Burning Topic: హర్ముజ్‌పై మరోసారి భగ్గుమన్న ఇరాన్, అమెరికా!

Burning Topic: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు; హర్మూజ్ జలసంధిపై ట్రంప్ వివాదాస్పద పోస్ట్, యుద్ధానికి సిద్ధమన్న ఇరాన్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 Aug 2026 11:01 AM IST
Burning Topic
X

Burning Topic: హర్ముజ్‌పై మరోసారి భగ్గుమన్న ఇరాన్, అమెరికా!

Burning Topic: పశ్చిమాసియాలో ఉద్రిక్తతతలు నెలల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా, ఇరాన్‌లో పరస్పర దాడులు, బెదిరింపులు సమస్యను మరింత తీవ్రంగా మారుస్తున్నాయి. ఓ వైపు తెర వెనుక చర్చలు కొనసాగుతున్నా కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో ఇరు దేశాలు ఏమాత్రం పట్టువిడుపులు లేకుండా ప్రకటనలు చేస్తూ పరిస్థితిని దిగజారుస్తున్నాయి.

ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో మాట, పూటకో ప్రకటనతో ఇరాన్‌ను మరింత రెచ్చగొడుతున్నారు. ఇరాన్‌తో అవగాహన ఒప్పందం గడువు ముగిసిన నేపథ్యంలో తన ట్రూత్ సోషల్‌లో వివాదాస్పద ఓ పోస్టు పెట్టారు.

హర్మూజ్‌ జలసంధిపై పూర్తిగా నియంత్రణ తమకే ఉందని ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు దాన్ని తమ దేశంలో భాగంగా చూపారు. 'అమెరికా కొత్త భూభాగం హర్మూజ్' అంటూ పోస్టు చేశారు. ఆ మ్యాప్‌లో హర్మూజ్‌ జలసంధిని ఓ రౌండ్‌తో మార్క్ చేసినట్టు ఉంది.

పశ్చిమాసియాలో యుద్ధాన్ని నివారించాలంటే ఇరాన్ వెంటనే తెల్ల జెండా ఎగరేసి లొంగిపోవాలని సూచించారు డొనాల్డ్ ట్రంప్.. దీనికి ఎలాంటి నిర్దిష్ట గడువు లేదని, ఈ విషయంపై తానేమీ తొందర పడటం లేదని వ్యాఖ్యానించారు.

ఇరాన్ ప్రభుత్వంపై ఆర్థికంగా తీవ్ర ఒత్తిడి పెంచేందుకు అమెరికా నౌకాదళం జల దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ నాయకులు 'మంచి పోకర్ ఆటగాళ్లు' అయినప్పటికీ, అమెరికా నావల్ బ్లాకేడ్ కారణంగా ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

మరోవైపు హర్మూజ్‌ జలసంధిలో నౌకలపై సంయుక్త నియంత్రణకు ఇరాన్‌తో ఒప్పందానికి సిద్ధమైన ఒమన్‌ను తప్పుపట్టారు ట్రంప్‌. ఇరాన్‌తో కలిసి అడుగులు వేయవద్దని​తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అమెరికా వైఖరికి విరుద్ధంగా ఒమన్ మధ్యలో జోక్యం చేసుకుంటే 'వారిపై బాంబుల వర్షం కురిపించి నాశనం చేస్తాం' అని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌తో అవగాహన ఒప్పందాన్ని మళ్లీ పొడిగించే అవకాశాలు లేవని సంకేతాలు ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం ఇరాన్​తో ఎలాంటి చర్చలు జరగడం లేదని మీడియాతో స్పష్టం చేశారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరిచే ఉందని తెలిపారు.

ఆ జలమార్గంలోని వాటర్ మైన్స్​ను తొలగించడం లేదా పేల్చివేయడం కొనసాగుతోందని వెల్లడించారు. తాము చేపట్టిన ఈ చర్యల వల్ల చమురు ధరలు తగ్గుతున్నాయని, ఇక ముందు కూడా తగ్గుతూనే ఉంటాయని వెల్లడించారు.

