Burning Topic: యుద్ధానికి సై అంటున్న అమెరికా–ఇరాన్! పశ్చిమాసియాలో హైటెన్షన్..!
Burning Topic: హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ పెట్టిన షరతులను తిరస్కరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 'డూమ్స్‌డే వార్' తప్పదంటూ ఇరాన్ తీవ్ర హెచ్చరికలు.
Burning Topic: యుద్ధానికి సై అంటున్న అమెరికా–ఇరాన్! పశ్చిమాసియాలో హైటెన్షన్..!
Burning Topic: పశ్చిమాసియాలో ఇరాన్–అమెరికా యుద్ధానికి తెరపడుతుందన్న ఆశలు క్రమంగా ఆవిరవుతున్నాయి. ఉద్రిక్తతల ముగింపు కోసం దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. పరిస్థితులు మాత్రం మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ దిగి వస్తున్నా అమెరికా తన మొండి పట్టుదలను వీడక పోవడంతో సమస్య మరింత సంక్షిష్టంగా మారుతోంది.
అగ్రరాజ్యం తమ షరతులకుఒప్పుకుంటే హార్మూజ్ జలసంధిని తెరవడానికి అభ్యంతరం లేదని ఇటీవల ఇరాన్ స్పష్టంచేసింది. జలసంధిలో అమెరికా నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, తమ చమురు అమ్మకాలపై ఆంక్షలను రద్దు చేయాలని తేల్చిచెప్పింది. అలా చేస్తే ఏడు రోజుల్లో హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తామని వెల్లడించింది.
అలాగే తమ అణు కార్యక్రమంపై చర్చలను పునఃప్రారంభించడానికి ముందుకొచ్చింది. అణు కార్యక్రమంతో పాటు అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ చెప్పారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ప్రతిపాదన తెచ్చారు.
అయితే ఇరాన్ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ తీవ్ర ఒత్తిడిలో ఉండటం వల్లే వెంటనే హార్ముజ్‌ను తెరవడానికి ఒప్పందం కోరుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో తాము త్వరలోనే విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
మనం కచ్చితంగా భారీ విజయాన్ని సాధిస్తున్నాం. వారి ఆర్థిక వ్యవస్థను చూస్తే, అది కనుమరుగైపోయింది. వారికి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అంటూ ఏమీ లేదు, సైనిక వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది. వారు కష్టాల్లో ఉన్నారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందే తాము సైనిక దాడులు చేసే అవకాశం కూడా ఉందని ఆయన అన్నారు.
అమెరికాలో రానున్న మధ్యంతర ఎన్నికలకు ముందే సైనిక దాడులు మళ్లీ జరిగే అవకాశం ఉందా? మీడియా ప్రతినిధులు అడాగగా, ఆ అవకాశాన్ని తోసిపుచ్చడానికి ట్రంప్ నిరాకరించారు. అమెరికా ప్రధాన లక్ష్యం ఒక్కటే- ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు అని తేల్చిచెప్పారు.
హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల రోడ్‌మ్యాప్‌ను అమెరికా తిరస్కరించడంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అవసరమైతే భయానక యుద్ధాన్ని సైతం ఎదుర్కొనేందుకు తమ దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపింది. ఈసారి యుద్ధం మొదలైతే అదీ ఎవరూ ఊహించని స్థాయిలో భీకరంగా మారొచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. అది ‘డూమ్స్‌డే వార్’ స్థాయికి చేరినా ఎదుర్కొనేందుకు సిద్ధం అని అమెరికాను హెచ్చరించారాయన.
అదే సమయంలో చర్చలకూ మేం సిద్ధమే. ఏది జరగాలన్నది ట్రంప్ చేతిలోనే ఉంది’’ అని అరాగ్చీ అన్నారు. ఈ అంశంపై దౌత్యమార్గాల ద్వారా తమకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదని చెప్పారు. అక్రమంగా ఫ్రీజ్ చేసిన మా డబ్బులు, ఆస్తులు మాకు కావాలి. మా చమురును మేం అమ్ముకోగలిగే పరిస్థితి ఉండాలి. ఘర్షణలు తగ్గించేలా చర్చలతో పరిష్కారాలు ఉండాలి. అలాంటప్పుడు మేం హర్మూజ్‌ను తెరిచేందుకు సుముఖంగానే ఉంటామఅని అరాగ్చీ తెలిపారు.
