Burning Topic: మిడిల్ ఈస్ట్‌లో ఆరని మంటలు!

Burning Topic: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: లారక్ ద్వీపంలో అమెరికా దాడులు, జోర్డాన్‌పై ఇరాన్ క్షిపణి ప్రయోగాలు. ట్రంప్ హెచ్చరికలు, రక్షణ కార్యదర్శి రాజీనామా.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Sept 2026 8:09 AM IST
Burning Topic
X

Burning Topic: మిడిల్ ఈస్ట్‌లో ఆరని మంటలు!

Burning Topic: పశ్చిమాసియాలో దాదాపు నెలరోజులు తర్వాత పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పరస్పర దాడులతో అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. యుద్ధం ప్రారంభంకాగానే హర్మూజ్ జలసంధిని తన నియంత్రణలోకి తెచ్చుకున్న ఇరాన్.. దానిలోని అంతర్జాతీయ నౌకా మార్గాల్లో సీమైన్స్ ను ఏర్పాటు చేయడం తెలిసిందే.

ఈ మార్గాల్లో వెళ్లిన పలు నౌకలు వాటిని ఢీకొని పేలిపోవడంతో అమెరికా బలగాలు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి వాటిని తొలగిస్తున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ బలగాలు లారక్ ద్వీపంలో రాకెట్ లాంచర్లను సిద్ధం చేస్తున్నట్లు అమెరికా గుర్తించింది.

వెంటే వాటిని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. అమెరికా దాడులకు ప్రతిగా రెండు గంటల వ్యవధిలోనే అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ దాడులు చేసింది. జోర్డాన్‌లోని అమెరికాకు చెందిన కింగ్‌ హుస్సేన్‌, అల్‌ అజ్రక్‌ సైనిక స్థావరాలపై బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడింది.

ఈ రెండు ఘటనలు పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 1,100 కిలోమీటర్ల దూరంలోని లారక్ ద్వీపానికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. ప్రపంచంలోని కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధికి సమీపంలో ఉండటంతో దీన్ని టార్గెట్ చేసింది అమెరికా.

ఈ దాడులపై ఇరాన్‌ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. అమెరికా దాడిలో సైనికులు, పౌరులు మరణించారని, పలువురు గాయపడ్డారని ఆరోపించింది. ఈ దాడి తమ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమేనని పేర్కొంది.

జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై తాము చేసిన దాడులు ఆత్మరక్షణ చర్యల్లో భాగమే అని ఇరాన్‌ స్పష్టం చేసింది. అమెరికా మరిన్ని దాడులకు పాల్పడితే తాము వెనక్కి తగ్గబోమని హెచ్చరించింది. అమెరికా దాడులను నిలిపివేయాలని భద్రతా మండలిని కోరింది.

హర్మూజ్‌లో ఇరాన్ ఏర్పాటుచేసిన సీమైన్స్​ ఇప్పటికే తొలగించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మళ్లీ అమర్చితే వెంటనే వాటిని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్‌లోని ఖర్గ్‌ ద్వీపాన్ని పేల్చేస్తూ రూపొందించిన ఏఐ వీడియోను పోస్టు చేశారు ట్రంప్.

ఇది తీవ్ర చర్చకు దారి తీయండంతో తాము ఖర్గ్‌ ద్వీపంపై ఎలాంటి దాడులు చేయలేదని అమెరికా అధికారి తెలిపారు. మరి ఈ పోస్టు వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించగా.. ట్రంప్ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో వ్యూహాత్మకంగా సందేశాలు ఇస్తారని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తెలిపారు (Truth Post pn Kharg)

కాగా ఇరాన్‌ దాడులకు కచ్చితంగా ప్రతీకారం ఉంటుందన్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఆ ప్రతీకార చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై స్పష్టత ఇవ్వకపోయినా.. అమెరికా సైనిక, ఆర్థిక మార్గాల్లో చర్యలకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇచ్చారు. అలాగే ఇరాన్‌ను ఓ విఫల దేశంగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారి నాయకులు ఎవరో వారికే తెలియదన్నారు ట్రంప్.

