BURNING TOPIC: ఇజ్రాయెల్‌కు ఇక ఉచిత సాయం లేదు.. ట్రంప్ సంచలన నిర్ణయం!

BURNING TOPIC: ఇజ్రాయెల్‌కు ప్రతి ఏటా అందిస్తున్న 4 బిలియన్ డాలర్ల రక్షణ ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Nov 2026 10:29 AM IST
BURNING TOPIC
X

BURNING TOPIC: ఇజ్రాయెల్‌కు ఇక ఉచిత సాయం లేదు.. ట్రంప్ సంచలన నిర్ణయం!

BURNING TOPIC: సరిగ్గా అమెరికా మధ్యంతర ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెలువడుతున్న వేళఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా నిలిచిన రక్షణ నిధులకు చెక్ పెట్టారు.

ఇజ్రాయెల్‌కు ప్రతి ఏటా అందిస్తున్న 4 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ.33 వేల కోట్ల రక్షణ ఆర్థిక సాయాన్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఈ ఏడాది చివరి నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. ఇజ్రాయెల్ ఇప్పుడు ఆర్థికంగా బలమైన దేశమని, అమెరికా సాయం లేకుండానే తన రక్షణ అవసరాలను తీర్చుకోగలదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

ఇజ్రాయెల్‌కు ఆర్థిక సాయాన్ని నిలిపివేసినప్పటికీ, ఆ దేశంతో రక్షణ బంధం పూర్తిగా తెగిపోదని తెలిపారు. ఇజ్రాయెల్ తన సొంత నిధులతో అమెరికా నుంచి ఆయుధాలను యథావిధిగా కొనుగోలు చేసుకోవచ్చని, భవిష్యత్తులో ఆ దేశానికి ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే అమెరికా తప్పకుండా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

కాగా ఈ నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నది కాదని, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కొన్ని నెలల క్రితమే దీనిపై ఒక ఒప్పందం కుదిరిందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. నెతన్యాహు స్వయంగా ఈ ప్రతిపాదనను తెచ్చారని, అమెరికా ఇచ్చే ఆర్థిక సాయాన్ని క్రమంగా తగ్గించుకోవడానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని వెల్లడించారు.

అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్ జరుగుతున్న తరుణంలో ఓ న్యూస్ ఛానల్‌తో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇజ్రాయెల్‌కు ఇచ్చే భారీ నిధుల అంశాన్ని రిపబ్లికన్లపై విమర్శలు చేయడానికి డెమొక్రాట్లు ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నారని, దానికి అడ్డుకట్ట వేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ స్పష్టం చేశారు.

ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో దశాబ్ధాలగా కొనసాగుతున్న రెండు దేశాల సైనిక సంబంధాల్లో కీలక మార్పులు కనిపించే అవకాశం ఉంది. అంతే కాక ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు కారణమవుతోంది.

ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం.. మరోవైపు దేశంలో అధికారం చేజారే పరిస్థితి.. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా నుంచి అందే ఆర్థిక అండకూ గండం ఏర్పడింది.. ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహుకు వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. అమెరికాలో గత కొంత కాలంగా గాజాపై ఇజ్రాయిల్ చేపట్టిన సైనిక చర్యల విసయంలో ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది.

ముఖ్యంగా డెమోక్రాట్లు ఆ దేశానికి అందిస్తున్న సహాయంపై ట్రంప్ పరిపాలనపై విమర్శలు చేస్తున్నారు. ఇజ్రాయిల్‌కు అవసరానికి మించి సహాయం చేస్తుందని భావిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవలి సర్వేలో 48 శాతం మంది అమెరికా ఓటర్లు, 66 శాతం మంది డెమోక్రాట్లు తమ దేశం ఇజ్రాయెల్‌కు అతిగా మద్దతు ఇస్తోందని అభిప్రాయపడ్డారు.

2017లో ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఈ సంఖ్యలు వరుసగా 16 శాతం, 20 శాతంగా ఉంది. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు పట్టు కోల్పోయే అవకాశం ఉన్నఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అమెరికా అధ్యక్షుని ప్రకటన ఇజ్రాయెల్ రాజకీయాల్లోనూ కలకలం రేపింది. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాల్లో ఇంతటి కీలక మార్పు ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థకు, ప్రజలకు మీడియా ద్వారానే విషయం తెలియడం నెతన్యాహు పాలనా తీరుకు నిదర్శనమని ఆయన ప్రత్యర్థి గడి ఐసెన్‌కాట్ విమర్శించారు.

