Burning Topic: భారతీయులకు బిగ్ షాక్.. H1B వీసాల నిషేధం..!
Burning Topic: అమెరికాలో ఐటీ ఉద్యోగులకు భారీ షాక్! హెచ్-1బి (H1B) వీసాల జారీపై అమెరికా ప్రతిపాదించిన కొత్త బిల్లు ఏమిటి?
Burning Topic: భారతీయులకు బిగ్ షాక్.. H1B వీసాల నిషేధం..!
Burning Topic: అగ్రరాజ్యం హెచ్1బీ వీసాల జారీలో తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ టెక్కీలకు షాక్ కలిగిస్తున్నాయి. హెచ్1బి వీసా వ్యవస్థలో మార్పులు చేయాలనే ప్రతిపాదన చట్ట సభల ముందుకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచరులు, రిపబ్లికన్ చట్ట సభ సభ్యులు సంయుక్తంగా ఎండ్ హెచ్-1బీ వీసా అబ్యూస్ యాక్ట్ ఆఫ్ 2026 అనే కొత్త బిల్లును ప్రతిపాదించారు. అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనలను తీసుకువస్తున్నట్టు చెబుతున్నారు. రిపబ్లికన్ ప్రతినిధి ఎలీ క్రేన్ నేతృత్వంలో ప్రవేశ పెట్టిన ఈ బిల్లు, ప్రస్తుత హెచ్-1బి వీసా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరుతోంది. ఈ ప్రతిపాదన ప్రకారం అమెరికా ప్రభుత్వం హెచ్-1బి వీసాల జారీ మూడేళ్లపాటు పూర్తిగా నిలిపివేయాలి. ఈ సమయంలో వీసా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దనున్నారు. తద్వారా మరింత కఠినమైన నిబంధనలతో తిరిగి హెచ్1బీ వీసా జారీ ప్రక్రియ తిరిగి ప్రారంభించాలని బిల్లులో ప్రతిపాదించారు.
ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికా వీసా రంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రతీ ఏడాది జారీ చేస్తున్న 65 వేల హెచ్-1బీ వీసాల పరిమితిని ఏకంగా 25 వేలకు తగ్గించాలని ప్రతిపాదించారు. వీసా పొందే అభ్యర్థి కనీస వార్షిక వేతనం రెండు లక్షల డాలర్లు ఉండాలన్నది తాజా నిబంధన. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 1.6 కోట్ల రూపాయలన్న మాట. ఇది ప్రస్తుతం ఉన్న వేతన ప్రమాణాల కంటే చాలా ఎక్కువ. ప్రస్తుతం అనుసరిస్తున్న కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతిని రద్దు చేసి, అత్యధిక వేతనం ఇచ్చే అభ్యర్థులకే ప్రాధాన్యత ఇచ్చే వేతన ఆధారిత ఎంపిక విధానాన్ని ప్రవేశ పెట్టాలని ప్రతిపాదించారు. హెచ్-1బీ వీసాదారులు తమ కుటుంబ సభ్యులను తీసుకురావడాన్ని నిషేధించడంతోపాటు హెచ్-1బీ నుంచి నేరుగా గ్రీన్ కార్డ్ పొందే ప్రక్రియను కూడా అడ్డుకోవాలని బిల్లులో ప్రతిపాదించారు. విద్యార్థులకు ఎంత మేలు చేసే, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను కూడా రద్దు చేయనున్నారు.
అమెరికాలో పెద్ద కార్పొరేట్ సంస్థలు తక్కువ వేతనానికి దొరికే విదేశీ కార్మికులను తీసుకువస్తున్నారన్న అపవాదు లేకపోలేదు. అలా విదేశీ కార్మికులను అమెరికాలో డంప్ చేసి.. ఆ మేరకు అర్హులైన అమెరికన్లను ఉద్యోగాల నుంచి తప్పిస్తున్నాయని రిపబ్లికన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒక ప్రభుత్వం కష్టపడి పని చేసే పౌరులకు మద్దతుగా నిలవాలి కానీ, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాయకూడదని హితవు చెబుతున్నారు రిపబ్లికన్లు. పైగా ఇంతటితో ఆగని ఒకరిద్దరు రిపబ్లికన్లు.. ఈ వ్యవస్థను స్కామ్ అని అభివర్ణిస్తున్నారు. అసలు సిసలైన అమెరికన్ల ఉద్యోగాలను రక్షించడమే తమ బాధ్యత అని గుర్తు చేస్తున్నారు. అమెరికన్లకు బదులు విదేశీ కార్మికులకు లబ్ధి చేకూరే ఎటువంటి చర్యల్నైనా వ్యతిరేకిస్తామన్నారు రిపబ్లికన్లు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే హెచ్1బీ వీసాలను అత్యధికంగా పొందుతున్నది భారతీయులే. ప్రధానంగా ఐటీ, ఇంజనీరింగ్ రంగాల్లో నిపుణులు ఈ వీసాలపై ఆధారపడుతున్నారని చెప్పకతప్పదు. కనీస వేతనం 2 లక్షల డాలర్లుగా నిర్ణయిస్తే ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు అమెరికా వెళ్లడం ఇక కలగానే మిగిలిపోనుందన్న ఆందోళన అత్యధికమంది భారతీయుల్లో వ్యక్తమవుతోంది. అలాగే థర్డ్ పార్టీ స్టాఫింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగాలు పొందడానికి కూడా ఈ బిల్లు నిషేధిస్తోంది. అయితే.. ప్రస్తుతానికి ఇది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే. ఇది అమెరికన్ కాంగ్రెస్‌లోని రెండు సభల్లో నెగ్గి, అధ్యక్షుడి ఆమోదం పొందాల్సి ఉంటుంది. 2026 నాటికి ఈ మార్పులను తీసుకురావాలని ప్రతిపాదించినప్పటికీ దీనిపై అమెరికా రాజకీయాల్లో, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తమ్మీద ఈ బిల్లు రెండు సభల్లోనూ నెగ్గుతుందా..? వీడిపోతుందా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.




