Burning Topic: నోబుల్ పురస్కారాలపై భగ్గుమన్న అమెరికా ఇజ్రాయెల్

Burning Topic: ఐసీసీపై అమెరికా తీవ్ర ఆంక్షలు విధించింది. మాజీ న్యాయమూర్తి నవీ పిళ్లైకి 2026 నోబెల్ శాంతి బహుమతి రావడంపై ట్రంప్ నెతన్యాహు అసంతృప్తి వ్యక్తం చేశారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 Oct 2026 7:31 AM IST
Burning Topic
X

Burning Topic: నోబుల్ పురస్కారాలపై భగ్గుమన్న అమెరికా ఇజ్రాయెల్

Burning Topic: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు -ఐసీసీ మీద ఉక్కుపాదం మోపింది అమెరికా. తీవ్రస్థాయిలో ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా అధికార పరిధిలో ఐసీసీకి ఉన్న అన్ని రకాల ఆస్తులను తక్షణమే స్తంభింపజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తమ అధికార పరిధిని దాటి వ్యవహరిస్తోందని ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న అగ్రరాజ్యం తీసుకున్న చర్యలు కలకలం రేపుతున్నాయి,

తమ దేశానికి చెందిన కంపెనీలు, వ్యక్తులు రాబోయే ఆరు నెలల వ్యవధిలో ఐసీపీతో సంబంధాలను పూర్తిగా ముగించుకోవాలని గడువు విధించింది అమెరికా. యుద్ధ నేరాల ఆరోపణలకు సంబంధించి అమెరికన్లు, ఇజ్రాయెల్‌ దేశస్థులపై ఐసీసీ అన్యాయంగా, చట్టవిరుద్ధంగా విచారణకు ప్రయత్నిస్తున్నట్లు అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ ఆంక్షలను ప్రకటించారు.

ఇప్పటికే అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టుకు చెందిన అయితే, ఇప్పటికే ఐసీసీకి చెందిన 17 మంది న్యాయమూర్తులు, అధికారులపై ఆంక్షలు విధించిన అమెరికా.. తాజాగా మొత్తం సంస్థనే లక్ష్యంగా చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో సందేశంలో మార్కో రూబియో మాట్లాడుతూ, న్యాయవ్యవస్థ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ఈ కోర్టుకు అందే వనరులను పూర్తిగా నిలిపివేస్తామని చెప్పారు.

అమెరికన్లపై విచారణ జరిపేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా పని చేయాలని చూసే వారి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తామని ఆయన హెచ్చరించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు గానీ, ఇక్కడి పౌరులు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి నకిలీ న్యాయస్థానాల ఆదేశాలకు కట్టుబడి ఉండబోరని రూబియో స్పష్టం చేశారు. అమెరికా సార్వభౌమత్వాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

2002లో ఏర్పాటైన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో 125 దేశాలు సభ్యులుగా ఉన్నాయి యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు, మారణహోమంపై ఐసీసీ విచారణ జరుపుతుంది. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సైనికుల చర్యలపై గతంలో చేపట్టిన దర్యాప్తు, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సహా పలువురు అధికారులపై అరెస్టు వారెంట్లు జారీ చేయడం ట్రంప్‌ ప్రభుత్వ అసంతృప్తికి కారణమయ్యాయి.

మరోవైపు అమెరికా నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నేర న్యాయం కోసం ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు ఇది పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌ దేశాలు ఐసీసీకి తమ మద్దతును ప్రకటించాయి. ఆంక్షల వల్ల కోర్టు కార్యకలాపాలు దెబ్బతినే అవకాశం ఉందని నెదర్లాండ్స్‌ తెలిపింది.

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మాజీ న్యాయమూర్తి నవీ పిళ్లైకి 2026 నోబెల్‌ శాంతి బహుమతి ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా ఈ ఆంక్షలను వెల్లడించడం గమనార్హం. తమతో సహకరించే వారిని భయపెట్టడమే ఈ చర్యల ఉద్దేశమని ఐసీసీ పేర్కొంది. అయినప్పటికీ తమ కార్యకలాపాలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తాజా పరిణామాలతో అంతర్జాతీయ నేర న్యాయవ్యవస్థ భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

2026 నోబెల్ శాంతి బహుమతి నావి పిళ్లైకు దక్కడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెను ‘అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకి’గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన విమర్శనాత్మక పోస్టును ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో రీపోస్ట్ చేశారు. నోబెల్ కమిటీ నిర్ణయం ఆ బహుమతి గౌరవాన్ని తగ్గించిందని విమర్శించారు. 8 యుద్ధాలను నివారించి శాంతి స్థాపనకు తాను చేసిన ప్రయత్నాలను గుర్తించి తనకే ఈ పురస్కారం ఇవ్వాల్సిందని ట్రంప్ పేర్కొన్నారు.

మరోవైపు నోబెల్ శాంతి బహుమతిని నవీ పిళ్ళైకి ఇవ్వడంపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమెన్ నెతన్యాహూ తప్పుపట్టారు. గాజాలో ఇజ్రాయెల్‌ మారణహోమానికి పాల్పడుతోందని ఆరోపించిన నవీ పిళ్లైను ‘యూదు వ్యతిరేక పక్షపాతి’ అంటూ నెతన్యాహు కార్యాలయం తీవ్ర విమర్శలు చేసింది. ఆమె యూదు వ్యతిరేకి‌, అవినీతి ప్రాసిక్యూటర్‌అంటూ ఆరోపణలు గుప్పించింది.

నోబెల్ బహుమతి కమిటీ తన నైతిక దిక్సూచిని కోల్పోయిందని ధ్వజమెత్తింది. యూదులపై తప్పుడు ఆరోపణలను సృష్టించి ప్రచారం చేయడాన్నే తన వృత్తిగా మార్చుకున్న వ్యక్తికి అత్యున్నత గౌరవాన్ని అందించిందని ఆరోపించింది. నవీ పిళ్లై తన కెరీర్‌ మొత్తంలో ప్రపంచంలోని ఏకైక యూదు దేశమైన ఇజ్రాయెల్‌పై తప్పుడు ప్రచారం చేశారని, యూదులను దుష్టులుగా చిత్రీకరించే ప్రయత్నాలకు పాల్పడ్డారని నెతన్యాహు కార్యాలయం ఎక్స్ ద్వారా తన ప్రకటనలో పేర్కొంది.

ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి ఎన్నికైన దక్షిణాఫ్రికా వాసి నవనీతమ్ నవీ పిళ్లై అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటున్నారు. భారతీయ తమిళ మూలాలున్న ఆమె అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా కూడా పనిచేశారు. యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు, మారణహోమాలకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కృషి చేసినందుకు ఆమెకు ఈ పురస్కారం ప్రకటించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది.

ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం కోసం నోబెల్ కమిటీకి 287 నామినేషన్లు వెళ్లాయి. శాంతి స్థాపన, సోదరభావాన్ని పెంపొందించడం వంటి లక్ష్యాల కోసం విశేష కృష్టి చేసిన నవనీతమ్ పిళ్లై వైపే నోబెల్ కమిటీ మొగ్గుచూపింది. కాగా నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సందర్భంగా నవీపిళ్లై మాట్లాడుతూ.. చప్పట్లు మరింతగా కొడితే ఈ బహుమతిని ట్రంప్‌తో పంచుకోవచ్చంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్