ఇరాన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై అణ్వస్త్రాల వినియోగంపై ఓ విలేకరి అడగ్గా, అది తెలివితక్కువ ప్రశ్న అంటూ ట్రంప్‌ కొట్టిపారేశారు. ఇప్పటికే సైనికంగా పూర్తిగా దెబ్బతిన్న ఇరాన్‌పై అణ్వాయుధం వాడాల్సిన అవసరం లేదన్నారు.

అయితే, ఇరాన్ చేతికి అణ్వస్త్రాలు చిక్కితే ఇజ్రాయెల్‌కు తీవ్ర ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్‌ నౌకాదళం, వైమానిక దళం, కరెన్సీ వంటి కీలక వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇరాన్ ఒక విఫలమైన దేశం. అక్కడ 350 శాతం ద్రవ్యోల్బణం ఉంది. అంతేకాదు, వారు తమ సైనికులకు జీతాలు కూడా చెల్లించడం లేదు.

వారి నౌకాదళం, వైమానిక దళం కనుమరుగైంది. వారి నిఘా పరికరాలు కూడా దాదాపు దెబ్బతిన్నాయి. హర్మూజ్ ప్రస్తుతం అది మా అదుపులోనే ఉంది. మా నౌకాదళం సహాయంతో ఎన్నో నౌకలు అక్కడికి వెళ్తున్నాయి. దీంతో చాలావరకు చమురు బయటకు వస్తోంది. అందుకే చమురు ధర వారు ఊహించినంతగా పెరగలేదు" అని ట్రంప్​ పేర్కొన్నారు.

మరోవైపు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి డ్యాన్ డ్రిస్కోల్ రాజీనామా చేయడం కలకలం రేపింది. ఒకవైపు ఇరాన్‌తో ఉద్రిక్తత పరిస్థితులు, మరోవైపు రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న వేళ ఆయన అంశం చర్చనీయాంశంగా మారింది.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసి ఆర్మీ ప్రస్తుత పరిస్థితులను వివరించిన అనంతరం ఆయన తన రాజీనామా లేఖను సమర్పించిచారు. డ్రిస్కోల్ రాజీనామాను వైట్ హౌస్ కూడా ధ్రువీకరించింది. ఆర్మీలో రక్షణ సంసిద్ధతను పెంపొందించడంలో, సైనిక కార్యక్రమాలను విజయవంతం చేయడంలో డ్రిస్కోల్ అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించారని కొనియాడారు.

కాగా డ్యాన్ డ్రిస్కోల్ రాజీనామాకు ఆధిపత్య పోరే అని చెబుతున్నారు. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్‌తో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరే ఈ అనూహ్య నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇద్దరి మధ్య అధికార పరిధులు, నిర్ణయాలు తీసుకునే తీరుపై తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు చెబుతున్నారు

మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ముస్లిం దేశాలన్నీ ఐక్యంగా నిలవాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు. తమ అసలు శత్రువును గుర్తించి, వారి ప్రణాళికలను అర్థం చేసుకుని ఎదుర్కోవాలని ఆయన సూచించారు.

"ఏ పదవిలో ఉన్నవారైనా, తెలిసిగానీ తెలియకుండాగానీ, ఉద్దేశపూర్వకంగాగానీ అనుకోకుండాగానీ, ముస్లింల మధ్య విభజనకు, ముస్లిం సమాజంలో సంఘర్షణకు దారితీసే ఏ పని చేసినా, వారు ఇస్లాం శత్రువుల ప్రయోజనాలకు సేవ చేసినట్లే మీ నిజమైన శత్రువును గుర్తించండి, దాని ప్రణాళికను అర్థం చేసుకోండి, దాన్ని ఎదుర్కోండి" అని లేఖలో తెలిపారు.

అమెరికా, ఇజ్రాయెల్‌లను ఉద్దేశిస్తూ పరోక్షంగా ముస్లిం దేశాలకు సూచన చేశారు.సామాజిక సామరస్యానికి భంగం కలిగించే ఏ పనినైనా చేయడం నిషిద్ధమని తాను గట్టిగా ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు. కాగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులతో పడటంతో ఆ దేశాలన్నీ ఇరాన్‌పై దేశాలన్నీ గుర్రుగా ఉన్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story