Burning Topic: భారతీయులకు అమెరికా బిగ్ షాక్? 30 మంది భారతీయులపై దేశ బహిష్కరణ
Burning Topic: అమెరికాలో అక్రమంగా కమర్షియల్ ట్రక్కులు నడుపుతున్న 30 మంది భారతీయులను అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు.
Burning Topic: భారతీయులకు అమెరికా బిగ్ షాక్? 30 మంది భారతీయులపై దేశ బహిష్కరణ
Burning Topic: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచీ అక్రమ వలసదారులను కట్టడి చేయడం తెలిసిందే.. తక్కువ జీతాలకే పనిచేసే అక్రమ వలసదారులు స్థానికుల అవకాశాలను కొల్లగొడుతున్నారని ఆరోపణ. అమెరికా ఫస్ట్ నినాదంతో దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, పౌరుల భద్రతను నిర్ధారించడానికి అక్రమ వలసదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని దీన్ని సమర్ధించుకుంటున్నారు. ఈ క్రమంలో అక్రమ వలసదారులపై ట్రంప్ యంత్రాంగం నిఘాను తీవ్రం చేసింది. నిబంధనలను ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా దేశంలో నివాసం ఉంటున్న వారిని ఏరివేసే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ ప్రభావం అమెరికాలో కమర్షిల్ ట్రంక్కులను నడిపించే విదేశీ డ్రైవర్ల మీద కూడా పడింది. తాజాగా అమెరికాలో అక్రమంగా నివసిస్తూ, కమర్షియల్ ట్రక్కులను నడుపుతున్న వలసదారులపై యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఉక్కుపాదం మోపారు.
ఇటీవల అరిజోనాలోని యుమా సెక్టార్ కేంద్రంగా యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ మే 11 నుంచి 15 వరకు ‘ఆపరేషన్ చెక్‌మేట్’ చేపట్టింది. ఇందులో మొత్తం 52 మంది విదేశీ ట్రక్కు డ్రైవర్లను అరెస్టు చేశారు. ఇందులో 36 మంది సెమీ ట్రక్ డ్రైవర్లు కాగా, అందులో మెజారిటీ వాటా భారతీయులదే. 30 మంది భారతీయులు పట్టుబడ్డారు. మిగిలిన వారు మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యాకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు. తమ తనిఖీల్లో పట్టపడిని ట్రక్ డ్రైవర్ల దగ్గర సరైన ఉద్యోగ అనుమతి పత్రాలు లేవని అధికారుల విచారణలో తేలింది. ఎక్కువ మంది వద్ద ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ వాటి గడవు ముగిసిపోయింది. దీంతో వారంతా అమెరికాలో అక్రమంగా నివసిస్తూ వాణిజ్య ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్నట్లు తేల్చారు. అమెరికా వలస చట్టాలను ఉల్లంఘించినట్లుగా నిర్ధారించి దేశం నుంచి బహిష‌్కరిస్తున్నట్లు తెలిపారు, త్వరలోనే వారి స్వదేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
అరెస్టయిన వారంరికీ అమెరికాలోని కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియా రాష్ట్రాల్లో జారీ చేసిన కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నట్లు తేలింది. మరికొందరి వద్ద ఎలాంటి డ్రైవింగ్ లైసెన్సు కూడా లేదని అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ చెక్‌మేట్ ప్రధాన ఉద్దేశం రహదారులపై అక్రమ వలసదార్లు వాణిజ్య వాహనాలు నడపకుండా నిరోధించడం అని అమెరికా అధికారులు తెలిపారు. ముఖ్యంగా భారీ ట్రక్కులు, వాణిజ్య వాహనాలు నడిపే డ్రైవర్ల అర్హతలను పరిశీలించడం ద్వారా ప్రజల భద్రతను కాపాడతామంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత విదేశీ డ్రైవర్ల నియామకాలపై కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి. అర్హతలు లేని వారు కమర్షియల్ ట్రక్కులు, బస్సులు నడిపేందుకు లైసెన్సులు పొందకుండా చర్యలు తీసుకోవాలని అమెరికా రవాణా శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అక్రమ వలసలను అరికట్టడం, ప్రజా భద్రతను పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది.
అమెరికాలో భారతీయ మూలాలున్న కొంతమంది ట్రక్ డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యారనే ఆరోపణలతో అరెస్టవడం చర్చనీయాంశమైంది. ఓ భారత సంతతి ట్రక్ డ్రైవర్ నిర్వాకంతో అమెరికాలో విదేశీ డ్రైవర్ల ఉపాధికి ఎసరొచ్చిపడింది.. గతేడాది ఆగస్టులో ఫ్లోరిడా హైవేపై పంజాబీ డ్రైవర్ హర్జిందర్ సింగ్ వాహనం నడుపుతూ నిర్లక్ష్యంగా యూ-టర్న్ తీసుకోవడం వల్ల ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఓ అనధికారిక ప్రాంతంలో యూటర్న్ తీసుకోడానికి ప్రయత్నించగా, వెనుక నుంచి వస్తోన్న వాహనం ఢీకొట్టి, అందులోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల దర్యాప్తులో హర్జిందర్ సింగ్ 2018లో మెక్సికో సరిహద్దు నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్టు తేలింది. అతడికి ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వచ్చింది అనే అనే అంశంపై దర్యాప్తు చేపట్టారు. బయట దేశాల నుంచి వచ్చిన ట్రక్కు డ్రైవర్లు.. అక్రమంగా లైసెన్సులు పొందుతున్నారని అమెరికా ప్రభుత్వం గమనించింది.
ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై విదేశీ ట్రక్ డ్రైవర్లకు వీసాలు జారీచేయబోమని పేర్కొంది. అమెరికాలో 2023 నాటికి 16 శాతం ట్రక్కు డైవర్లు ఇతర దేశస్థులే ఉన్నట్టు తెలుస్తోంది. వీరు రోడ్లపై ఇంగ్లిష్‌లోనే ఉండే సూచనలు చదవడం, రాయడం రాక ప్రమాదాలకు కారణమవుతున్నారని తేల్చారు. దీంతో విదేశీ డ్రైవర్లకు ఇంగ్లిష్ చదవడం, రాయడం తప్పనిసరి అని కొత్త రూల్ పెట్టారు. వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు వర్కర్ వీసాలు మంజూరు చేయబోమని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వెల్లడించారు. రోడ్లపై విదేశీ డ్రైవర్ల నిర్లక్ష్యం అమెరికన్ల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది. వీరితో అమెరికన్ ట్రక్కర్ల జీవనోపాధికి గండి పడుతోంది పేర్కొన్నారు రూబియో. ఈ క్రమంలో నిర్వహించన తనిఖీల్లో భారతీయులే పెద్ద సంఖ్యలో పట్టుబడటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఈ అంశం భారత్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది.
అమెరికా రవాణారంగం విదేశీ డ్రైవర్లను ఆకర్షించడానికి ప్రధాన కారణం భారీగా ఆదాయం ఉండటమే. అక్కడ పెద్ద మొత్తంలో లభించే వేతనాలు, సురక్షిత జీవితానికి మార్గంగాభావిస్తారు. అమెరికాలో డ్రైవర్లకు ప్రయాణ దూరం ఆధారంగా చెల్లింపులు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి ఒక్కో మైలుకు 0.60 డాలర్ల నుంచి 0.70 డాలర్ల వరకు లభిస్తుంది. ప్రతి డ్రైవర్ రోజుకు 500-600 మైళ్లను సులువుగా ప్రయాణిస్తాడు. ఈ లెక్కన భారత కరెన్సీలో వారికి నెలకు రూ.4.2 లక్షల నుంచి రూ.6.7 లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. కొన్ని సంస్థలు మాత్రం డ్రైవర్లకు గంటల చొప్పున లెక్కగట్టి ఇస్తారు. గంటకు రూ.1,680 - రూ.2,520 వరకు ఇస్తారు. సగటున ఏటా ఒక డ్రైవర్ రూ.40 లక్షలు సంపాదిస్తాడు. వాల్‌మార్ట్, అమెజాన్ వంటి కంపెనీలు అయితే సీజనల్ డ్రైవర్లకు ఏటా రూ.92 లక్షల వరకు చెల్లిస్తాయి. డ్రైవర్ల అనుభవం, ప్రాంతం, యజమాని ఆధారంగా స్వల్ప మార్పులు ఉంటాయి. ఈ కారణంగానే అమెరికా ట్రక్ డ్రైవింగ్ రంగం భారతీయుల్ని ఆకర్శిస్తోంది.
అమెరికాలో కమర్షియల్ ట్రక్కు డ్రైవర్లకు కొరత తీవ్రంగా ఉంది. అక్కడ అవసరమైన వారికన్నా తక్కువ డ్రైవర్లు ఉన్నారు. 2025 బడ్జెట్ సంవత్సరంలో అమెరికాలో విదేశీ డ్రైవర్లకు 1,490 హెచ్-2బీ వీసాలను జారీ చేశారు. అంతకుముందు ఏడాదికి 1,400 మాత్రమే ఇచ్చారు. 2021 లెక్కల ప్రకారం 7.2 లక్షల మంది విదేశీ కమర్షియల్ డ్రైవర్లు ఉన్నారు. అమెరికా ట్రక్కింగ్ రంగంలో ఇది 18 శాతానికి సమానం. ఈ కారణంగా భారత్‌లోని పంజాబ్, హర్యానాల నుంచి ఎక్కువ మంది యువత అక్కడికి వెళ్లి డ్రైవర్లుగా స్థిరపడుతున్నారు. 2018లో గణంకాల ప్రకారం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 30,000 మంది భారతీయ సిక్కులు ట్రక్కింగ్ రంగంలో చేరారంటే అర్థం చేసుకోవచ్చు. నార్త్ అమెరికన్ పంజాబీ ట్రక్కింగ్ అసోసియేషన్‌లో 1,400 మంది సభ్యులు ఉన్నారు. వీరికి మొత్తం 9,000 ట్రక్కులు ఉన్నాయి. అమెరికన్లు కమర్షియల్ డ్రైవింగ్ వృత్తి మీద పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో విదేశీ డ్రైవర్ల మీద నిషేధం స్వల్పకాలమే ఉంటుందని భావిస్తున్నారు.




