BurningTopic: యుద్ధం ముగిసింది.. భారీగా తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు?

BurningTopic: అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసింది! శాంతి ఒప్పందం కుదుర్చుకున్న ఇరు దేశాలు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Jun 2026 6:51 AM IST
BurningTopic
X

BurningTopic: యుద్ధం ముగిసింది.. భారీగా తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు?

BurningTopic: పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం ఇది. ఇరుదేశాల మధ్య కుదిరిన శాంతికి సంబంధించి తాత్కాలిక ఒప్పంద అవగాహనా పత్రాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ లాంఛనంగా వర్చువల్‌ రూపంలో సంతకాలు చేశారు. యుద్ధానికి ముగింపు పలుకుతూ 14-అంశాల ఆధారంగా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందానికి ‘ఇస్లామాబాద్‌ మెమోరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ బిట్వీన్‌ ద యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా అండ్‌ ద ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌’ అని పేరు పెట్టారు. జీ7 సమ్మిట్ కోసం పారిస్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అక్కడి నుంచే ఈ చారిత్రాత్మక పత్రంపై స్వయంగా సంతకం ఇటు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా టెహ్రాన్ నుంచి దీనికి ఆమోదం తెలపడంతో ఈ ఒప్పందం తక్షణమే అమలులోకి వచ్చేసింది. దీంతో అమెరికా అధికారికంగా పశ్చిమాసియాలో సైనిక చర్యకు ముగింపు పలికింది.

అంతర్జాతీయ శాంతిని దృష్టిలో పెట్టుకొని అమెరికా -ఇరాన్ ఈ ఒప్పందానికి అంగీకరించాయి. ఈ తాత్కాలిక అవగాహన ఒప్పందాన్ని పూర్తి స్థాయి శాశ్వత ఒప్పందంగా మార్చడానికి ఇరు దేశాలకు 60 రోజుల గడువును విధించారు. అవసరమైతే ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో ఈ గడువును మరింత పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలను గమనించినట్లేతే..

లెబనాన్ సరిహద్దులతో సహా పశ్చిమాసియాలోని అన్ని ప్రాంతాలలో ఇరు దేశాలకు సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష సైనిక చర్యలు, దాడులను తక్షణమే నిలిపివేయాలి. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కూడా ఒక ఒప్పందం జరగనుంది. ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించాలి. ప్రారంభంలో 60 రోజుల పాటు ఎలాంటి అదనపు రుసుము లేకుండా అంతర్జాతీయ నౌకల సురక్షిత ప్రయాణాన్ని ఇరాన్ కల్పించనుంది. ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని అమెరికా తక్షణమే ఉపసంహరించకోనుంది.

యుద్ధాలు, ఆంక్షల కారణంగా నష్టపోయిన ఇరాన్‌లో పునర్నిర్మాణ పనులు, ఆర్థిక అభివృద్ధి కోసం అమెరికా మద్దతుతో దాదాపు 300 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీనితో పాటు వివిధ దేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల, ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా ట్రెజరీ మినహాయింపులు ఇవ్వనుంది.తాము ఎప్పటికీ అణు ఆయుధాలను తయారు చేయబోమని ఇరాన్ ఈ ఒప్పందంలో ప్రపంచ దేశాలకు స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే, ఇరాన్ వద్ద ఇప్పటికే ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వల భవిష్యత్తును ఎలా నిర్ణయించాలనే దానిపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలో రాబోయే చర్చల్లో ఒక నిర్ణయానికి రానున్నారు. అమెరికా- ఇరాన్ మధ్య ఒప్పందం అమల్లోకి రాగానే ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు స్థిరపడటం ప్రారంభమైంది. కాగా అయితే ఒప్పందం కుదరడం కంటే.. దాన్ని అమలు చేయడమే ఇప్పుడు అసలు పరీక్ష అని ఇరాన్ అంటోంది.

అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆయనకే తెలియదంటే అతిషయోక్తి కాదు. ఇరాన్‌తో డీల్ తనకు నచ్చకపోయినా ఆ దేశం పద్ధతిగా ప్రవర్తించకపోయినా మళ్లీ బాంబులు వేస్తామని కూడా హెచ్చరించారు. ఇదే క్రమంలో ఇరాన్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం చాలా శక్తిమంతమైందని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాత్కాలిక ఒప్పందంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు ఊహించని భారీ రాయితీలు ఇచ్చారు. ఇరాన్ అణు కార్యక్రమంపై రాబోయే 60 రోజులు చర్చలు జరగాల్సి ఉంది. అయితే ఆ గడువు ముగియక ముందే, ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా తక్షణమే మినహాయింపులు ఇవ్వనుంది. 2015లో జరిగిన అణు ఒప్పందాన్ని చెత్త డీల్‌గా అభివర్ణిస్తూ ట్రంప్ దాని నుంచి తప్పుకున్నారు. కానీ, తాజా ఒప్పందం 2015 డీల్ కంటే ఇరాన్‌కు ఎన్నో రెట్లు లాభదాయకంగా ఉంది. బదులుగా, ఇరాన్ తాను ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయమని మాత్రమే ఇందులో పునరుద్ఘాటించింది.

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన తర్వాత సుమారు 110 రోజుల పాటు కొనసాగిన ఘర్షణలకు ఈ ఒప్పందంతో ముగింపు పలికినట్లయింది. రెండు దేశాల మధ్య అధికారిక సంతకాల కార్యక్రమం స్విట్జర్లాండ్‌లో జరగాల్సి ఉన్నప్పటికీ, ఒప్పందంపై ఇప్పటికే డిజిటల్‌ సంతకాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ.. ఫిజికల్‌ సంతకాల కోసం జెనీవా సమావేశం యథావిధిగా కొనసాగవచ్చని ఇరాన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీలో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పాల్గొంటుండగా.. ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహ్మద్ బఘర్ గాలిబాఫ్ హాజరు కావొచ్చని తెలుస్తోంది. ఈ చారిత్రాత్మక ఒప్పందం అంత సులభంగా సాధ్యపడలేదు. కొన్ని నెలలుగా ఒమన్ తో ఇతర దేశాలు నేతృత్వంలో తెరవెనుక తీవ్రమైన దౌత్య సంప్రదింపులు జరిగాయి. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.

మూడు నెలలకు పైగా సాగిన యుద్ధంలో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 3,300 మందికి పైగా ఇరానియన్లు మరణించారు. లెబనాన్‌లో 3,826 మంది, ఇజ్రాయెల్‌లో దాదాపు 60 మంది ఈ హింసకు బలయ్యారు. ఈ యుద్ధం కారణంగా అమెరికా 132 బిలియన్ డాలర్ల మేరకు నష్టపోయింది. కేవలం సైనిక చర్యలకే 29 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. యుద్ధం ప్రారంభంలో గ్యాలన్ గ్యాస్ ధర 3 డాలర్ల లోపు ఉండగా, హర్ముజ్ జలసంధి దిగ్బంధనంతో అది ఏకంగా 4.56 డాలర్లకు చేరింది. దీనివల్ల అమెరికన్లు ప్రతిరోజూ చమురు కోసం వందల మిలియన్ల డాలర్లు అదనంగా వెచ్చించాల్సి వచ్చింది. డీజిల్ ధరలు కూడా గ్యాలన్‌కు 5.69 డాలర్ల రికార్డు స్థాయికి చేరడంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. యుద్ధ ప్రభావం కేవలం అమెరికా, ఇరాన్‌లకే పరిమితం కాలేదు. భారత్‌‌లో ఎల్‌పీజీ ధరలు పెరగడంతో పాటు వంటగ్యాస్ కొరత ఏర్పడి సామాన్యులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story