BurningTopic: మోదీ జపం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

BurningTopic: G7 సమావేశంలో ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించిన ట్రంప్! మోదీని "కిల్లర్" అని ఎందుకు అన్నారు?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Jun 2026 6:56 AM IST
BurningTopic
X

BurningTopic: మోదీ జపం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

BurningTopic: ఫ్రాన్స్ ఎవియన్​నగరంలో జరుగుతున్న జీ7 సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.. గతేడాది ఫిబ్రవరి తర్వాత వీరిద్దరూ ప్రత్యక్షంగా భేటీ కావడం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికాల యుద్ధం ముగియడం, త్వరలో భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో పలు ద్వైపాక్షిక అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించారు. అనంతరం మీడియాతోనూ మాట్లాడారు ప్రధాని మోదీతో మంచి చర్చలు జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.. భారత్, అమెరికా మధ్య చాలా మంచి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అమెరికా మునుపెన్నడూ లేనంతగా అద్భుతంగా రాణిస్తోందన్నారు. 19.2 ట్రిలియన్లపైగా ఆదాయం వస్తోందని తాము ఫ్యాక్టరీలతో పాటు మరెన్నో నిర్మిస్తున్నామని ట్రంప్ వివరించారు. ప్రధాని మోదీ అమెరికాలో చాలా ప్రాజెక్టులు చేపడుతున్నారని ట్రంప్ వెల్లడించారు.

భారత్‌ తమకు నమ్మకమైన భాగస్వామి అని వ్యాఖ్యానించారు డొనాల్డ్ ట్రంప్. తాను భారత్‌లో పర్యటించబోతున్నానని తెలిపారు. అయితే ఎప్పుడు పర్యటించేదీ వెల్లడించలేదు. భారత్, అమెరికాల మధ్య అద్భుతమైన స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. మోదీ నాకు గొప్ప మిత్రుడు. ఆయన ఉన్నంత కాలం భారత్‌కు నా మద్దతు ఉంటుంది. ఆ తర్వాత ఎవరైనా కొత్త నాయకుడు వస్తే ఏం జరుగుతుందో తెలియదు. కానీ మోదీ నాయకత్వంలో భారత్ మరింతగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆయన నాయకుడిగా ఉన్నంత కాలం అద్భుతంగా రాణిస్తుంది’ అని వ్యాఖ్యానించారు డొనాల్డ్ ట్రంప్. తాను మొదటి విడత అమెరికా అధ్యక్షునిగా ఉన్న కాలంలో నిర్వహించిన హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసున్నారు.

మోదీ ప్రధానిఉండగా ఎవరైనా భారత్‌పై దాడి చేయడానికి సాహసిస్తే తాము వెంటనే రంగలోకి దిగి వారి అంతు చూస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. మోదీ పదవిలో ఉండగా భారత్‌ వైపు కన్నెత్తి చూడొద్దని ముష్కరులను హెచ్చరించారు. భారత్‌తో తమకు అధికారికంగా రక్షణ ఒప్పందం లేకపోయినప్పటికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటామన్నారు. మోదీ చాలా మంచి మనిషి, సౌమ్యుడు, నెమ్మదస్తుడు అని అంటుంటారు. కానీ, నిజానికి నా దృష్టిలో ఆయన చాలా కఠినమైన వ్యక్తి, ఒక కిల్లర్‌. వ్యాపారం, వాణిజ్య చర్చల్లో మోదీ చాలా కఠినంగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. ఆయనకు భారతీయ ప్రజలంటే ఇష్టం, అలాగే అమెరికా అంటే కూడా ఇష్టమే’ అని ప్రశంసలు గుప్పించారు ట్రంప్. ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన సంకేతంగా భావిస్తున్నప్పటికీ, మోదీ వ్యక్తిగత నాయకత్వంపై ట్రంప్ ప్రత్యేక ప్రశంసలు కనిపించడం చర్చనీయాంశంతా మారింది.

కాగా ట్రంప్‌తో జరిగిన సమావేశంలో ఇటీవల హర్మూజ్‌లో భారత జెండా ఉన్న నౌకపై అమెరికా దాడిని ప్రస్థావించారు ప్రధాని మోదీ. హర్మూజ్ జలసంధిలో నావికుల భద్రత భారత్‌కు ఎంతో ముఖ్యమని స్పష్టంచేశారు.. హర్మూజ్ జలసంధిని తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమని అన్నారు. నౌకాయాన స్వేచ్ఛ కచ్చితంగా ఉండాలని మేము ఎల్లప్పుడూ చెబుతున్నాము. భారత్‌కు చెందిన లక్షలాది మంది నావికులు ప్రపంచంలోని వివిధ సముద్రాల్లో తమ సేవలను అందిస్తున్నారు, ప్రపంచ ప్రగతిలో గొప్ప సహకారం అందిస్తున్నారని మీకు తెలుసు. వారి భద్రత కూడా అంతే ముఖ్యమని నేను భావిస్తున్నాను. ఈ ఒప్పందంలో నావికుల భద్రత కూడా నిర్ధారించడానికి ప్రాధాన్యం లభిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది.. అంటూ పేర్కొన్నారు మోదీ.పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించడానికి అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు.

ఇదిలా ఉంటే అమెరికా, ఇరాన్‌ ఒప్పందంపై సంతకాలు జరిగిన వేళ ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు చేసింది. ఇది మోదీ విదేశాంగ విధానానికి గట్టి ఎదురుదెబ్బ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు. ఈ ఒప్పందంతో అంతర్జాతీయస్థాయిలో పాకిస్థాన్‌ ప్రాబల్యం పెరిగిందన్నారు. అమెరికా, ఇరాన్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని అధికారికంగా "ఇస్లామాబాద్‌ MOU”గా పిలవడం పాక్‌ సాధించిన నూతన ప్రాంతీయ, అంతర్జాతీయ పలుకుబడికి నిదర్శమని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా భౌగోళిక, భద్రత వ్యవహారాల్లోకి పాకిస్థాన్ మరింత లోతుగా చొచ్చుకుపోయిందన్నారు. ఇది భారత్‌ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఈ ఒప్పందం ఇజ్రాయెల్‌కు స్పష్టమైన ఓటమి అని చెప్పారు. కానీ ఇజ్రాయెల్ పట్ల మోదీ ప్రదర్శిస్తున్న వైఖరితో భారత్‌ భారీ మూల్యం చెల్లించుకుంటోందని జైరాం రమేశ్‌ విమర్శించారు.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story