Burning Topic: అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికల ఎఫెక్ట్!

Burning Topic: అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్ ప్రారంభం. డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తును నిర్ణయించనున్న కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు. భారత్‌పై ప్రభావమెలా?

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 Nov 2026 7:50 AM IST
Burning Topic
X

Burning Topic: అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికల ఎఫెక్ట్!

Burning Topic: మధ్యంతర ఎన్నికల పోలింగ్‌కు సిద్ధమైపోయింది అగ్రరాజ్యం. అమెరికాలో ప్రతి నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. కానీ మధ్యంతర ఎన్నికలు ప్రతి రెండేళ్లకోసారి వస్తాయి. నవంబర్ 3న జరగనున్న ఎన్నికలు చట్టాలు చేసే కాంగ్రెస్‌కు సంబంధించినవి. ఈ ఫలితాలు అధ్యక్షుడిని మార్చకున్నా, రాబోయే రెండేళ్లపాటు ఆయన తీసుకునే నిర్ణయాలకు చట్టసభల మద్దతు లభిస్తుందా లేదా అనేది మాత్రం ఈ ఎన్నికల ద్వారానే స్పష్టమవుతుంది. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో ఉన్న మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లోని 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్‌ మీద కాంగ్రెస్‌పై రిపబ్లికన్ల ఆధిపత్యం కొనసాగుతుందా లేదా డెమోక్రాట్లు పైచేయి సాధిస్తారా అనేది తేలనుంది. ఈ ఫలితాల ఆధారంగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవీకాలంలోని మిగిలిన రెండేళ్ల రాజకీయ దిశను ప్రభావితం చేయనున్నాయి. అందుకే ఈ ఎన్నికలపై అమెరికాతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

అమెరికా ప్రభుత్వంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుంది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి నేతృత్వంలోని కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రించే అధికారం దీనికి ఉంటుంది. చట్టాలు చేయడం, యుద్ధాన్ని ప్రకటించడం వంటి అత్యంత కీలకమైన అధికారాలు చట్టసభల చేతుల్లోనే ఉంటాయి. అందుకే మెజారిటీ సాధించిన పార్టీకే ఇక్కడ పూర్తి పట్టు లభిస్తుంది. కాంగ్రెస్‌లో బలాబలాలు మారితే అధ్యక్షుడి పాలనపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌లోని రెండు సభల్లో రిపబ్లికన్లకే మెజారిటీ ఉంది. ప్రతినిధుల సభలోని 435 స్థానాల్లో మెజారిటీ సాధించాలంటే 218 అవసరం. అయితే ‌ట్రంప్ పార్టీ రిపబ్లికన్లకు సరిగ్గా 218 సీట్లున్నాయి. ఇక వంద సీట్లున్న సెనెట్‌లో రిపబ్లికన్లకు 53, డెమోక్రాట్లకు 45 సీట్లున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మీద పట్టు నిలుపుకోవడం అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌కు ఎంతో ముఖ్యం. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్‌లోని రెండు సభల మీద డెమోక్రాట్లు పట్టు సాధించే అవకాశం ఉంది.

మధ్యంతర ఎన్నికల బ్యాలట్ పేపర్‌లో ట్రంప్ పేరు కపోయినప్పటికీ, ఆయనను పక్కనపెట్టి ఎన్నికలను ఊహించలేం.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అమెరికా మధ్యంతర ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్‌తో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధ ప్రభావం అగ్రరాజ్యంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపైనా పడింది. పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలు కార్డు స్థాయిలో పెరగడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ట్రంప్ విధానాలపై అమెరికన్ల ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా వచ్చిన కొన్ని సర్వేల అంచనాల ప్రకారం ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు 220 నుంచి 230 స్థానాలు గెలుచుకుని సునాయాసంగా మెజారిటీ సాధిస్తారని తెలుస్తోంది. సెనెట్‌లోలోనూ రిపబ్లికన్లపై ఆధిక్యత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ఎన్నికల తర్వాత ట్రంప్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదని అర్థమవుతోంది.

