Burning Topic: అమెరికా మాట వినని ఇరాన్..భీకర దాడులకు అమెరికా సిద్ధం
Burning Topic: అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ఏంటి?
Burning Topic: అమెరికా మాట వినని ఇరాన్..భీకర దాడులకు అమెరికా సిద్ధం
Burning Topic: పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి.. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారంతో తాత్కాలికంగా ఆగిన యుద్ధం.. శాశ్వత ముగింపు వరకూ వెళ్లేలా లేదు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. దాదాపు 21 గంటలు అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగాయి. చర్చల ప్రారంభం నుంచే ఇరువర్గాల మధ్య తీవ్ర విభేదాలు కనిపించాయి. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదని, వాటి తయారు చేసే సామర్థ్యాన్ని కూడా పొందకూడదని అమెరికా పట్టుబట్టింది. ఇందుకు ఇరాన్ అంగీకరించలేదు. ఇటు గల్ఫ్ దేశాల్లో ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ ఇస్తున్న మద్దతును కూడా అమెరికా వ్యతిరేకించింది. ఇరాన్ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో ఒప్పందం సాధ్యం కాదని అమెరికా తరపున చర్చలకు నాయకత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తేల్చేశారు. ఇది అమెరికాకు కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టమని చెప్పి స్వదేశానికి పయనమయ్యారాయన
మరోవైపు ఇరాన్ మాత్రం అమెరికా మితిమీరిన డిమాండ్ల కారణంగానే ఈ చర్చలు విఫలమయ్యాయని చెబుతోంది. తాము దౌత్యపరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాన్స్ బృందం దిగిరాలేదంటోంది. హర్మూజ్ జలసంధి, ఇరాన్ అణు హక్కులు వంటి కీలక అంశాలపై ఏమీ తేలకుండానే చర్చలు ముగిశాయని ఇరాన్ బృందం వెల్లడించింది. ఈ రెండు, మూడు విషయాల్లోనే అభిప్రాయ భేదాలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క సమావేశంలోనే ఒప్పందానికి చేరుకుంటామని తాము ఆశించలేదన్నారు. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను అంగీకరించడంపైనే చర్చల ఫలితాలుఉంటాయన్నారు. ఇరాన్ ఎదుర్కొన్న భారీ నష్టాలు తమ సంకల్పాన్ని మునుపటికంటే బలోపేతం చేశాయని వివరించారు. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇరాన్ తన వద్ద ఉన్న అన్నిసాధనాలను ఉపయోగిస్తుందని చెప్పారు ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ. ఈ చర్చల వైఫల్యంతో పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది.
శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియాలో ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు వార్తలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్‌పై పరిమిత స్థాయిలో సైనిక దాడులను పునరుద్ధరించేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారులు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే, ఈ దాడులకు ట్రంప్ అంగీకరిస్తారా? లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ఇరాన్ ను నలువైపులా నిర్బంధించి, హర్మూజ్ జలసంధిపై నియంత్రణ తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ఇరాన్‌పై దాడులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇరాన్‌పై దాడులు మళ్లీ మొదలు పెట్టే విషయంలో నిర్ణయం కోసం ఇజ్రాయెల్ ఎదురుచూస్తున్నారు. అయితే, ఈలోగా ఇరాన్ తమపై దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఐడీఎఫ్ హెచ్చరిస్తోంది.
మరోవైపు ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా కీలక చర్యలు తీసుకంటోంది. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించే దిశగా సన్నాహాలు చేస్తోంది. ఈ దిశగా ఆదేశాలు జారీ చేశారారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ మరోసారి చర్చలకు వచ్చినా.. రాకున్నా తనకు సంబంధం లేదని అసలు ఆవిషయం తాను పట్టించుకోనని అన్నారు. ఇరాన్ దేశం దాదాపు నాశనమైంది. ప్రస్తుతం ఆదేశం చాలా దీన పరిస్థితుల్లో ఉందని వ్యాఖ్యానించారు. హర్మూజ్‌లో ఇరాన్ నౌకలను అడ్డుకోవడం కోసం అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే సిద్ధం చేసింది అమెరికా. ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే అన్ని రకాల నౌకలను అడ్డుకుంటామని వెల్లడించింది. ఇరాన్ తీరప్రాంతం వెంబడి ఉన్న అరేబియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లోని అన్ని రేవులకు ఈ ఆంక్షలు వరించనున్నాయి. ఏ దేశం నౌకను అయినా అడ్డుకొని తీరుతామని అమెరికా చెప్పడంతో ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
