదరదు అంటూ డొనాల్డ్ ట్రూత్ సోషల్ ద్వారా విరుచుకు పడ్డారు.. ఆ దేశం మా మార్కెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే అమెరికాకు కెనడా అవసరం అంతగా లేదు. కెనడా తన వ్యాపారంలో దాదాపు 95 శాతం అమెరికాతోనే చేస్తోందని పేర్కొన్నారు.
కాగా అమెరికా విధించిన తాజా వాణిజ్య సుంకాలకు కెనడా దీటుగా బదులిచ్చింది. అమెరికా నుంచి దిగుమతయ్యే దాదాపు 700 ఉత్పత్తులపై దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ టారిఫ్‌లు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.
అమెరికా నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియం, ఫర్నిచర్, దుస్తులపై 50 శాతం, చీజ్, గృహోపకరణాలు, సీఫుడ్‌పై 25 శాతం, ఎలక్ట్రానిక్స్, టూల్స్‌పై 15 శాతం అదనపు సుంకాలు అమలవుతాయి. స్థానిక వినియోగదారులపై భారం పడకుండా, అమెరికా ఎగుమతిదారులపై ఒత్తిడి తెచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెనడా స్పష్టం చేసింది.
మరోవైపు ఈ వాణిజ్య యుద్ధం వల్ల తమ దేశీయ వ్యాపారాలు, కార్మికులు, రైతులు నష్టపోకుండా కెనడా ప్రభుత్వం 7.5 బిలియన్ కెనడియన్ డాలర్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని ప్రకటించింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నగదు కొరత రాకుండా చూడటం, ఉపాధిని కాపాడటమే ఈ ప్యాకేజీ లక్ష్యమని తెలిపారు.
కాగా అమెరికా ప్రతిపాదించిన షరతులు అన్యాయంగా, ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని కెనడా ప్రధాని మార్క్ కార్నీ విమర్శించారు. అందుకే ఏడాదికిపైగా సాగుతున్న చర్చల్ని నిలిపివేసి, నిపుణుల బృందాన్ని వెనక్కి రప్పించినట్లు తెలిపారు.
తమ దేశ కార్మికులు, రైతులు, వ్యాపారాల ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు అమెరికా మోపిన పన్నులపై 'డాలర్‌కు డాలర్' చొప్పున ప్రతీకార సుంకాలను విధిస్తామని కార్నీ స్పష్టం చేశారు. అమెరికా- కెనడా మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో ఆ దేశం విధిస్తున్న 50 శాతం సుంకాలు కెనడా నుంచి అమెరికాకు జరిగే మొత్తం ఎగుమతుల్లో 5 శాతానికి సమానం.
దీంతో కెనడా ప్రభుత్వం తమ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తోంది. 500 బిలియన్ డాలర్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని వేగవంతం చేయడంతో పాటు, ఇతర దేశాలకు ఎగుమతి మార్గాల్ని విస్తరిస్తున్నట్లు మార్క్ కార్నీ పేర్కొన్నారు.
కెనడా విధించే కొత్త సుంకాల ప్రభావం అమెరికాకు చెందిన పలు కీలక రంగాలపై పడనుంది. తమ దేశానికి ఎదురైన సవాలును ధీటుగా ఎదుర్కొంటామని కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపేన్ తెలిపారు. అమెరికా చర్యకు ప్రతిస్పందించే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని అన్నారు.
అమెరికా భారీ సుంకాల నేపథ్యంలో కెనడాలోని ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ కూడా ట్రంప్ సర్కార్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరం అయితే అమెరికాకు విద్యుత్ సహా కీలక ఖనిజాల సరఫరాను నిలిపివేయడాన్ని కూడా పరిశీలిస్తామని అన్నారు.
ట్రంప్, కెనడా ప్రజల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారని, అమెరికా ఒత్తిడికి తలొగ్గడం కంటే ఆర్థికంగా నష్టపోయినా ఎదుర్కొనేందుకు కెనడియన్లు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ట్రంప్ తమ దేశంపై ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించారని, కానీ తాము ఒత్తిడికి లొంగిపోకుండా మరింత కఠినమైన ప్రతీకార చర్యలు తీసుకుంటామని ఫోర్డ్ హెచ్చరించారు.
కాగా కెనడాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా మరో కీలక పోస్ట్ పెట్టారు. కెనడా, అమెరికాలతో సరిహద్దు పంచుకుంటున్న ‘లేక్ ఆంటారియో’ పేరును ‘లేక్ అమెరికా’గా మార్చే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్‌లపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ‘‘డగ్ ఫోర్డ్ గొప్పలకు పోతున్నారు. దశాబ్దాలుగా కెనడాకు అమెరికా అండగా నిలిచింది. కానీ ఇకపై అలా జరగదు. మేం లేకపోతే కెనడా మనుగడ సాగించలేదు.
ఆ దేశంతో పోలిస్తే అమెరికా సంపన్నమైన, శక్తిమంతమైన దేశం. ఆ దేశానికి అవసరమయ్యే విద్యుత్, చమురు, గ్యాస్‌లో ఎక్కువ భాగం అమెరికా మీదుగానే రవాణా అవుతాయి. కెనడాలో నిరుద్యోగిత రేటు వేగంగా పెరుగుతోంది. వ్యాపారాలు మా దేశానికి తరలివస్తున్నాయి. ఇదంతా మార్క్ కార్నీ, డగ్ ఫోర్డ్ వల్లే జరుగుతోందని ఆరోపించారు.




