Burning Topic: ఓ వైపు శాంతి మరోవైపు భీకర దాడులు! ఇరాన్‌పై ట్రంప్ డబుల్ గేమ్!

Burning Topic: హార్ముజ్ జలసంధిలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా క్షిపణి దాడులు. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు, దౌత్య చర్చల్లో పురోగతి లేకపోవడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉత్కంఠ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Nov 2026 7:37 AM IST
Burning Topic
X

Burning Topic: ఓ వైపు శాంతి మరోవైపు భీకర దాడులు! ఇరాన్‌పై ట్రంప్ డబుల్ గేమ్!

Burning Topic: అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిపోవడంతో పశ్చిమాసియా మళ్లీ ఉగ్రంగా మారుతోందా? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి.. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. ఒకపక్క శాంతి చర్చలకు రంగం సిద్ధం చేస్తూనే మరోపక్క ఇరాన్ మీద పరిమిత దాడులకు దిగింది అమెరికా. అమావాస్య రాత్రి చమురు రవాణాకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ జలమార్గమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. ఖేష్మ్ ద్వీపం సమీపంలోని సుజాలో ఇరాన్ ఏర్పాటు చేసిన యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ క్షిపణి దాడులు నిర్వహించింది. రెండు శక్తిమంతమైన పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్‌ వెల్లడించింది. ఇది చిన్నపాటి సైనిక చర్య అని, ఐదు నిమిషాల్లోనే ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫ్లోరిడాలో విలేకరులతో అన్నారు. అంతకుమించిన వివరాలు వెల్లడించలేదు.

ఇప్పటికే ఇరాన్‌పై నావికా దిగ్బంధనం కొనసాగిస్తున్న అమెరికా, తాజాగా ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన వాణిజ్య వాణిజ్య నౌకను అమెరికా బలగాలు గుర్తించాయి. ఆ ప్రాంతం నుంచి వెళ్లేందుకు ప్రయత్నించవద్దని పలుమార్లు హెచ్చరించాయి. అయినప్పటికీ నౌక సిబ్బంది ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కాల్పులు జరిపి నౌకను నిర్వీర్యం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే ఘటనలో నౌకలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎవరైనా గాయపడ్డారా, నౌకకు ఎంత మేర నష్టం జరిగిందనే వివరాలను అమెరికా వెల్లడించలేదు. కాగా ఇరాన్‌పై దాడులు పునరుద్ధరించేందుకు సెంట్రల్‌ కమాండ్‌ పూర్తిస్థాయి ప్రణాళికలతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. వైట్‌హౌస్‌ నుంచి తుది ఆదేశాలు జారీచేసిన మరుక్షణం రంగంలోకి దిగేందుకు సైన్యం పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్లు చెబుతున్నారు

