Burning Topic: అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఏం జరగబోతోంది?
Burning Topic: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి ఓటర్లు, 'సమోసా కాకస్' అభ్యర్థులు కీలక శక్తిగా అవతరించారు.
Burning Topic: అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఏం జరగబోతోంది?
Burning Topic: నవంబర్ 3న జరగనున్న మధ్యంత ఎన్నికల కోసం సిద్ధమవుతోంది అగ్రరాజ్యం. అమెరికా కాంగ్రెస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లోని 34 స్థానాలకు.. 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు, అనేక రాష్ట్రాల సెటెన్, అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ తన పట్టును నిలుపుకునేందుకు, ప్రధాన ప్రతిపక్షం డెమొక్రాట్లు సత్తా చాటుకునేందుకు మధ్యంతర ఎన్నికలు కీలకంగా మారాయి.
ఈ ఎన్నికల్లో భారత సంతతి ఓటర్లు కూడా తమ ప్రభావాన్ని చూపేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికా జనాభాలో వీరు 1.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, దేశ జీడీపీలో దాదాపు 5 శాతం వాటాను కలిగి ఉండటంతో పాటు, అత్యంత విద్యావంతులు, క్రియాశీలక ఓటర్లుగా రాజకీయాల్లో తమ సత్తా చాటుతున్నారు. కేవలం ఓటు వేసుందుకే కాకుండా వీలైనంత ఎక్కువ మంది భారతీయ సంతతి నాయకులను గెలిపించుకోవాలని పట్టుదలతో ఉన్నారు.
అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలున్న నాయకుల ప్రభావం వేగంగా పెరుగుతోంది. వ్యాపార, సాంకేతిక, విద్య, ప్రభుత్వ రంగాల్లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇండో అమెరికన్స్- కాంగ్రెస్‌లో తమ ప్రాతినిధ్యాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మరింత విస్తరించుకోవాలని భావిస్తున్నారు. నవంబర్ 3న జరగనున్న కీలక పోరులో కేవలం ఓటర్లుగానే కాకుండా, వాషింగ్టన్ పీఠాన్ని శాసించే బలమైన రాజకీయ శక్తిగా భారత సంతతి అవతరించింది.
పెన్సిల్వేనియా, మిచిగాన్, జార్జియా, టెక్సాస్ వంటి స్వింగ్ స్టేట్స్లో అభ్యర్థుల తలరాతలను మార్చే సత్తా ఇప్పుడు వీరి చేతుల్లోనే ఉంది. అమెరికాలో భారత సంతతికి చెందిన చట్టసభ్యులను సమోసా కాకస్ అని పిలుస్తారు. ఇందులో ప్రస్తుతం ఆరుగురు ఉండగా.. రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బెరా, సుహాస్ సుబ్రమణ్యం మళ్లీ బరిలో నిలిచి తమ స్థానాలను నిలబెట్టుకోవడానికి పోటీ పడుతున్నారు.
డెమోక్రటిక్ నేత రో ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో నిలిచారు. 2016లో తొలిసారి ప్రతినిధుల సభకు ఎన్నికైన ఆయన టెక్నాలజీ విధానాలు, ఆర్థిక అసమానతలు, తయారీ రంగం, ఎన్నికల నిధుల సంస్కరణలపై పనిచేశారు. సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో ఈ నియోజకవర్గంపై సాధారణంగా డెమోక్రటిక్ పార్టీకే మంచి పట్టు ఉంది. అయితే ఆయనకు భారత సంతతికే చెందిన రిపబ్లికన్ అభ్యర్థి రితేష్ టాండన్ పోటీ ఇస్తున్నారు.
మరో కీలక నాయకురాలు ప్రమీలా జయపాల్ వాషింగ్టన్ రాష్ట్రంలోని 7వ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2017 నుంచి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ఆమె అమెరికన్ రాజకీయాల్లో భారత సంతతికి చెందిన అత్యంత ప్రముఖుల్లో ఒకరిగా నిలిచారు. ఆరోగ్య సేవలు, వలస విధానం, కార్మికుల హక్కులు, సంక్షేమ పథకాలపై ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక ఈమెకు భారత సంతతికి చెందిన రిపబ్లికన్ క్యాండిడేట్ నిరవ్ షేత్ సవాల్ విసురుతున్నారు.
కాలిఫోర్నియాలోని 3వ నియోజకవర్గం నుంచి ప్రముఖ ఫిజీషియన్ అమీ బేరా మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. 2013 నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఆయన భారత సంతతి నేతల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిలో ఒకరుగా ఉన్నారు. వర్జీనియాలోని 10వ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సుహాస్ సుబ్రమణ్యం 2025లో కాంగ్రెస్‌లోకి ప్రవేశించారు.