అమెరికా హెచ్చరికలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా తీవ్రస్థాయిలో స్పందించింది. హర్మూజ్ జలసంధి వైపు వచ్చే యుద్ధ నౌకలపై ధృఢంగా, బలంగా ప్రతిస్పందిస్తామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పౌర నౌకల రాకపోకలకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే సైనిక నౌకలు వస్తే మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు పరిగణిస్తామని స్పష్టంచేసింది. అలాంటి ప్రయత్నాలను అత్యంత కఠినంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పింది. మరోవైపు అమెరికా మీద ఎంతటి పోరాటానికి అయినా తాము సిద్దమని ప్రకటించారు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్‌గాలిబాఫ్. మరోవైపు గత 39 రోజుల యుద్ధంలె ఇప్పటివరకు 3,375 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ఫోరెన్సిక్ విభాగం వెల్లడించింది. మృతుల్లో 2,875 మంది పురుషులు, దాదాపు 500 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దాడుల తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కాగా యుద్ధం మళ్లీ మొదలైతే అంతర్జాతీయంగా తలెత్తే పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ చమురు కేంద్రాలతో పాటు.. పౌర మౌలిక సదుపాయాలపైనా దాడి చేసే అవకాశం ఉంది. అటు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుంటే సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ తదితర దేశాలు తీవ్ర ఇబ్బందులు తప్పవు. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలకూ ముప్పు పొంచి ఉంది. ఇరాన్ మద్దతుతో పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలైన హూతీలు, హిజ్బుల్లాలు తమ కార్యకలాపాలను తీవ్రతరం చేస్తాయి.ఇరాన్ హర్మూజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉంది.పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఎల్ఎన్జీ ధరలు ఊహించని స్థాయికి చేరుకోవచ్చు. ఫలితంగా అనేక దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుంది. అంతే కాదు ఇరాన్ దౌత్య మార్గాలను శాశ్వతంగా మూసివేసే అవకాశాలు ఉన్నాయి
ఒకవేళ ఈ చర్చలు సఫలమై ఉంటే పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి తెరపడేది. ఇరాన్‌పై విధించిన ఆంక్షలను అమెరికా సడలించే అవకాశం ఉండేది. దీంతో దశాబ్దాలుగా కుదేలైన ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతుంది. హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరుచుకొని చమురు,సహజవాయువు రవాణాకు ఆటంకం తొలిగేది. మార్కెట్‌లో చమురు ధరలు యుద్ధానికి ముందు పరిస్థితికి చేరకున్నా గణనీయంగా తగ్గొచ్చు. ఇరాన్ దాడుల కారణంగా ఇబ్బంది పడుతున్న గల్ఫ్ దేశాలకు భారీ ఊరట లభిస్తుంది. హర్మూజ్ జలసంధి గుండా సాగే ఆ దేశాల చమురు, సహజవాయువు ఎగుమతులకు ఇబ్బంది ఉండదుఆంక్షల కారణంగా భారత్ చాలా ఏళ్లుగా ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం లేదు. ఒప్పందం కుదిరితే ఇరాన్ చమురును తక్కువ ధరకు దిగుమతి చేసుకోవచ్చు. ఇరాన్ నుంచి భారత్‌కు పైప్‌లైన్ వేయాలన్న ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇరాన్‌లో చాబహర్ పోర్టు మీద భారత్ భారీ పెట్టుబడులు పెట్టింది. ఒప్పందం కుదిరితే వాటికి భద్రత ఏర్పడుతుంది.
ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా అధ్యక్షుని తలబిరుసు, ఇరాన మొండితనం, పాకిస్తాన్ అవకాశవాదం చర్చనీయాంశంగా మారాయి. దాదాపు 40 రోజుల యుద్ధం తర్వాత తీవ్రంగా నష్టపోయిన ఇరాన్ మరింతగా ప్రతిఘటిస్తూ నిలబడటం డొనాల్డ్ ట్రంప్ అంచనాలకు తెలకిందులు చేసింది. అమెరికా ప్రయోజనాలే ముఖ్యం అంటూ యుద్ధాన్ని ఆరంభించిన ట్రంప్ ఇప్పుడు మధ్యవర్తిత్వం గురించి మాట్లాడుతుండటం అనుమానాలకు తావిస్తోంది. సమస్యకు తెరదించే మార్గాన్ని ఆయనే మూసేశారు. ఇక అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గబోనని తన వైఖరితోనే స్పష్టంగా చెప్పేసింది ఇరాన్. తమ సుప్రీం లీడర్ సహా ఎంతో మంది అగ్ర రాజకీయ, సైనిక నాయకుల హత్యల తరవాత మొండిగా నిలబడింది. పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారింది. శాంతి ప్రక్రియ, చర్చల కోసం ఆ దేశాన్ని అమెరికా పావుగా వాడుకుంటోంది. చర్చలు సఫలమైతే తమ దేశానికి అంతర్జాతీయంగా మైలేజి పెరిగితే అమెరికా దయతో మరిన్ని అప్పుడు పుడతాయని పాక్ పాలకుల ఆశ




