Burning Topic: ట్రంప్ సిటిజన్షిప్ బిల్లు రద్దు చేసిన కోర్టు!
Burning Topic: అమెరికాలో జన్మతః పౌరసత్వ నిబంధనలపై ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై మేరీలాండ్ డిస్ట్రిక్ట్ కోర్టు తాత్కాలిక స్టే విధించింది.
Burning Topic: ట్రంప్ సిటిజన్షిప్ బిల్లు రద్దు చేసిన కోర్టు!
Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు అక్కడి న్యాయస్థానాల్లో వరుసగా బ్రేకులు పడుతున్నాయి. అమెరికాలో పుట్టిన వారికి లభించే జన్మతః పౌరసత్వంపై పరిమితులు విధించేందుకు ప్రయత్నిస్తున్న యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరోసారి చుక్కెదురైంది.
ఈ అంశంపై ఆయన గతంలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను మేరీలాండ్ డిస్ట్రిక్ట్ కోర్టు నిలుపుదల చేసింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరుతో తమ దేశ ప్రజల ప్రయెజనాలను కాపాడుతానంటూ రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే డొనాల్డ్ ట్రంప్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు.
అయితే న్యాయ పరంగా ఎదురయ్యే ఇబ్బందుల మీద ఆయన పెద్దగా దృష్టి పెట్టినట్లు లేదు. దీంతో అనేక అవాంతరాలను ఎదుర్కోక తప్పడం లేదు. ట్రంప్ ముందుగా వలసదారులను నియంత్రించేందకు కఠినమైన ఇమిగ్రేషన్ చట్టాలను తీసుకొచ్చారు. ఈ క్రమంలో అమెరికాలో పుట్టిన పిల్లలకు లభించే సహజసిద్దమైన జన్మతః పౌరసత్వాన్ని టార్గెట్ చేశారు.
అమెరికాలో జన్మించే ప్రతి ఒక్కరికీ పౌరసత్వం కల్పించే 14వ సవరణ నిబంధనలను పరిమితం చేయాలని ట్రంప్ నిర్ణయించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాల్లో అజెండాలో ప్రధానాంశంగా పెట్టుకున్నారు.
తల్లిదండ్రుల వలసదారుల హోదాతో సంబంధం లేకుండా అమెరికా నేల మీద పుట్టిన ప్రతీ శిశువుకు పౌరసత్వం లభించే ఈ చట్టానికి పరిమితులు విధించాలని మొదటి నుంచీ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన మరునాడే అంటే.. జనవరి 20, 2025 న వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారు లేదా తాత్కాలిక వీసాలపై వచ్చి సంతానం కన్నట్లయితే, ఆ పిల్లలకు పౌరసత్వం ఇవ్వబోమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే అక్కడి మానవ హక్కుల సంఘాలు, వలసదారుల రక్షణ సంస్థలు అమెరికాలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు దీన్ని కోర్టుల్లో సవాలు చేశాయి.
ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ జె. ప్లాట్కిన్ నేతృత్వంలో అరిజోనా, ఇల్లినోయిస్, ఒరెగాన్, వాషింగ్టన్ వంటి 18 రాష్ట్రాల అటార్నీ జనరల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డి.సి. నగరాలు కలిసి ఉమ్మడిగా అమెరికా సుప్రీంకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి.
ఈ పిటిషన్లపై విచారించిన ప్రధాన న్యాయస్థానం జూన్ 30, 2026న ఆ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం, అక్కడి భూభాగంపై జన్మించిన ప్రతి బిడ్డకూ పుట్టుకతోనే పౌరసత్వం లభిస్తుంది.
తల్లిదండ్రులు అక్కడ చట్టవిరుద్ధంగా ఉన్నా లేదా తాత్కాలిక వీసాలపై ఉన్నా ఈ హక్కు వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. "అమెరికా పరిధి" అంటే కేవలం శాశ్వత పౌరులు మాత్రమే కాదు.. చట్టాలకు లోబడి దేశంలో నివసిస్తున్న వలసదారుల పిల్లలందరూ వస్తారని చెప్పింది. వలస వచ్చిన వారి పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరించే హక్కు ప్రభుత్వానికి లేదని పునరుద్ఘాటించింది.
జన్మ: పౌరసత్వంపై సుప్రీంకోర్టు తాను జారీ చేసిన ఉత్తర్వులను తోసిపుచ్చినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ఆగస్టు 6, 2026న మరో రెండు కొత్త ఉత్తర్వులను జారీ చేశారు. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కానప్పుడు, ఒకవేళ ఆ తల్లిదండ్రులలో ఎవరైనా 'శత్రు దేశ వలసదారులు' , 'విదేశీ ప్రభుత్వ ఉద్యోగులు' లేదా చట్టవిరుద్ధమైన 'బర్త్ టూరిజం' కింద అమెరికాకు వచ్చినవారైతే, ఆ పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని నిరాకరించాలని నిబంధనల్లో చేర్చారు.
