Burning Topic: ఎన్నికల్లో గెలుపు కోసం ట్రంప్ సంచలన ప్రకటన!

Burning Topic: అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి పౌరుడికి 5,000 డాలర్లు ఇస్తామంటూ డోనాల్డ్ ట్రంప్ సంచలన హామీ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Sept 2026 8:47 AM IST
Burning Topic
X

Burning Topic: ఎన్నికల్లో గెలుపు కోసం ట్రంప్ సంచలన ప్రకటన!

Burning Topic: అమెరికా ఇప్పుడు మధ్యంతర ఎన్నికలకు సిద్దమవుతోంది. నవంబర్ 3వ తేదీన అమెరికా కాంగ్రెస్‌లోని రెండు సభల స్థానాలతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్ పదవులకు పోలింగ్ జరుగుతుంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోని మొత్తం 435 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అలాగే మొత్తం 100 స్థానాలు ఉన్న సెనెట్‌లో సుమారు మూడో వంతు, అంటే 35 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అమెరికాలోని 50 రాష్ట్రాలకు గానూ 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు, అలాగే 3 టెరిటరీల గవర్నర్లకూ ఈ సమయంలోనే ఎన్నికలు జరుగుతాయి. అమెరికా అధ్యక్షుడి నాలుగేళ్ల పదవీ కాలానికి సరిగ్గా మధ్యలో ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వీటిని మధ్యంతర ఎన్నికలు అని పిలుస్తారు. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌లోని రెండు సభల్లోనూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీ రిపబ్లికన్‌కే మెజారిటీ ఉంది. అయితే అమెరికా రాజకీయ చరిత్ర ప్రకారం అధికారంలో ఉన్న అధ్యక్షుడి పార్టీ సాధారణంగా మధ్యంతర ఎన్నికల్లో సీట్లను కోల్పోతుంది.

ప్రస్తుతం జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తీవ్రమైన గడ్డు పరిస్థితులను, వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. తాజా అధ్యనం ప్రకారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ 33% నుండి 40% కి పడిపోయింది. ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణల వల్ల దేశీయంగా చమురు, ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. ట్రంప్ విధించిన అంతర్జాతీయ పన్నులు, వాణిజ్య యుద్ధాల కారణంగా నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం పెరిగాయని దాదాపు 77% మంది ప్రజలు భావిస్తున్నారు. ఈ వ్యతిరేకత పార్టీ అభ్యర్థుల గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ ఓటర్లలో ఉత్సాహం పెరుగుతోంది. తాజా అధ్యయనం ప్రకారం డెమొక్రాట్లు +5.7 పాయింట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. వారు ప్రతినిధుల సభను సులువుగా తిరిగి చేజిక్కించుకునే దిశగా అంచనాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పై పట్టును నిలుపుకోవడానికి రిపబ్లికన్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఈ గడ్డు పరిస్థితుల నుండి గట్టెక్కడానికి రిపబ్లికన్ పార్టీ సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్రలో మొదటిసారిగా కేవలం మధ్యంతర ఎన్నికల కోసం డల్లాస్‌లో భారీ కన్వెన్షన్ నిర్వహించి మద్దతుదారులను కూడగట్టే ప్రయత్నం చేశారు. మధ్యంతర ఎన్నికలపై సర్వేలన్నీ ప్రతికూల ఫలితాలు ఇస్తున్న వేళ.. ఓటర్లను ఆదుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన హామీ ఇచ్చారు. రిపబ్లికన్లు కాంగ్రెస్‌ రెండు సభల్లోనూ పట్టు నిలబెట్టుకుంటే.. ప్రతీ అమెరికన్‌ పౌరునికి 5,000 డాలర్లు ఇస్తామని ప్రకటించారు. అంటే భారత కరెన్సీలో సుమారు 4 లక్షల 20 వేల రూపాయలు దీనికి ‘ట్రంప్‌ డివిడెండ్‌’గా పేరు పెడతామని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీలో ఉన్నట్లుగా భావించి మద్దతుదారులు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్లు గెలిస్తే ఓటర్లు గెలిచినట్టేనని అప్పుడు వారికి 5 వేల డాలర్లు లభిస్తాయన్నారు.