మరోవైపు ఇరాన్ ఉత్తర నౌకాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ మొహ్సెన్ రజాఖీ అమెరికా బలగాలకు హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ సాయుధ దళాల మధ్య సమన్వయం అత్యున్నత స్థాయిలో ఉందని, సముద్ర సరిహద్దులను ఇరవై నాలుగు గంటలూ కాపాడటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ మానవ వనరులే సైనిక నౌకాదళానికి అత్యంత ముఖ్యమైన ఆస్తి అని అభివర్ణించారు రజాఖీ . క్షిపణి, డ్రోన్ యూనిట్లతో పాటు కమాండోలతో కూడిన నౌకాదళ బలగాలు దేశ జలాలను కాపాడటానికి నిరంతరం పహారా కాస్తున్నాయని ఆయన అన్నారు. మరోవైపు బాలిస్టిక్‌ క్షిపణుల పరిధిపై ఇప్పటివరకు పాటిస్తున్న 2,000 కిలోమీటర్ల స్వీయ పరిమితిని ఎత్తివేసినట్లు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. దీంతో మరింత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణుల అభివృద్ధికి ఇరాన్‌ ప్రయత్నించే అవకాశం ఉంది. టెహ్రాన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి జనరల్‌ హొస్సేన్‌ మొహెబ్బి ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఇరాన్‌తో చర్చలు విఫలమైతే మరోసారి సైనిక దాడులకు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. అవసరమైతే కేవలం గంటలో 38 వంతెనలను ధ్వంసం చేయగలమంటూ హెచ్చరించడం సంచలనంగా మారింది. ఇప్పటికే మూడు విమాన వాహక యుద్ధనౌకలను రంగంలోకి దించినట్లు ప్రకటించారు. ఒకవైపు అణు ఒప్పందం కోసం చర్చలు జరుపుతూనే.. మరోవైపు యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్న అమెరికా వైఖరితో మధ్యప్రాచ్యంలో మరోసారి ఆందోళన మొదలైంది. ఇరాన్‌ అమెరికా షరతులకు అంగీకరిస్తుందా? లేక మరోసారి యుద్ధం తప్పదా? అన్న ఉత్కంఠ నెలకొంది. చేశారు. ఇరాన్‌తో కుదిరే ఒప్పందం చాలా బలంగా ఉండాలని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా దాడుల వల్ల ఇరాన్‌ సైనిక, ఆర్థిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అమెరికా ఇప్పటికే ఇరాన్‌పై తీవ్రంగా దాడులు చేసిందని, అవసరమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.

మరోవైపు అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు పలు దేశాలు దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఖతార్‌ రాజు షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానీతో ట్రంప్‌ చర్చలు జరిపినట్లు ఖతార్‌ వెల్లడించింది. ఇక ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్‌, పాకిస్థాన్‌, కువైట్‌, జోర్డాన్‌, టర్కీ, సైప్రస్‌, ఖతార్‌ దేశాల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో శాంతి ప్రయత్నాలకు ప్రాధాన్యత పెరిగినట్లు సూచిస్తున్నాయి. అయితే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం త్వరలోనే ఒప్పందం కుదురుతుందని ఆశించలేమని స్పష్టం చేశారు. ఇరాన్‌ ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కానివిగా ఉన్నాయని, చర్చల్లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ పురోగతి లేదని వ్యాఖ్యానించారు. ఇరాన్ పెడుతున్న డిమాండ్లు కేవలం అంగీకరించలేనివి మాత్రమే కాదని, కొన్ని విషయాల్లో అవి "హాస్యాస్పదంగా, అత్యంత దారుణంగా, అవాస్తవికంగా" ఉన్నాయని రుబియో కొట్టిపారేశారు.

తాజా సమాచారం ప్రకారం అమెరికా ఇరాన్ మీద మళ్లీ దాడులు చేపట్టక పోవచ్చని భావిస్తున్నారు. ఇటీవల మధ్యంతర ఎన్నికల్లో యూఎస్ కాంగ్రెస్‌లో డెమోక్రాట్లకే ఆధిపత్యం లభించింది. వారు ఉభయసభల్లో పట్టు సాధించడంతో ఈ యుద్ధాన్ని త్వరగా ముగించాలని రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ భారీ పరాజయం మూటగట్టుకోవడంతో ట్రంప్‌నిర్ణయాలను అడుగడుగునా ప్రశ్నించే అధికారం కాంగ్రెస్‌లోని డెమోక్రాట్లకు లభించినట్లైంది. దీంతో రానున్న రెండేళ్లలో ట్రంప్‌ కార్యవర్గం కఠిన సవాళ్లను ఎదుర్కోనుంది. తాజాగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేయడానికి రెండు నెలలు పడుతుంది. అప్పటి వరకూ కాంగ్రెస్‌లో రిపబ్లికన్ల మెజార్టీ కొనసాగుతుంది.ఈ రెండు నెలల కాలంలో ట్రంప్‌ తన పేరు ప్రఖ్యాతులను కాపాడుకోవడం కోసం తీవ్రంగా యత్నించే అవకాశం ఉంది. ప్రస్తుతం యుద్ధాన్ని ముగించేలా ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్