Burning Topic: మిడిల్ ఈస్ట్‌లో శాంతికి టైమ్ వచ్చింది
Burning Topic: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరే అవకాశం ఉన్న శాంతి ఒప్పందంపై పూర్తి విశ్లేషణ.
Burning Topic: మిడిల్ ఈస్ట్‌లో శాంతికి టైమ్ వచ్చింది
Burning Topic: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు తొలగిపోయి శాంతి చిగురించినట్లేనా?.. తాజా పరిణామలు చూస్తుంటే ఇది నిజమనే నమ్మక తప్పదు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన ఒప్పందంముసాయిదాపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో తొలి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఈ వారాంతంలోనే జెనీవా వేదికగా అంగీకారం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే ఇరాన్ మీద దాడులు నిలిపేస్తున్నామని తెలిపారాయన. అయితే ఒప్పందంలో పొందుపరచాల్సిన అంశాలపై వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య తుది అంగీకారం కుదిరిందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ అమెరికాతో ఒప్పందానికి ఇంత చేరువగా గతంలో ఎన్నడూ రాలేదని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా ‘ఎక్స్’లో పోస్టు పెట్టడం.. దాన్ని ట్రంప్ చేసి ప్రశంసించడంతో ఆశలు చిగురించాయి.
అంతకు ముందు ఇరాన్‌తో గొప్ప ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించిందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందంతో ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదని పేర్కొన్నారు. డీల్‌పై సంతకాల తర్వాత హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని వెల్లడించారు. దీంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై నెలకొన్న ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదిత ఒప్పందానికి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆమోదించారని తాను విశ్వసిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యూరప్‌లో ఈ వారాంతంలో డీల్‌పై సంతకాలు జరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తాను హాజరుకాబోనని, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరుకావొచ్చని అన్నారు. తాజా చర్చలకు సంబంధించి ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, పాకిస్తాన్‌లతో సహా మధ్యప్రాచ్య దేశాల నాయకులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను ముగించడానికి అమెరికా - ఇరాన్ దేశాలు ఒక కీలక ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి చేసిన ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో, 'ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం' గతంలో ఎప్పుడూ లేనంతగా తుది దశకు చేరుకుందని తెలిపారు. మరోవైపు ఇరాన్ మీడియా వెల్లడించిన వివరాలు కొంత గందరగోళానికి దారి తీశాయంటున్నారు. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడే వరకు సంయమనం పాటించాలని, ఊహించి చెప్పవద్ద అరాఘ్చిని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఇంకా కొన్ని విభేదాలు, చర్చించాల్సిన అంశాలు మిగిలి ఉన్నా ఇది ప్రపంచ శాంతి, మధ్యప్రాచ్య స్థిరత్వానికి సానుకూల సంకేతం అని చెబుతున్నారు.
ఈ ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం అణ్వాయుధాలను ఎప్పటికీ అభివృద్ధి, కొనుగోలు చేయకూడదని ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధికారులు తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రాధాన్యంగా భావించిన అంశాల్లో ఇదొకటన్నారు. ఈ హామీ కేవలం మాటలకే పరిమితం కాకుండా, కఠిన తనిఖీలు, నిరంతర పర్యవేక్షణ, ధ్రువీకరణ వ్యవస్థలతో అమలవుతుందని స్పష్టం చేశారు. ఇరాన్ తన బాధ్యతలను నిజంగా నిర్వర్తిస్తోందని నిర్ధరణ అయిన తర్వాత మాత్రమే ఒప్పందం కింద ప్రయోజనాలు అందుతాయని వివరించారు. ఒప్పందంలో భాగంగా బాగా శుద్ధి చేసిన అణు పదార్థాలను పూర్తిగా తొలగించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు చెబుతున్నారు. అలాగే అణ్వాయుధాల తయారీకి దోహదపడే అణు కేంద్రాలను నిర్వీర్యం చేసే అంశంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రక్రియలో సాంకేతిక అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ ప్రతిపాదిత ఒప్పందంలో.. అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి ఉండబోతోందని తెలుస్తోంది. ప్రపంచ చమురు, సహజవాయు సరఫరాల్లో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. యుద్ధం తర్వాత ఇరాన్ మూసివేసిన ఈ జలసంధిని మళ్లీ తెరవడానికి అంగీకరించినట్లు సమాచారం. ప్రతిగా అమెరికా ఇరాన్‌పై విధించిన కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించడంతో పాటు, నిలిపివేసిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడదీయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు సరఫరాలపై భయాలు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు రెండు నెలల కనిష్ఠానికి చేరాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం తన ప్రధాన లక్ష్యాలను నెరవేర్చిందని చెబుతున్నప్పటికీ, ఒప్పంద నిబంధనలు ఇరాన్‌కు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే హర్మూజ్ జలసంధి నుంచి బయలుదేరుతున్న భారతీయ నౌకలపై జరిగిన దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భారతీయ నౌకలపై ఈ దాడులకు పాల్పడింది ఇరాన్ బలగాలే అని ఆరోపించారు. భారత నౌకలపై ఇరాన్ విఫలమైన డ్రోన్ దాడి చేయగా, వాటిని అమెరికా రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకొని, ఇరాన్ డ్రోన్లను కూల్చివేసినట్లు ట్రంప్ తెలిపారు. వాణిజ్య నౌకలపై దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని.. ఇప్పటికైనా తన పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. కాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది.ఈ ఆరోపణలు నిరాధారమైనవి మాత్రమే కాదని, అమెరికా దళాలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్న నాకటంగా అభివర్ణించింది. భారతీయ వాణిజ్య నౌకపై అమెరికా సైన్యమే దాడులు చేసిందని, ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడానికే వాషింగ్టన్ ఇరాన్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని పేర్కొంది.




