Burning Topic: ట్రంప్ పుతిన్ స్నేహంపై అమెరికన్ల ఆహ్రగం!
Burning Topic: రష్యాతో డీజిల్ ఒప్పందం కుదుర్చుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Burning Topic: ట్రంప్ పుతిన్ స్నేహంపై అమెరికన్ల ఆహ్రగం!
Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో డీజిల్ ఒప్పందం కుదుర్చుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల రష్యాకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందన్న విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీలకు చెందిన సెనేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ట్రంప్‌కు వీరంతా ఓ లేఖ రాశారు. ఈ ఒప్పందం అమెరికా శత్రువైన రష్యాకు ప్రయోజనం చేకూరుస్తుందని, ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న మిత్రదేశాలకు ద్రోహం చేసినట్లేనని వారు విమర్శించారు.
అక్టోబర్ 9న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం సరైన లక్ష్యాలను సాధించదని, అమెరికన్లకు కూడా ప్రయోజనం కలిగించదని సెనేటర్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా రష్యాకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు పుతిన్‌కు మరిన్ని నిధులు సమకూరే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా కాంగ్రెస్ గత నెలలో 'లిండ్సే ఓ. గ్రాహం రష్యా, ఇరాన్‌పై ఆంక్షల చట్టం 2026'ను ఆమోదించింది. ట్రంప్ కూడా ఆ చట్టంపై సంతకం చేశారు. రష్యాతో పాటు దాని యుద్ధానికి మద్దతు ఇస్తున్న దేశాలపై ఆర్థికపరమైన చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం ద్వారా అధ్యక్షుడికి అధికారాలు కల్పించారు.
రెండు సభల్లోనూ భారీ మెజారిటీతో ఈ చట్టం ఆమోదం పొందిందని సెనేటర్లు గుర్తుచేశారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా రష్యాపై ఒత్తిడి పెంచడం, న్యాయమైన శాంతి ఒప్పందానికి మార్గం సుగమం చేయడం దీని లక్ష్యమని తెలిపారు. రష్యా యుద్ధానికి ప్రధానంగా మద్దతు ఇస్తున్న చైనా వంటి దేశాలపై కూడా ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. అయితే ట్రంప్ హఠాత్తుగా యూటర్న్ తీసుకొని రష్యాతో ఒప్పందానికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఒప్పందాన్ని కొనసాగించడం కంటే రద్దు చేయడమే సరైన నిర్ణయమని అంటున్నారు.
ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికాతో పాటు ప్రపంచ దేశాలకు ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో డీజిల్ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో సరఫరాను పెంచి ధరలను అదుపు చేయాలని అమెరికా భావిస్తోంది. అయితే రష్యా డీజిల్ అమెరికా కోసం కాదని, ప్రపంచ మార్కెట్లో ధరలను తగ్గించడానికేనని డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.
అధిక ఇంధన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రపంచ మార్కెట్‌ను స్థిరీకరించడమే ఈ ఒప్పందం లక్ష్యమని స్పష్టం చేశారు. అక్టోబర్ 9న రష్యా నుంచి 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ సరఫరా కానుందని ప్రకటించారు. అనంతరం నవంబర్‌లో మరో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత వెంటనే 10 లక్షల టన్నుల డీజిల్ అందనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన సరఫరాను పెంచి, ధరలను నియంత్రించేందుకు ఈ చర్య దోహదపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
మరోవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ప్రయత్నాలు కొనసాగిస్తోందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్‌కు అమెరికా నిఘా సమాచారాన్ని అందించడం నిలిపివేసిందా? అన్న ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ, అలాంటిదేమీ లేదన్నారు. ఆ దేశానికి నిఘా సమాచారాన్ని అందిస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ఆపేందుకు ఉక్రెయిన్, రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. జెలెన్స్కీ కంటే పుతినే ఎక్కువగా యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నారని ఎందుకు భావిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా, చర్చలు, ఒప్పందాల విషయంలో తనకున్న అనుభవమే ఇందుకు కారణమని ట్రంప్ తెలిపారు.
పుతిన్ యుద్ధాన్ని ముగించాలని బహుశా ఎక్కువగా కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. అయితే, ఇరువురు నేతల మధ్య తీవ్ర విభేదాలు, పరస్పర ద్వేషం ఉన్నాయని వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని ఎలా ముగించాలో వారికి స్పష్టత లేదని, వారిని ఒక ఒప్పందానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
ఇదిలా ఉంటే రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఉక్రెయిన్‌లోని ఇంధన కేంద్రాలపై రష్యా దాడులు చేయగా, ఉక్రెయిన్ కూడా రష్యా లక్ష్యాలను టార్గెట్ చేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదించిన ఇంధన రంగ దాడుల విరమణకు ఉక్రెయిన్ కట్టుబడి ఉన్నప్పటికీ రష్యా పట్టించుకోవడం లేదని జెలెన్స్కీ ఆరోపించారు. రెండు రోజులుగా తమ దేశం రష్యా చమురు శుద్ధి కర్మాగారాలు లేదా ఇంధన రంగంపై దాడులు చేయలేదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
అయినప్పటికీ రష్యా దాడులు కొనసాగించిందని విమర్శించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు రష్యా వందకు పైగా ఆయుధాలను ప్రయోగించిందని తెలిపారు. వీటిలో జెట్ ఇంజిన్లతో నడిచే డ్రోన్లు, లక్ష్యంపై దాడి చేసే పేలుడు డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని చెప్పారు. ఉక్రెయిన్ సైన్యం వీటిలో గణనీయమైన సంఖ్యలో అడ్డుకున్నప్పటికీ, రెండు రోజుల్లో 19 ప్రాంతాల్లో పౌర, కీలక మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లు ఆయన ఆరోపించారు.




