Burning Topic: అంతరిక్ష రంగంలో తీవ్రమైన పోటీ!
Burning Topic: అంతరిక్షంలోకి అమెరికా ఆయుధాలు! భూమండలం నుంచి అంతరిక్షానికి మారిన యుద్ధం, యూఎస్ స్పేస్ ఫోర్స్ సంచలన ప్రకటనతో గ్లోబల్ టెన్షన్.
Burning Topic: అంతరిక్ష రంగంలో తీవ్రమైన పోటీ!
Burning Topic: మానవ చరిత్రను చూస్తే యుద్ధాలు కొత్తేమీ కాదు నాగరికత ఏర్పడక ముందు నుంచే జనసమూహాల మధ్య ఘర్షనలు జరిగేవి. వేల సంవత్సరాల క్రితం తెగల మధ్య ఆహారం, నీరు, నివాస స్థలాల కోసం జరిగిన చిన్న చిన్న గొడవలే కాలక్రమేణా పెద్ద సామ్రాజ్యాల మధ్య మహా యుద్ధాలుగా మారాయి. వనరుల కోసం, అధికారం - సామ్రాజ్య విస్తరణ, భద్రత - భయం, భావజాలం - మతం, ఆర్థిక ప్రయోజనాలు యుద్దాలకు కారణాలుగా చెప్పవచ్చు. కాలానుగుణంగా యుద్ధాలు జరిగే తీరులోనూ మార్పులు వచ్చాయి. మొదట సాంప్రదాయ పద్ధతిలో నేలపై కత్తులు, తుపాకులు, ఫిరంగులు ఉపయోగించారు. ఆ తర్వాత సముద్రాలపై యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ల ద్వారా పోరు మొదలైంది. అనంతరం ఆకాశ మార్గంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణుల ద్వారా దాడులు వచ్చాయి. కాలక్రమంలో రిమోట్ కంట్రోల్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రోన్లు ప్రవేశించాయి.
కంప్యూటర్ వైరస్‌లు, హ్యాకింగ్ ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థ మీద దాడులు మరో రకం.. పరమాణు బాంబులను ఉపయోగించి నగరాలకు నగరాలనే నిమిషాల్లో బూడిద చేయడం, ప్రమాదకరమైన రసాయనాలు, వైరస్‌లు, బ్యాక్టీరియాలను వదిలి శత్రువులను అంతమొందించడం మరింత ప్రమాదకర యుద్ధ మార్గాలుగా చెప్పవచ్చు.. తాజాగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది స్పేస్ వార్. అంటే .. ప్రస్తుత ప్రపంచంలో సైన్యాలు కేవలం సరిహద్దుల్లోనే కాకుండా, కంప్యూటర్ స్క్రీన్ల ముందు, అంతరిక్షంలో కూడా యుద్ధాలు చేస్తున్నాయి. శత్రు దేశాల ఉపగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా వారి జీపీఎస్ , నిఘా, సమాచార వ్యవస్థలను దెబ్బతీయడం కోసం ఈ అంతరిక్ష యద్ధ మార్గాన్ని ఉపయోగిస్తున్నారు. ఇటీవల అమెరికా తన ఆయుధాలను అంతరిక్షంలో మోహరించినట్లు తొలిసారి అంగీకరించింది. భూమి చుట్టూ ఉన్న కక్ష్యలో ఉన్న ఈ ఆయుధాలతో అమెరికా, మిత్ర దేశాల బలగాలను కాపాడుకుంటామని యూఎస్ స్పేస్ ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మెయింక్ వెల్లడించారు.
అమెరికా ఎయిర్, స్పేస్, సైబర్ కాన్ఫరెన్స్‌లో చెప్పిన ట్రాయ్ మెయింక్ ఈ మాటలు అందరినీ ఆకర్శించాయి. అయితే ఈ ఆయుధాలు ఎప్పుడు కక్ష్యలోకి పంపారు? ఎన్ని ఉన్నాయి? వాటి ప్రత్యేక లక్షణాలు ఏంటి? అనే వివరాలను చెప్పలేదు. నిపుణుల అంచనా ప్రకారం ఇవి ఉపగ్రహాలను నేరుగా ఢీకొట్టి ధ్వంసం చేసే ఆయుధాల కంటే.. కమ్యూనికేషన్ వ్యవస్థలను అడ్డుకునే ఎలక్ట్రానిక్ యుద్ధ లేదా రేడియో జామింగ్ పరికరాలు అయ్యే అవకాశం ఉంది. అమెరికా స్పేస్ ఫోర్స్ కమాండ్ చైనా, రష్యాను అంతరిక్షంలో తన ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తోంది. కాగా అంతరిక్షంలో ఆయుధాల వినియోగం కొత్త అంశం కాదు. ఇప్పటికే చైనా స్పేస్, కౌంటర్ స్పేస్ వ్యవస్థలను తన మిలిటరీ ఆధునికీకరణలో భాగంగా చేసుకుంది. రష్యా కూడా అంతరిక్షాన్ని కూడా యుద్ధ రంగంగానే పరిగణిస్తోంది. ఈ రెండు దేశాలు ఇప్పటికే వివిధ అంతరిక్ష వ్యతిరేక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి ప్రచ్ఛన్న యుద్ధం నాటి నుంచి అంతరిక్షంలో ఆయుధాల మోహరింపుపై వ్యూహాలు అమెరికా, రష్యాలు సిద్ధమయ్యాయి. రష్యా 1957లో స్పుత్నిక్-1 శాటిలైట్‌ను ప్రయోగించడంతో అంతరిక్ష రక్షణ రంగంలో పోటీ మొదలైంది. 