Burning Topic: ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో శాంతి దిశగా అమెరికా!

Burning Topic: యూఏఈ రాజధాని అబుదాబిలో అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ మధ్యవర్తిత్వంలో నవంబర్ 10, 11న రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు జరగనున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Nov 2026 6:56 AM IST
Burning Topic
X

Burning Topic: ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో శాంతి దిశగా అమెరికా!

Burning Topic: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండం చూడని అతిపెద్ద సైనిక దాడి ఇది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య రేగిన ఈ పోరు కేవలం రెండు దేశాల సరిహద్దు వివాదం కాదు, ఇది ప్రపంచ దేశాల మధ్య అధికార సమతుల్యతను మార్చేసిన అంతర్జాతీయ సంక్షోభం.

సోవియట్ యూనియన్ పతనం తర్వాత నివురు గప్పిన నిప్పులా ఉన్న శత్రుత్వం, 21వ శతాబ్దంలో ఒక మహా యుద్ధంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. లక్షలాది మంది మరణాలు, కోట్లాది మంది శరణార్థులు, వందల బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి మిగిల్చిన చేదైన నిజాలు ఇవి. సంవత్సరాలు గడుస్తున్నా, వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా.. రష్యా తుపాకులు శాంతించలేదు, ఉక్రెయిన్ ప్రతిఘటన తగ్గలేదు.

ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా మరో కీలక దౌత్య ప్రయత్నానికి సిద్ధమైంది. ఇరు దేశాల మధ్య శాంతి దిశగా చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు మధ్యవర్తిత్వం వహించనున్నట్లు ప్రకటించింది.

రష్యా, అమెరికాల మధ్య ఉద్రిక్తలను తగ్గించి, శాంతిని నెలకొల్పే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంత కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఉపందుకున్నాయి. ఉక్రెయిన్‌, రష్యా ప్రతినిధుల మధ్య కార్యాచరణ స్థాయి చర్చలు ఈ నెల 10, 11 తేదీల్లో యూఏఈ రాజధాని అబుదాబిలో జరగనున్నాయి.

ఈ విషయాన్ని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ ఎక్స్​ వేదికగా వెల్లడించారు. అబుదాబిలో జరగనున్న సమావేశాల్లో యుద్ధానంతర భద్రతా ఏర్పాట్లు, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే చర్యలు, మానవతా సహాయం, శాంతి ఒప్పందం దిశగా తీసుకోవాల్సిన తదుపరి నిర్ణయాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

ఉక్రెయిన్‌, రష్యా మధ్య కార్యాచరణ స్థాయి చర్చలకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుందని పేర్కొన్నారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్‌ చేపట్టిన ప్రయత్నాల్లో భాగంగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

మరోవైపు ఉక్రెయిన్​కు భద్రతా హామీలు కల్పించే అంశంపై అమెరికా మరో కీలక సమావేశానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ వారం బ్రస్సెల్స్​లో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, ఈయూ, నాటో ప్రతినిధులతో అమెరికా చర్చలు జరపనున్నట్లు అమెరికా ప్రత్యేక రాయబారి విట్​కాఫ్​ వెల్లడించారు.

యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్‌కు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు అవసరం? భవిష్యత్తులో రష్యా నుంచి ముప్పు ఎదురుకాకుండా ఎలాంటి హామీలు కల్పించాలి? ఐరోపా దేశాల భద్రతా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్​ ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించేందుకు అవసరమైన పెట్టుబడులు, ఆర్థిక అవకాశాలపైనా కూడా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కీవ్‌, ఓస్లో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో గతంలో జరిగిన సంప్రదింపుల ద్వారా కొంత పురోగతి సాధించినట్లు విట్ కాఫ్ తెలిపారు.

రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలలో స్టీవ్ విట్‌కాఫ్ అత్యంత కీలకమైన మధ్యవర్తిగా, ప్రత్యేక రాయబారిగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ యంత్రాంగం తరఫున యుద్ధాన్ని ముగించే దౌత్యపరమైన బాధ్యతలను ఆయన భుజాన వేసుకున్నారు. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌తో కలిసి విట్‌కాఫ్ ఈ దౌత్య వ్యూహాన్ని ముందుకు నడిపిస్తున్నారు.

చర్చల సన్నాహాల్లో భాగంగా విట్‌కాఫ్ ఇటీవల నార్వే లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీని, ఆ తర్వాత రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను స్వయంగా కలుసుకుని సరికొత్త శాంతి ప్రతిపాదనలను చర్చించారు. నవంబర్ 10, 11 తేదీలలో అబుదాబి వేదికగా ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరగనున్న కార్యాచరణ స్థాయి ముఖాముఖి శాంతి చర్చలకు ఆయనే ప్రధాన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి

ఎండ్ కార్డ్ వేయడానికి ట్రంప్ ప్రభుత్వం నిరంతరంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి

ఒకవైపు శాంతి చర్చలకు అమెరికా ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు రష్యా నుంచి భారీ దాడులు జరిగే ప్రమాదం ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. రష్యా మరోసారి తమ దేశంపై పెద్ద ఎత్తున దాడులకు సిద్ధమవుతోందని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందినట్లు తెలిపారు.

ముఖ్యంగా ఇంధన, రవాణా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే అవకాశముందని తెలిపారు. అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికలపై అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతమయ్యే అవకాశాన్ని రష్యా తనకు అనుకూలంగా మలచుకోవచ్చని జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.

యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు చర్చలు వేగవంతం కావాలని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని, శాంతి ప్రతిపాదనలను ఇప్పటికే అమెరికా ప్రతినిధులకు అందజేసినట్లు పేర్కొన్నారు.

కాగా ఇరు దేశాల మధ్య వివిధ స్థాయుల్లో దౌత్యపరమైన సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం పూర్తిగా చక్కబడలేదు. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ వైమానిక దాడికి పాల్పడింది. ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని జపోరిజియా ప్రాంతం కొమిషువాఖాలో పౌరులు ఆశ్రయం పొందుతున్న భవనంపై తొమ్మిది బాంబులు వేసింది.

ఈ ఘటనలో ఇప్పటివరకు 33 మంది మరణించగా, మరో 50 మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ దాడిని తమ యుద్ధంలోనే అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభివర్ణించారు. రష్యా సైన్యం 289 దాడి డ్రోన్లు, 17 బాలిస్టిక్‌ క్షిపణులు, 59 క్రూయిజ్‌ క్షిపణులతో విరుచుకుపడినట్లు పేర్కొన్నారు.

ముఖ్యంగా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, సబ్‌స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. ఒడెసా, చెర్కాసీ, జైటోమిర్‌, వినిట్సియా, ఖార్కివ్‌, డ్నిప్రో, చెర్నివ్ట్సీ, చెర్నిహివ్‌, రివ్నే ప్రాంతాల్లో దాడుల ప్రభావం తీవ్రంగా కనిపించింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్