Burning Topic: ట్రంప్ మెడకు చుట్టుకున్న ఇరాన్ యుద్ధం!
Burning Topic: అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్‌పై సొంత పార్టీ సభ్యుడే అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం కలకలం. ట్రంప్ తీవ్ర వ్యతిరేకత.
Burning Topic: ట్రంప్ మెడకు చుట్టుకున్న ఇరాన్ యుద్ధం!
Burning Topic: మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల ఘోర పరాజయ ప్రభావం తాలూకు సెగ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బలంగా తాకుతోంది. అమెరికాలో ద్రవ్యోల్భనానికి ఇరాన్ మీద చేపట్టిన యుద్ధమే కారణమంటూ తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో తీర్పు ఇచ్చారు. ఈ యుద్ధం వల్ల వచ్చిన ప్రజా వ్యతిరేకతతో డెమొక్రాట్లు భారీ విజయాన్ని సాధించి, సెనేట్‌లో కనీసం 54 సీట్లను కైవసం చేసుకున్నారు. తమ పార్టీ చారిత్రక ఓటమికి ఇరాన్ యుద్ధం, దాని వల్ల పెరిగిన ఇంధన ధరలే ప్రధాన కారణమని ట్రంప్ స్వయంగా అంగీకరించారు. మధ్యంతర ఎన్నికల తర్వాత అమెరికా ప్రతినిధుల సభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో డెమోక్రాట్లు ఇక ప్రతీకారం తీర్పుకుంటారని అంతా అనుకుంటున్న దశలో సొంత రిపబ్లికన్ పార్టీలోనే విబేధాలు బయట పడుతున్నాయి. తాజా అమెరికా ప్రతినిధుల సభలో రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ మీద అభిశంసన తీర్మాణం ప్రవేశ పెట్టారు. ఈ పని చేసింది డెమోక్రాట్లు కాదు. స్వయాన ట్రంప్ పార్టీకి చెందిన సభ్యుడే ఇందుకు పూనుకున్నారు.
యూఎస్ కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్‌పై ఏకంగా ఎనిమిది అభిశంసన ఆర్టికల్స్‌ను సభలో ప్రవేశపెట్టారు కెంటకీకి చెందిన రిపబ్లికన్ సభ్యుడు థామస్ మాసీ. ఇరాన్‌పై యుద్ధం, యెమెన్, వెనెజువెలాలో అమెరికా సైనిక చర్యల్లో ఆయన పాత్రను ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇరాన్‌తో అక్రమంగా యుద్ధానికి వెళ్లడం, రక్షణ శాఖాధిపతిగా తన అధికారాలను దుర్వినియోగం చేశారనే ప్రధాన ఆరోపణలతో ఈ అభిశంసన ప్రతిపాదనను తెచ్చినట్లు తెలిపారు. హెగ్సెత్ తీసుకున్న నిర్ణయాలు తీవ్రమైన నేరాలు, అధికార దుర్వినియోగం కిందకు వస్తాయని, అందువల్ల ఆయన పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదని మాసీ ఆరోపించారు. అంతేకాకుండా యెమెన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా చేపట్టిన దాడులు, వెనెజువెలాలో గత నాయకత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన సైనిక చర్యల్లో హెగ్సెత్ పాత్రను కూడా ప్రశ్నించారు.
