Burning Topic: ఇరాన్ కు అమెరికా బంపర్ ఆఫర్? 60 రోజులు యుద్ధం బంద్?

Burning Topic: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య 60 రోజుల కాల్పుల విరమణకు రంగం సిద్ధం? భారీ ప్యాకేజీ ఆఫర్ చేస్తున్న అమెరికా. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుతాయా?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 May 2026 7:00 AM IST
Burning Topic
X

Burning Topic: ఇరాన్ కు అమెరికా బంపర్ ఆఫర్? 60 రోజులు యుద్ధం బంద్?

Burning Topic: అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్న పశ్చిమాసియా పరిణామాలు చివరకు ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. అమెరికా–ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా సాగుతున్న చర్చలు కొలిక్కి వచ్చి ఇప్పుడు ఒక తాత్కాలిక అంగీకారం దశకు చేరుకున్నట్లు చెబుతున్నారు. ఇది అమలైతే రెండు దేశాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతూ, ప్రధాన అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. భారీ డీల్‌లో భాగంగా ఇరాన్‌కు అమెరికా అనేక ఆఫర్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.ఈ యుద్ధానికి ప్రధాన కారణమైన అణు కార్యక్రమంపై ఇరాన్ కాస్త తగ్గినట్లు చెబుతున్నారు. తాము ఎలాంటి అణ్వాయుధాలను తయారు చేయబోమని ఈ ఒప్పందంలో హామీ ఇవ్వనుంది. అయితే, ఇరాన్ వద్ద ఇప్పటికే ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను దాతృత్వ దేశాలకు అప్పగించడం, అణు కేంద్రాల తనిఖీల వంటి మిగిలిన వివాదాస్పద అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారు.

ఒప్పందంలోని మరో కీలక అంశం హర్మూజ్ జలసంధి. ప్రపంచంలోని మొత్తం చమురు, సహజ వాయువు సరఫరాలో 20 శాతం వాటా ఈ జలసంధి గుండానే సాగుతుంది. యుద్ధం కారణంగా ఇరాన్ దీనిని మూసివేయగా, అమెరికా ఇరాన్ రేవులపై నౌకాదళ దిగ్బంధనం విధించింది. అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని పూర్తిగా తెరవడం, మైన్స్ తొలగించడం, ఎలాంటి పన్నులు లేకుండా నౌకా రవాణాపై ఆంక్షలు తగ్గించడం వంటి ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి. దీనికి ప్రతిగా అమెరికా కూడా తన నావికా ఆంక్షలను దశలవారీగా తగ్గించే అవకాశం ఉందని సమాచారం. ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షల సడలింపు, విదేశాల్లో నిలిచిపోయిన బిలియన్ల డాలర్ల ఆస్తుల విడుదలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్‌కు మానవతా సహాయం కింద 300 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ పెట్టుబడి నిధి అంశం కూడా ఇందులో ఉంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ఈ నిధులు చెబుతున్నారు.

కాగా ఈ ప్రతిపాదలన ఫైల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టేబుల్‌ మీదే ఉందని.. ఆయన ఇంకా ఓకే చెప్పలేదని అంటున్నారు. అయితే ఈ ఫైల్‌ ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టేబుల్‌ మీదే ఉందని.. ఆయన ఇంకా ఓకే చెప్పలేదని సమాచారం. అలాగే ఇరు దేశాల నుంచి సానుకూలత ఉందా? అనేదానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఒప్పందంలో కొన్ని అంశాలపై అమెరికా, ఇరాన్ మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అమెరికాతో ఒప్పందాన్ని ఇంతవరకూ ఇరాన్‌ ధ్రువీకరించలేదు. ఒప్పందం ఎప్పుడు తుది రూపం దాల్చుతుందో స్పష్టత లేకపోయినా.. రెండు దేశాల మధ్య చర్చలు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయి. ఇరాన్‌తో ఈ వారాంతంలోగా ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే వెల్లడించారు. కాగా చర్చల్లో పురోగతి కనిపిస్తోందని, తుది ఒప్పందం కుదరలేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే.. మరోవైపు దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్‌ సైనిక స్థావరంపై రక్షణాత్మక దాడికి దిగినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. హార్మూజ్‌ జలసంధి పరిసరాల్లో ముప్పుగా పరిణమించిన నాలుగు ఇరాన్‌ వన్‌–వే దాడి డ్రోన్లను అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ దళాలు కూల్చివేశాయి. బందర్‌ అబ్బాస్‌లోని ఇరాన్‌ గ్రౌండ్‌ కంట్రోల్‌ స్టేషన్‌పై అమెరికా దళాలు క్షిపణులు వర్షం కురిపించాయి. ఐదో డ్రోన్‌ను ప్రయోగించడానికి ఇరాన్‌ జవాన్లు సిద్ధమవుతున్న సమయంలోనే ఈ దాడి జరిగింది. మరోవైపు ఇరాన్‌ సైన్యం కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. అయితే, వీటిని కువైట్‌ గగనతల రక్షణ వ్యవస్థలు మధ్యలోనే కూల్చివేసినట్లు అమెరికా సైనిక వర్గాలు గురువారం స్పష్టంచేశాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘిస్తోందని ఆరోపించాయి.

ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒమాన్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. యుద్ధాన్ని ముగించే కొత్త ఒప్పందంలో భాగంగా.. ఇరాన్, ఒమన్‌ కలిసి హార్మూజ్‌ గుండా జరిగే రవాణాను నియంత్రిస్తాయంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ఒమన్‌ సహా ఏ ఒక్క దేశాన్ని కూడా ఇందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఒమన్ హర్మూజ్ జలమార్గంపై జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఆ జలసంధిని ఎవరూ కంట్రోల్‌ చేయలేరని, అవి అంతర్జాతీయ జలాలు అని గుర్తుచేశారు. ఒమన్‌ కూడా అందరిలాగే ప్రవర్తించాలని, లేకపోతే ఆ దేశాన్ని కూడా పేల్చివేయాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. ఒమన్‌కు ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒమన్, అమెరికా మిత్రదేశాలు. అమెరికా సైనిక కార్యక్రమాలకు ఒమన్‌ సహకరిస్తోంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య నిశ్శబ్ద మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వచ్చింది.

కాగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని భారత జాతీయ భద్రతా సలహాదారు అజీత్‌ డోభాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధి, రెడ్‌సీ మార్గాల్లో అంతర్జాతీయ వాణిజ్య రవాణా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మాస్కోలో నిర్వహించిన తొలి అంతర్జాతీయ భద్రతా వేదికతో పాటు 14వ అంతర్జాతీయ భద్రతా అధికారుల సమావేశంలో అజీత్‌ డోభాల్‌ పాల్గొని ప్రసంగించారు. సముద్ర రవాణాపై పెరుగుతున్న ముప్పులు, ఇంధన మౌలిక వసతులపై దాడులు ప్రస్తుతం పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చూపిస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ జల మార్గాల్లో వాణిజ్య రవాణా సురక్షితంగా, నిరంతరాయంగా కొనసాగాలన్నారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు, ప్రాంతీయ స్థిరత్వం పునరుద్ధరించేందుకు భారత్‌ సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story