1960వ దశకంలో రష్యా ఉపగ్రహాలను ధ్వంసం చేసే ఆల్మాజ్ ప్రాజెక్ట్, అమెరికా బ్లూ జెమిని వంటి మిలిటరీ అంతరిక్ష ప్రాజెక్టులతో స్పేస్ వార్ పరిశోధనలను వేగవంతం చేశాయి. అమెరికా, సోవియట్ యూనియన్లు తమ సైనిక అవసరాల కోసం గూఢచార, నిఘా ఉపగ్రహాల పరిశోధనలు తీవ్రం చేశాయి. ఇప్పుడు అమెరికా స్పేస్ ఫోర్స్ కక్ష్యలో ఆయుధాలను మోహరించినట్లు అధికారికంగా ధ్రువీకరించడంతో అంతరిక్ష యుద్ధ పరిశోధనలు సరికొత్త దశకు చేరుకున్నాయి. కాగా 1967లో ఔటర్ స్పేస్ ఒప్పందం కారణంగా అంతరిక్షంలో సామూహిక జనహనన ఆయుధాల మోహరింపుపై నిషేధం ఉంది. దీంతో అమెరికా, రష్యా, చైనా దేశాలు ఇవి కాకుండా ఇతర ఆయుధ వ్యవస్థల మోహరింపుపై దృష్టి సారించాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొదటి అధ్యక్ష కాలం 2019లో అమెరికా రక్షణ విభాగంలో ఒక కొత్త విభాగంగా యూఎస్ స్పేస్ ఫోర్స్- స్పేస్ కామ్ ఏర్పాటు చేసి అంతరిక్ష యుద్ధవ్యూహాలకు పునాది వేశారు. ఇజ్రాయెల్ 'ఐరన్ డోమ్' తరహాలోనే ప్రపంచంలో ఎక్కడి నుండైనా వచ్చే క్షిపణుల నుండి రక్షించడానికి ట్రంప్ ప్రభుత్వం "గోల్డెన్ డోమ్" క్షిపణి రక్షణ వ్యవస్థను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా శత్రువుల క్షిపణులను అంతరిక్షంలోనే కూల్చివేసే అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి సంబంధించి 'ఎన్సూరింగ్ స్పేస్ సుపీరియారిటీ' అనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై కూడా ట్రంప్ సంతకం చేశారు. 2026 ఆగస్టులో అంతరిక్ష రంగంలో శిక్షణ కోసం ప్రత్యేకంగా ఒక మిలిటరీ శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది అధునాతన అంతరిక్ష యుద్ధ వ్యూహాలలో శిక్షణ ఇవ్వనుంది.
కాగా అమెరికా 1985లోనే ఎఫ్–15 యుద్ధ విమానం ద్వారా 11.6 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసి అక్కడి నుంచి ఏఎస్‌ఎం–135 క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి 555 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న శాస్త్రీయ ఉపగ్రహం ఒకదాన్ని ధ్వంసం చేసింది . క్షిపణుల సాయంతో ఉపగ్రహాలను ధ్వంసం చేయగల వ్యవస్థలను కైనెటిక్ డైరెక్ట్ అసెంట్ ఏశాట్‌లని పిలుస్తారు. నేల, సముద్రం, గాల్లోంచి కూడా ప్రయోగించగలగడం వీటి ప్రత్యేకత. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో కక్ష్యలో కంటికి కనిపించకుండా నిరంతరం తిరిగే ఉపగ్రహాన్ని గుర్తించేందుకు, కచ్చితంగా దాన్ని బలంగా ఢీకొనేందుకు శక్తిమంతమైన రాడార్లు, ఆప్టికల్ సెన్సర్లను ఉపయోగిస్తారు. ఆ తర్వాత కాలంలో 2007లో చైనా కూడా అంతరిక్ష యుద్ధ సాంకేతికను సమకూరుకుంది. రష్యా 2021లో కాస్మోస్1408 ఉపగ్రహాన్ని ధ్వంసం చేసి తనకూ ఏశాట్‌లు ఉన్నాయని ప్రకటించుకుంది.
ఇక్కడ గర్వంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమంటే.. భారత్ కూడా అంతరిక్ష యుద్ధ సన్నాహాల్లో ఇప్పటికే ముందంజలోనే ఉంది. ఉపగ్రహాలను కూల్చేయగల సత్తా మన దేశానికి 2019లోనే సమకూరింది. ‘మిషన్ శక్తి’ పేరుతో ఈ ఉపగ్రహ విధ్వంసక ఆయుధ వ్యవస్థను మనం పరీక్షించాం. అమెరికా, రష్యా, చైనా తర్వాతమఈ సత్తా కలిగిన నాలుగవ దేశంగా భారత్ అవతరించింది. మిషన్ శక్తిలో భాగంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో పృథ్వీ క్షిపణికి కొన్ని మార్పులు చేసి ప్రయోగించింది. 2019 మార్చి 27న ఒడిశాలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి నింగికి ఎగసిన ఈ మూడు దశల పృథ్వీ క్షిపణి అంతకు రెండు నెలల క్రితం ఇస్రో రాకెట్ ద్వారా భూమి లో ఎర్త్ ఆర్బిట్‌లోకి చేరిన మైక్రోశాట్–ఆర్ ఉపగ్రహాన్ని ఢీకొని నాశనం చేసింది. అయితే క్షిపణిలో ఎలాంటి పేలుడు సామగ్రిని వాడలేదు. మొత్తానికి స్పేస్ వార్స్ మొదలైతే ప్రపంచ వ్యాప్త యుద్ధాలు సమూలంగా మారడమే కాదు, కొత్త భయాలకు కారణమవుతున్నాయి.