గతంలో వర్జీనియా రాష్ట్ర శాసనసభలో పనిచేయడంతో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలోనూ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు తిరిగి ఎన్నిక కావాలని ప్రయత్నిస్తున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి డేవ్ బెక్విత్ ఆయనకు పోటీ ఇస్తున్నారు. ఇక్కడ ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రజా సేవలకు సంబంధించిన అంశాలు ఈ పోటీలో ప్రభావం చూపొచ్చని భావిస్తున్నారు.
కాగా ఇప్పటికే ప్రతినిధుల సభలో ఉన్నరాజా కృష్ణమూర్తి, శ్రీ థానేదార్ ప్రైమరీ దశలోనే ఓడిపోవడంతో పోటీకి దూరం కావాల్సి వచ్చింది. వీరంతా విపక్ష డెమొక్రాటిక్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.
అరిజోనాలోని 1వ నియోజకవర్గం నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా అమిష్ షా పోటీ చేస్తున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆయన గతంలో శాసన సభ్యునిగా ఉన్నారు. 2024లో ఇదే నియోజక వర్గంలో రిపబ్లికన్ అభ్యర్థి డేవిడ్ ష్వైకర్ట్ చేతిలో ఓడిపోయారు. ఈసారి మాజీ అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు జే ఫీలీతో తలపడుతున్నారు.
ఈ ఎన్నికలో ప్రజల జీవన వ్యయం, వైద్య ఖర్చులు, జాతీయ రాజకీయ పరిస్థితులు వంటివి కీలకం కావొచ్చని భావిస్తున్నారు. కొన్ని ఎన్నికల అంచనా సంస్థలు ఈ పోటీని డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా చూస్తుండగా, మరికొన్ని పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.
ఫ్లోరిడాలోని 22వ నియోజకవర్గం నుంచి పియా దండియా పోటీ చేస్తున్నారు. ఆమె గెలిస్తే ఫ్లోరిడా నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఉపాధ్యాయురాలిగా, స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేసిన ఆమె వైట్‌హౌస్ ఫెలోగా కూడా సేవలు అందించారు. అనంతరం యాపిల్ సంస్థలో బాధ్యతలు నిర్వహించారు.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బేరా, సుహాస్ సుబ్రమణ్యం తమ స్థానాలను నిలబెట్టుకుంటే, అమిష్ షా, పియా దండియా కొత్తగా గెలిస్తే సమోసా కాకస్ సభ్యుల బలం మళ్లీ ఆరుకు చేరనుంది. ఈ ఫలితాలు కేవలం భారత సంతతి నేతల సంఖ్యనే కాకుండా, అమెరికా రాజకీయాల్లో వారి ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తాయి.
అయితే వీరందరికీ వారు పోటీ చేస్తున్న స్థానాల్లో విజయావకాశాలు బలంగా ఉన్నాయని భావిస్తున్నారు. కాగా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు ఇటు డెమోక్రటిక్ పార్టీలోనే కాకుండా రిపబ్లికన్ పార్టీ తరఫున కూడా పోటీ చేస్తున్నారు. రితేష్ టాండన్, నిరవ్ షేత్లతో పాటు నార్త్ కరోలినాలో మహేశ్ గనోర్కర్ కూడా కాంగ్రెస్ స్థానాల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే వీరు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో డెమోక్రటిక్ పార్టీకి ఉన్న బలం కారణంగా గెలుపు కష్టమవుతుందనే అంచనాలు ఉన్నాయి.
అమెరికాలో సాంప్రదాయకంగా భారతీయ మూలాలు ఉన్న ఓటర్లు డెమొక్రాటిక్ పార్టీకే మద్దతు ఇస్తుంటారు. 2026లో నిర్వహించిన ఓ సర్వేలో వీరు డెమోక్రటిక్ కాంగ్రెస్ అభ్యర్థులకు 66 శాతం, రిపబ్లికన్ అభ్యర్థులకు 18 శాతం మద్దతు తెలిపినట్లు తేలింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వలస వ్యతిరేక విధానాలపై ఇండో అమెరికన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
వలస విధానాలు, హెచ్-1బీ వీసా నిబంధనలు, పెరుగుతున్న జీవన వ్యయం, పన్నులు ఈ ఎన్నికల్లో వీరిని డొమొక్రాట్లకు మరింత దగ్గరగా చేర్చాయని భావిస్తున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు భారత సంతతి ఓటర్లతో పాటు ఇతర వర్గాల ఓటర్ల మద్దతు పొందడం అభ్యర్థులకు చాలా ముఖ్యం. ఇళ్ల అద్దెలు, ఆరోగ్య సేవల ఖర్చులు, విద్య, ఉద్యోగాలు, వలస విధానం, పౌర హక్కులు, అమెరికా- భారత్ సంబంధాలు వంటి అంశాలు కూడా ఎన్నికలపై ప్రభావం చూపొచ్చు.




