Burning Topic: ట్రంప్ జిన్ పింగ్ కీలక ఒప్పందాలు!

Burning Topic: పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాలు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు, ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ సంచలన ప్రసంగం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Sept 2026 7:56 AM IST
Burning Topic
X

Burning Topic: ట్రంప్ జిన్ పింగ్ కీలక ఒప్పందాలు!

Burning Topic: పశ్చిమాసియాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్‌ తమ మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అమెరికా తమ పోర్టులపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే, ప్రతిఫలంగా హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశాల సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ప్రాథమిక చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

హర్మూజ్‌లో టోల్‌ వసూలు చేయాలన్న అంశంపై ఇరాన్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుండగా, ఆర్థిక ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయాలంటే భవిష్యత్తులో దాడులు చేయబోమని ఇరాన్ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని అమెరికా కోరినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏడు రోజుల ప్రణాళికను ప్రతిపాదించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి తెలిపారు. చర్చల్లో హార్ముజ్ జలసంధిలో అభద్రతకు ఇరానే కారణమని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

మరోవైపు అణ్వాయుధం తయారు చేయాలన్న ఉద్దేశం తమకు లేదని తెలిపారు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్. తమ దేశంలోని అణుకేంద్రాలను తనిఖీ చేసేందుకు అంతర్జాతీయ సంస్థలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి కారణం లేకుండా అమెరికా తమపై దాడులకు దిగిందని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నిరంతరం దాడులు చేస్తూ చర్చలు జరగకుండా అగ్రరాజ్యం ప్రయత్నిస్తోందని. అమెరికా దాడులు, ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటూనే ముందుకు సాగుతామని వెల్లడించారు. తమ దేశ మనుగడ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా భరిస్తామన్నారు. యుద్ధాన్ని ముగించాలా వద్దా అనేది అమెరికా చేతుల్లోనే ఉందన్నారు. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై దాడికి చైనా ఉపగ్రహ చిత్రాలను ఇరాన్ బలగాలు వినియోగించినట్లు వస్తున్న ఆరోపణలను పెజెష్కియాన్ కొట్టిపారేశారు. యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు చేసే పనులకు వారే బాధ్యులని స్పష్టంచేశారు.

ఇక ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రసంగం సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నెతన్యాహు సభలోకి రాగానే పలు దేశాల ప్రతినిధులు నిరసనగా తమ సీట్ల నుంచి లేచి బయటకు వెళ్లిపోయారు. ఇది గమనించిన నెతన్యాహు సభలో ఉన్నవారిని ప్రతినిధులను ఉద్దేశించి తీవ్రస్థాయిలో స్పందించారు. బయటకు వెళ్లిన వారిని నైతికత లేనివారుగా, వారు పిరికిపందలుగా అభివర్ణించారు. హాల్లో ఇంకా నైతికత లేని పిరికివాళ్లు ఉంటే, దయచేసి ఇప్పుడే బయటకు వెళ్లండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించడంతో తీవ్ర కలకలం రేపాయి. ప్రపంచంలోని యూదు వ్యతిరేకులు మా ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు. తాము ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదని, ఆత్మగౌరవంతో తల ఎత్తుకుని జీవిస్తున్నామని తెలిపారు. గత మూడేళ్లుగా హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, ఇరాన్ మద్దతు గల మిలీషియాలతో సహా ఏడు వేర్వేరు యుద్ధాల్లో ఇజ్రాయెల్ ఒంటరి పోరాటం చేసిందని గుర్తుచేశారు.

ఇరాన్‌లో ముప్పుపై తీవ్రస్థాయిలో స్పందించారు నెతన్యాహు. తమ దేశ మనుగడ కోసం ఇరాన్ అణుకేంద్రాలను ధ్వంసం చేయడం అనివార్యమని తెలిపారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నెతన్యాహు ప్రశంసల వర్షం కురిపించారు. అరాచక శక్తులతో పోరులో ప్రెసిడెంట్ ట్రంప్ కంటే గొప్ప భాగస్వామి మరొకరు లేరు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. మరోవైపు న్యూయార్క్‌లో జోహ్రాన్ మమ్దాని మేయర్‌గా ఎన్నికైన తర్వాత. యూదు పౌరులు భద్రత కోల్పోయారని, హమాస్‌కు మద్దతు ఇస్తున్న నేరస్థులను మేయర్ ప్రశంసిస్తున్నారని, అమెరికాపై ఉగ్రదాడిని సమర్థించిన వ్యక్తులతో ఆయనకు సంబంధాలున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాగా నెతన్యాహూ గతంలో లెబనాన్‌లో హెజ్‌బొల్లా దళాలపై దాడుల కోసం తాము ఉపయోగించిన పేజర్లను ప్రదర్శించడం కూడా కలకలం రేపింది. ఆయన హెచ్చరికలు ప్రపంచ దేశాలను నివ్వెరపరిచాయి.

ఇదిలా ఉంటే యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను ఉద్ధృతం చేస్తున్నారు. తాజాగా హూతీలు రియాద్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు. ఈ క్రమంలో సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్‌కో రిఫైనరీపై డ్రోన్‌, క్షిపణి దాడులు జరిపినట్లు సమాచారం. రాస్‌ తనురాలోని ఈ రిఫైనరీ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు హూతీ సైనిక ప్రతినిధి పేర్కొన్నారు. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన తెలిపారు. మరోవైపు, హూతీ దాడులకు గట్టి బదులిచ్చామని సౌదీ అరేబియా పేర్కొంది. దక్షిణ తైఫ్ ప్రావిన్స్, ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు ప్రాంతాల్లో హూతీలు ప్రయోగించిన ఆరు బాలిస్టిక్ క్షిపణులను తమ బలగాలు అడ్డుకున్నట్లు పేర్కొంది. అలాగే, హూతీ దాడుల నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంతో సహా పలు ప్రాంతాలకు సౌదీ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్