కాగా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వాగ్దానం ప్రకారంసుమారు 27 కోట్ల మంది అమెరికా వయోజనులకు 5 వేల డాలర్ల చొప్పున చెల్లించాల్సి వస్తే ఖాజానాపై పెద్ద భారమే పడుతుంది. కనీసం 1 ట్రిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని ఆర్థిక నిపుణుల అంచనా. అయితే ఈ భారీ మొత్తాన్ని ఎలా సమకూరుస్తారనే దానిపై మాత్రం ట్రంప్‌ స్పష్టత ఇవ్వలేదు. ఈ హామీ ఆర్థికంగా, రాజకీయంగా ఎంతవరకు సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రంప్ మాత్రం మన దేశం ఎంతో డబ్బు సంపాదిస్తోంది అని మాత్రమే చెప్పారు. కాగా ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని పదేపదే ప్రస్తావించారు. ఇరాన్‌పై విజయం సాధించిన వెంటనే చమురు ధరలు తగ్గుతాయని చెప్పారు. ఆహారం సహా దాదాపు అన్ని వస్తువుల ధరలు తగ్గుతున్నాయన్నారు ట్రంప్. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్ముజ్‌ జలసంధికి తన పేరును పెట్టాలని కూడా ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే మధ్యంతర ఎన్నికల్లో భారతీయ- అమెరికన్ ఓటర్లలో ఎక్కువ మంది డెమొక్రటిక్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. ఏషియన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ ఓటు APIAVote నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న భారతీయ- అమెరికన్ ఓటర్లలో 66 శాతం మంది ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థులకు ఓటు వేస్తామని తెలిపారు. 18 శాతం మంది రిపబ్లికన్‌ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని చెప్పారు. సర్వేలో పాల్గొన్న ఆసియా అమెరికన్ ఓటర్లలో 42 శాతం మంది తమను డెమొక్రటిక్ పార్టీ సంప్రదించలేదని చెప్పారు. మరోవైపు 58 శాతం మంది రిపబ్లికన్ పార్టీ నుంచి కూడా తమను సంప్రదించలేదని తెలిపారు. అయినప్పటికీ ఏషియన్‌ అమెరికన్‌, పసిఫిక్‌ ఐలాండర్‌ ఓటర్లలో ఓటింగ్‌పై ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు సర్వే తెలిపింది. 90 శాతానికి పైగా నమోదైన ఓటర్లు మధ్యంతర ఎన్నికల్లో ఓటు వేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సర్వేలో 2,066 మంది నమోదైన ఓటర్లను సంప్రదించారు. వీరిలో 1,896 మంది ఆసియా అమెరికన్లు, 242 మంది భారతీయ అమెరికన్లు, 170 మంది పసిఫిక్ ఐలాండ్​ వాసులు ఉన్నారు. 2026లో అమెరికాలో సుమారు 1.6 కోట్ల మంది ఏషియన్‌ అమెరికన్‌, పసిఫిక్‌ ఐలాండర్‌ పౌరులు ఓటు వేసేందుకు అర్హత కలిగి ఉంటారని ఏషియన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ ఓట్, ఏఏపీఐ డేటా సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ వర్గం ఓటర్లు మధ్యంతర ఎన్నికల్లో కీలక ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ భాగస్వామ్యం విషయానికొస్తే 66 శాతం మంది ఆసియా అమెరికన్‌, పసిఫిక్‌ ఐలాండర్‌ ఓటర్లు రాజకీయంగా చురుకుగా ఉన్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో జీవన వ్యయం, ద్రవ్యోల్బణం ప్రధాన సమస్యలు అని ఎక్కువ మంది చెప్పారు. అలాగే ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాలు, నిరుద్యోగిత, సామాజిక భద్రత, మెడికేర్‌, విద్యకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story