అయితే మొదటి ఉత్తర్వుపై పోరాడిన అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఈసారి కూడా కోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కూ లేదని పౌర హక్కుల సంఘాల న్యాయవాదులు వాదించారు. ఈ కొత్త నిబంధనల వల్ల తమ పుట్టబోయే పిల్లల పౌరసత్వం ప్రమాదంలో పడుతుందని ఆందోళన చెందుతున్న పలువురు వలసదారులు, వారి కుటుంబాలు ఈ దావాలో భాగస్వాములయ్యారు.
వాషింగ్టన్ డిసి ఫెడరల్ కోర్టులో జరిగిన ఈ విచారణలో జడ్జి డెబోరా బోర్డ్‌మన్ కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన విధానం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించేలా ఈ తాజా ఉత్తర్వులు ఉన్నాయని, ఇవి రాజ్యాంగబద్ధంగా నిలబడే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. కాగా ఈ తీర్పులో కోర్టు ఒక వెసులుబాటు కూడా కల్పించింది. భవిష్యత్తులో విధానాల అమలుపై ఫెడరల్ ఏజెన్సీలు తమ అంతర్గత మార్గదర్శకాలను సిద్ధం చేసుకోవడానికి మాత్రం అభ్యంతరం చెప్పలేదు.
ఈ నిలుపుదల ఉత్తర్వులు ఈ కేసులో పిటిషనర్లుగా పోరాడుతున్న అర్హులైన వర్గానికి మాత్రమే వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఈ ఉత్తర్వులను నిలిపివేయకపోతే, సుప్రీంకోర్టు గతంలో పౌరులుగా గుర్తించిన చిన్నారులు సైతం జన్మహక్కు పౌరసత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
1868లో ఆమోదించిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం-అమెరికాలో పుట్టేవారందరికీ.. అంటే వారి తల్లిదండ్రులు ఆ దేశంలో అక్రమంగా లేదా తాత్కాలికంగా ఉంటున్నా సరే ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. అయితే బర్త్ టూరిజం పేరిట దీనిని దుర్వినియోగం చేస్తున్నారని.. ఇది దేశానికి అవమానకరమని డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారు.
పుట్టబోయే బిడ్డకు విదేశీ పౌరసత్వం పొందాలనే లక్ష్యంతో నెలలు నిండే సమయంలో గర్భిణీలు వేరే దేశానికి ప్రయాణించి అక్కడ ప్రసవించడాన్ని బర్త్ టూరిజంగా వ్యాఖ్యానించారాయన.. రెండోసారి కూడా తన ఉత్తర్వుకు ఎదురు దెబ్బ తిగిలినా, ట్రంప్ ఇక్కడితో ఆగక పోవచ్చు.
ఫెడరల్ కోర్టు ఇచ్చిన ఈ తాత్కాలిక స్టేను సవాల్ చేస్తూ ట్రంప్ పరిపాలన విభాగం త్వరలోనే అప్పీల్ కోర్టుకు వెళ్లనుంది. ఈ కేసును ఎలాగైనా మళ్లీ సుప్రీంకోర్టు పరిధిలోకి తీసుకెళ్లి, అక్కడ తన ఉత్తర్వులకు అనుకూలంగా వాదనలు వినిపించాలని ట్రంప్ బృందం భావిస్తోంది.
మరోవైపు అమెరికాలో జన్మతః లభించే పౌరసత్వాన్ని నిరుత్సాహపరిచేందుకు డొనాల్డ్ ట్రంప్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ పిల్లలకు పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవాలంటే.. తల్లిదండ్రులు మున్ముందు తమ పౌరసత్వం, ఇమిగ్రేషన్ స్టేటస్‌కు సంబంధించిన రుజువులు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం పాస్‌పోర్ట్ నిబంధనల ప్రకారం.. యూఎస్‌లో జన్మించిన పిల్లల పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకునే తల్లిదండ్రులు వారి బంధాన్ని నిరూపించే పత్రాలను సమర్పించాలి. దాంతోపాటుగా ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు పత్రాన్ని ఇవ్వాలి.
అలాగే సిటిజన్‌షిప్ స్టేటస్ వివరాలను దరఖాస్తు పత్రంలో పేర్కొంటే సరిపోతుంది. ఇమిగ్రేషన్ స్టేటస్‌ను సమర్పించడం తప్పనిసరేం కాదు. కానీ, ఇక మీదట ఈ పౌరసత్వ, ఇమిగ్రేషన్ వివరాలను రుజువులతో సహా సమర్పించేలా కొత్త నిబంధనలను తీసుకు రావాలని ట్రంప్ యంత్రానం ప్రయత్నాలు చేస్తోంది.