మరోవైపు.. ఆరాఘ్ఛి వార్నింగ్ వెలువడ్డ కాసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ వారంలో ఇరాన్‌తో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ తమను ఫ్రీజ్ చేసిన బిలియన్ల డాలర్ల నిధులను విడుదల చేయాలని, ఆంక్షలను ఎత్తివేయాలని కోరిందని.. అందుకు తాము సిద్ధంగా లేమని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ తెలిపారు.
ఇవి కేవలం అమెరికా విధించిన ఆంక్షలు కాదని, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆంక్షలని ఆయన పేర్కొన్నారు. కాగా న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఇరాన్ ప్రతినిధులతో దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. మధ్యవర్తుల ద్వారా అమెరికా అధికారిక స్పందన కోసం ఇరాన్ ఎదురుచూస్తోందని తెలుస్తోంది.
హర్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అధునాతన అండర్‌వాటర్ డ్రోన్‌ను ఇరాన్ సైన్యం స్వాధీనం చేసుకుందన్న వార్తలు కూడా ఉద్రిక్తతను పెంచాయి. ఇరాన్ చేసిన ఈ ప్రకటనను అమెరికా సైన్యం ఖండించింది. డ్రోన్ తమ ఆధీనంలోకి వెళ్లిందన్న వాదనలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.హార్ముజ్ జలసంధిపై నెలకొన్న ప్రతిష్టంభన ప్రపంచ ఇంధన సరఫరాలపై ఆందోళనలను పెంచుతోంది.
ప్రపంచంలోని కీలక సముద్ర మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి ద్వారా చమురు రవాణా గణనీయంగా తగ్గినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ఇప్పటికే హార్ముజ్ అంశంపై సౌదీ అరేబియాతోనూ చర్చలు జరిపింది. మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్, దాని మిత్ర బలగాలు ప్రతిదాడులతో సమాధానం ఇస్తున్నాయి. హార్ముజ్ అంశం కేవలం ఇరాన్-అమెరికా మధ్య వివాదంగా కాకుండా.. మొత్తం పశ్చిమాసియా ప్రాంతంపై ప్రభావం చూపుతోంది.
కాగా ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై కొత్త కొత్త కథనాలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందగా, మోజ్తబా తృటిలో తప్పించుకోవడం తెలిసిందే. అయితే నాటి దాడుల నుంచి తృటిలో తప్పించుకున్న తర్వాత జరిగిన మరో దాడి నుంచి కూడా బయటపడినట్లు ఇరాన్ మతపెద్ద ఒకరు వెల్లడించారు.
ఆసుపత్రి శిథిలాల కింద చిక్కుకున్న ఆయనను అతికష్టం మీద బయటకు తీసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఆయన భద్రతా కారణాలతోనే బయటికి రావటం చెప్పారు. 'మోజ్తబా ఖమేనీ గాయపడిన తర్వాత టెహ్రాన్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నగరంలోని మూడు ఆస్పత్రులు బాంబు దాడులకు గురైంది. మూడో ఆస్పత్రిలో మోజ్తబా ఖమేనీ ఉన్నారు. అక్కడ దాడి జరిగిన అనంతరం శిథిలాల నుంచి ఆయనను బయటకు తీశారు. తర్వాత ఖమేనీని గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లిపోయారు.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో రహస్యంగా పర్యటించారనే వార్తలు కలకలం రేపాయి. యూఏఈ రాజధాని అబుధాబిలో అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాలు సున్నితమైన ప్రాంతీయ భద్రతా సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇద్దరు అగ్రనేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే నెతన్యాహు యూఏఈ రహస్య పర్యటనపై, అల్ నహ్యాన్‌తో సమావేశం గురించి గానీ రెండు దేశాల ప్రభుత్వాలు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మారణహోమం సృష్టించి మూడేళ్లు పూర్తికావొస్తున్న తరుణంలో ఈ అత్యున్నతస్థాయి సమావేశం జరిగిందని చెబుతున్నారు. కాగా 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు సంబంధించిన సమాచారంపై 10 రోజుల ముందే యూఏఈ హెచ్చరించిందని ఓ పత్రికలో వచ్చిన వార్తలు కలకలం రేపాయి. ఈ భద్రతా వైఫ్యలానికి నెతన్యాహునే బాధ్యత వహించాలని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.