ఈ పరిణామం నెతన్యాహుకు రాజకీయంగా పెద్ద సవాలుగా మారింది. ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలున్నప్పటికీ.. సొంత దేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి, ప్రతిపక్షాల ఒత్తిడి ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. కాగా ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు కూటమికి మెజారిటీ రాకపోవడమే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు మద్దతుపై పెరుగుతున్న విమర్శలు.. ఈ రెండూ ఆయన పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.

అందుకే ఈ ప్రకటనను కేవలం ఆర్థిక నిర్ణయంగా కాకుండా అమెరికా అంతర్గత రాజకీయాలు, ఇజ్రాయెల్‌లో అధికార పోరు, మారుతున్న ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో చూడాల్సి ఉందని చెబుతున్నారు.

మరోవైపు ఇటీవలి ఇజ్రాయెల్‌లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఏర్పడ్డ సందిగ్దత కొనసాగుతోంది. గాజా యుద్ధం, ప్రాంతీయ సంఘర్షణల తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కూటమి, గడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రత్యామ్నాయ కూటమి రెండూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయాయి.

అక్టోబర్‌ 27న జరిగిన ఎన్నికల్లో 77.9 శాతం పోలింగ్ నమోదైంది. 1999 తర్వాత ఇదే అత్యధిక ఓటింగ్ శాతం. 120 మంది సభ్యులున్న కెనెసెట్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ ఎన్నికల్లో నెతన్యాహు కూటమికి 53 స్థానాలు, ఐసెన్‌కోట్ కూటమికి 48 స్థానాలు లభించాయి. మరోవైపు అరబ్ పార్టీల కూటమి జాయింట్ లిస్ట్, రామ్‌ కలిపి రికార్డు స్థాయిలో 19 స్థానాలు సాధించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో ఈ పార్టీల మద్దతు కీలకంగా మారింది.

నెతన్యాహు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇంకో 8 మంది సభ్యుల మద్దతు కూడగట్టుకుంటే సరిపోతుంది. ఏ కూటమికీ మెజారిటీ దక్కకపోవడంతో బెంజిమన్ నెతన్యాహు, గాడి ఐసెన్‌కోట్‌ చేతులు కలిపితే.. ఐక్యతా ప్రభుత్వం ఏర్పడుతుంది.

తన నాయకత్వంలో ఒక విస్తృత జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నెతన్యాహూ కూడా తెలిపారు అయితే నెతన్యాహును అధికారంలో నుంచి దించడమే లక్ష్యంగా ఐజెన్‌కోట్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించడానికి అరబ్ పార్టీలు సిద్దంగా ఉన్నాయి అయితే వాటితో చేతులు కలిపేందుకు కొన్ని పార్టీలు సుముఖంగా లేవని తెలుస్తోంది.

ప్రభుత్వంలో చేరకుండా అరబ్‌ పార్టీలు బయటి నుంచి విపక్ష కూటమికి మద్దతివ్వడం మరో మార్గం. ఐసెన్‌కోట్‌కు మద్దతిచ్చేందుకు రామ్, జాయింట్‌ లిస్ట్‌ సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలను మద్దతు కోరబోమని నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు.

ఇప్పుడు ఇజ్రాయెల్‌లో తదుపరి ప్రభుత్వం ఎవరిది అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ ప్రధాన పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించనున్నారు. ఎన్నికల్లో స్థానాలు సాధించిన పార్టీలు ప్రధానమంత్రి పదవికి తమ అభ్యర్థిని సూచిస్తాయి.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల అవకాశాలు ఎక్కువగా ఉన్న ఎంపీకి అధ్యక్షుడు ఈ బాధ్యతలు అప్పగిస్తారు. ఈ ఎంపీ తప్పనిసరిగా అతిపెద్ద పార్టీకి చెందిన నాయకుడే కావాల్సిన అవసరం లేదు. నవంబర్‌ 11 నాటికి ప్రభుత్వ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మొదట బాధ్యతలు అందుకున్న అభ్యర్థికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 28 రోజుల గడువు ఉంటుంది.

అవసరమైతే మరో 14 రోజులు పొడిగించవచ్చు. ఈ ప్రయత్నం విఫలమైతే అధ్యక్షుడు మరో ఎంపీకి అవకాశం ఇవ్వవచ్చు. రెండో అభ్యర్థికి 28 రోజుల గడువు ఉంటుంది. దీనికి పొడిగింపు ఉండదు. ఈ ప్రయత్నాలన్నీ విఫలమైతే పార్లమెంటును రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్