ఇరాన్​ అణుకార్యక్రమాన్ని సాగనీయమని మరోసారి స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు. వారిని అణ్వాయుధాలు తయారు చేయనివ్వం. గతంలో మేము బి-2 బాంబర్లతో ఇరాన్ మీద తీవ్ర దాడి చేశాం. ఈ దెబ్బతో ఒక వేళ వారు అణ్వాయుధాలు తయారు చేయాలనుకున్నా దానికి చాలా సమయం పడుతుందని ట్రంప్ తెలిపారు. అయితే అమెరికా అధ్యక్షుని మాటలను ఇరాన్ తీవ్రంగా తీసుకుంది.

హర్మూజ్‌ను అమెరికాలో భాగంగా చూపిస్తూ డొనాల్డ్ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలను పిచ్చి ప్రేలాపనలుగా అభివర్ణించారు ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాది. ట్రంప్ తీరు తమ సార్వభౌమత్వాన్ని సవాలు చేసే విధంగా ఉందన్నారు ఒకవేళ ఈ పగటి కలల నుంచి బయటకు రాకపోతే తాయే పరిస్థితిని చక్కదిద్దుతామని హెచ్చరించారు.

అమెరికా తన సామర్థ్యానికి మించి ఊహించుకుంటోందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నూతన అధిపతి మొహ్సెన్ రెజాయ్ విమర్శించారు. ఆ దేశానికి హార్ముజ్ 7 వేల మైళ్ల దూరం ఉంది. తమ ఆధీనంలో లేని ప్రాంతాన్ని సొంతం అని చెప్పుకోవడం పగటి కలలకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు.

పర్షియన్ గల్ఫ్‌లో ఇప్పుడు 'పోస్ట్-అమెరికన్' శకం మొదలైంది' అని ఆయన ఎద్దేవా చేశారు. హర్మూజ్ జలసంధిలో అశాంతికి అలాగే అమెరికా చేపట్టిన సైనిక చర్యలే ప్రధాన కారణమని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్​బాఘేర్‌ గాలిబాఫ్‌ ఆరోపించారు.

ఇదిలా ఉంటే అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందం తర్వాత లభించిన విరామాన్ని భారీ యుద్ధానికి సిద్దమయ్యేందుకు ఇరాన్ ఉపయోగించుకుందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. భారీ సైనిక ఘర్షణను ఎదుర్కొనేందుకు వీలుగా ఇరాన్ ఈ కాలాన్ని వాడుకుంది.

శత్రు భూభాగాలపై ముందస్తు దాడులు, ఇతర సైనిక చర్యల కోసం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రణాళికలను రూపొందించిందని తెలుస్తోంది. సాధారణ సైన్యంపై IRGCకి పర్యవేక్షణ పెంచడం, యుద్ధ అనుభవజ్ఞులు, అంతర్గత అణచివేతల్లో పాల్గొన్న సీనియర్ అధికారులను కీలక పదవుల్లో నియమించడం, డ్రోన్ల తయారీని వేగవంతం చేయడం వంటి చర్యలు చేపట్టింది.

క్షిపణుల ఉత్పత్తిని వేగవంతం చేయడం, వాటి కచ్చితత్వాన్ని పెంచడం, కౌంటర్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలను విస్తరించడం, ఇరాన్ సైన్యంలో రివల్యూషనరీ గార్డ్ పాత్రను మరింత పెంచడం వంటి చర్యలు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ ఏడాది జూన్‌లో అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం వల్ల హర్మూజ్ జలసంధి పునఃప్రారంభం అవుతుందని భావించారు. అయితే ఇరాన్ నాయకత్వం దీనిని భిన్నంగా వ్యవహరించిందని చెబుతున్నారు.

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక పెద్ద యుద్ధానికి సిద్ధమయ్యేందుకు ఉపయోగించుకుందని చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ ఇరాన్ భద్రతా వ్యవస్థలో వచ్చిన పెద్ద మార్పులతో సమాంతరంగా జరిగాయి. ఇరాక్, యెమెన్, లెబనాన్‌లకు వెళ్లి దాడులను తీవ్రతరం చేసే ప్రణాళికలపై ఇరాన్ కమాండర్లు చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ కాల్పుల విరమణ కాలాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నామని IRGC ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ హొస్సేన్ మొహెబ్బి చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. ఖర్గ్ ద్వీపం మీద అమెరికా దాడి చేస్తే, దక్షిణ ఇరాక్ ద్వారా భూతల దాడులు ప్రారంభించవచ్చని ఇరాన్ రాజకీయ నాయకులు భావించినట్లు చెబుతున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story