ఒకవేళ కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు ఓడిపోయినంత మాత్రాన ట్రంప్ అధ్యక్ష పదవికి వచ్చిన ముప్పేమీ లేదు. కానీ డెమోక్రాట్లు ఆధిక్యత సాధిస్తే ఆయన తీసుకునే నిర్ణయాలు ఉభయ సభల ఆమోదం పొందడం కష్టమవుతుంది. పన్నులు, ప్రభుత్వ నిధులు, రుణ పరిమితి వంటి కీలక అంశాలపై కాంగ్రెస్ నిర్ణయమే అంతిమం. ప్రతినిధుల సభ డెమోక్రాట్ల చేతుల్లోకి వెళితే, కొత్త పన్నులు, వ్యయానికి సంబంధించిన రిపబ్లికన్ల నిర్ణయాలను వారు అడ్డుకోవచ్చు. ట్రంప్ నామినేట్ చేసే న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల నియామకాలకు సెనేట్ ఆమోదం తప్పనిసరి. ప్రతినిధుల సభను డెమోక్రాట్లు కైవసం చేసుకుంటే, కాంగ్రెస్ కమిటీల ద్వారా ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యయంపై ప్రతినిధుల సభదే ఆధిపత్యం. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వ నిధులు, రుణ పరిమితుల పెంపుపై రెండు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ జరిగే అవకాశం ఉంది.అవసరమైతే ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కూడా వారికి ఉంటుంది.

కాగా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి పాలై, కాంగ్రెస్‌పై డెమోక్రాట్లు ఆధిపత్యం సాధిస్తే తన వ్యూహం ఎలా ఉంటుందో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అప్పుడు తాను ‘మిస్టర్ వీటో’గా మారతానని వ్యాఖ్యానించారు. డెమోక్రాట్లు ఆమోదించే బిల్లులను వీటో అధికారంతో అడ్డుకుంటానని చెప్పారు‘‘ఎన్నికల్లో వారు గెలిచి, కాంగ్రెస్‌పై పట్టు సాధిస్తే.. వారు చేసే బిల్లులను ఆమోదించకుండా అన్నింటినీ తిరస్కరిస్తాను. ఒకటి రెండు నెలలపాటు అలా చేస్తే.. చివరికి వారే నా దగ్గరికి వచ్చి ఒప్పందం చేసుకోవాలని చూస్తారు. అయితే.. అవన్నీ వృథా ప్రయత్నాలే అవుతాయి’ అని ట్రంప్ అన్నారు. తన పాలనలో చరిత్రలోనే అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఎదిగిందని పేర్కొన్నారు. రిపబ్లికన్లకు వచ్చే ఓట్లను సర్వేలు సరిగ్గా చూపించట్లేదని అసహనం వ్యక్తం చేశారు. డెమొక్రాట్లు ఆధిక్యత సాధిస్తే, అమెరికాతో పాటు ప్రపంచ రక్షణ ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు ట్రంప్.

కాగా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి మద్దతు కూడగట్టేక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం చివరకు ఆయన మెడకే చుట్టుకునేలా తయారైంది. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లోనే తన మద్దతుదారులను ఉద్దేశించి ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. “నేను కూడా బ్యాలెట్‌పై ఉన్నట్టుగా భావించండి” అని కోరారు. మధ్యంతర ఎన్నికల్లో తన పేరు ఉండదని తెలిసినా, తనను అభ్యర్థిగా ఊహించుకుని రిపబ్లికన్లకు ఓటేయాలని పిలుపునిచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటేసే మద్దతుదారులు మధ్యంతర ఎన్నికల సమయంలో అదే ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు రావడం లేదని ఆయన భావించారు. అందుకే తన వ్యక్తిగత ఆకర్షణను ఉపయోగించి రిపబ్లికన్ అభ్యర్థుల కోసం కూడా ఓటర్లను బయటకు తీసుకురావాలని చూశారు. అయితే ట్రంప్‌ పాలన మీద అసంతృప్తితో ఉన్నవారు కూడా అంతే ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి వ్యతిరేక ఓటు వేసే అవకాశం ఉంది. రిపబ్లికన్ అభ్యర్థుల ఓటమికి కూడా ఆయన బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

మరోవైపు అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల ప్రభావం భారత్ మీద ఎంత అనే చర్చ జరుగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న సుంకాల విధానాలపై కాంగ్రెస్‌ నియంత్రణ పెరిగే అవకాశం ఉంటుంది. డెమొక్రాట్లు గెలిస్తే ట్రంప్ వాణిజ్య విధానాలపై మరింత పర్యవేక్షణ ఉండవచ్చు, కానీ ఎగుమతిదారులకు తక్షణమే సుంకాల నుండి ఉపశమనం లభించకపోవచ్చు అని అని భావిస్తున్నారు.అమెరికాలో కఠినతరమైన వలస విధానాలు, H-1B వీసా నిబంధనలు భారతీయ టెక్నాలజీ నిపుణులపై, ఐటీ కంపెనీలపై ప్రభావం చూపుతాయి. ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనలు మరియు వీసా రుసుములపై కోర్టుల జోక్యం, కాంగ్రెస్ చర్చలు కీలకంగా మారాయి. కాగా ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు మెజారిటీ సాధించినప్పటికీ, ట్రంప్ అజెండాను అడ్డుకోవడానికి వారు చేయగలిగేది చాలా తక్కువగా ఉంటుందని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ గత వారం తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్