పీట్ హెగ్సెత్‌పై అభిశంసన తీర్మాన పరిణామం ఇరాన్ యుద్ధ వ్యవహారంలో రిపబ్లికన్ పార్టీలోని అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది. ఈ తీర్మానంపై ఈ వారంలోనే ప్రతినిధుల సభలో ఓటింగ్ జరిగే అవకాశం ఉండటంతో అమెరికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ యుద్ధాన్ని ముందస్తు అనుమతి లేకుండా నడిపించారనే ప్రధాన ఆరోపణలతో దాఖలైన ఈ తీర్మానానికి డెమోక్రాట్లు కూడా పూర్తి మద్దతు ప్రకటించడంతో హెగ్సెత్ పదవిలో కొనసాగడంపై ఉత్కంఠ నెలకొంది. ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందితే తదుపరి విచారణ కోసం సెనేట్‌కు వెళ్తుంది. అయితే, ప్రస్తుతం ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ రిపబ్లికన్లకే మెజారిటీ ఉంది. కొత్త కాంగ్రెస్ జనవరిలో కొలువుదీరిన తర్వాత డెమోక్రాట్లకు నియంత్రణ దక్కనుంది. దీంతో ఈ తీర్మానంపై ఓటింగ్ ఎప్పుడు జరుగుతుంది? దాని ఫలితం ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా పీట్ హెగ్సెత్‌పై అభిశంసన ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా వ్యతిరేకించారు. ఆయన రెండు యుద్ధాల్లో గెలిచారు. అలాంటి వ్యక్తిని మీరెలా అభిశంసించగలరు?’ అంటూ సమర్థించారు. మిడిల్ ఈస్ట్ దేశాలను, ఇజ్రాయెల్‌ను కాపాడిన రక్షణ మంత్రిని తొలగించడం సరికాదన్నారు. అలాగే హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ.. అంతర్జాతీయంగా శత్రువులు, మిత్రదేశాల ముందు ఇలాంటి చర్యలు తప్పుడు సంకేతాలు పంపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హెగ్సెత్ను తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయనను అభిశంసించాలంటున్నారు. మరి వియత్నాం యుద్ధాన్ని నడిపించిన వారిని ఎందుకు అభిశంసించలేదు? ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాలకు బాధ్యులైన వారిని ఎందుకు ప్రశ్నించలేదు? ఆ యుద్ధాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు అని ట్రంప్ గుర్తు చేశారు.
గతంలో ఎలాంటి ప్రయోజనం లేకుండా సాగిన యుద్ధాలకు బాధ్యులైన నాయకులను ఎందుకు అభిశంసించలేదన్న ట్రంప్.. హెగ్సెత్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన కెంటకీ రిపబ్లికన్ ప్రతినిధి థామస్ మాసీపై సైతం తీవ్ర విమర్శలు చేశారు. అతనొక ఓటమిపాలైన వ్యక్తి. కాంగ్రెస్, సెనేట్ సమయాన్ని వృథా చేయకూడదు. ఎంత మంచి బిల్లును తీసుకొచ్చినా అతను వ్యతిరేకంగానే ఓటు వేస్తాడు. అతనిలో ఏదో సమస్య ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు తనపై వచ్చిన అభిశంసన ఆరోపణలను పీట్ హెగ్సెత్ కొట్టిపారేశారు. ఈ ఆరోపణలన్నీ రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని అన్నారు. ఈ రాజకీయ వ్యూహాలు తనపై పనిచేయవని స్పష్టం చేశారు. తనను బలహీన పరచడం ఎవరితరం కాదని, తాను తాను ఎలాంటి పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం చేశారు. ఈ సైనిక చర్యలను విమర్శించడం అంటే వాటిలో పాల్గొన్న సైనికుల విజయాలను ప్రశ్నించడమేనని ఆయన వాదిస్తున్నారు.
అమెరికా సెనేట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం కాబట్టి తనను దోషిగా తేల్చడం అంత సులభం కాదని, తాను దీనికి భయపడటం లేదని పీట్స్ హెగ్సెత్ తేల్చిచెప్పారు.మరోవైపు ఇరాన్ అణ్వాయుధం నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి దిగారని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. ఇరాన్ రూపంలో ట్రంప్ ఒక అసలైన ముప్పును గుర్తించారని, ఆ దేశం అణ్వాస్త్రాలను తయారు చేయకుండా అడ్డుకున్నారని వివరించారు. మొత్తం మీద ఇరాన్ యుద్ధం అమెరికా విదేశాంగ, రక్షణ విధానాలకే కాకుండా ట్రంప్ ప్రభుత్వ అంతర్గత రాజకీయాలకూ సమస్యగా మారింది. మధ్యంతర ఎన్నికల పరాజయం తర్వాత హెగ్సెత్‌పై అభిశంసన ప్రయత్నాలు ప్రారంభం కావడం రిపబ్లికన్ పార్టీలోనూ ఒత్తిడిని పెంచుతోంది. ఈ తీర్మానంపై ప్రతినిధుల సభలో జరిగే ఓటింగ్ అమెరికా రాజకీయాల్లో తదుపరి పరిణామాలకు కీలకంగా మారనుంది.




