Burning Topic: భారత్‌పై మళ్ళీ సుంకాలకు సిద్ధమైన ట్రంప్!

Burning Topic: రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు, కొత్త చట్టంపై న్యూయార్క్‌లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో భేటీ అయిన విదేశాంగ మంత్రి జైశంకర్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Sept 2026 7:38 AM IST
Burning Topic
X

Burning Topic: భారత్‌పై మళ్ళీ సుంకాలకు సిద్ధమైన ట్రంప్!

Burning Topic: తమకు శత్రువులు అయితే అందరికీ శత్రువులు, వారిని దూరం పెట్టాలి అని ఆదేశిస్తే అందరూ దాన్ని పాటించాల్సిందే.. ఎవరూ వారితో సన్నిహితంగా ఉండటానికి వీలులేదు. ఆ శత్రువుల ద్వారా ఏమైనా లాభాలు ఉంటే తమకే దక్కాలి. ఇంకెవ్వరూ ఆ అవకాశం పొందడానికి వీల్లేదు.. ఇదీ అగ్రరాజ్యం అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరి.. ప్రపంచ మీద పెద్దన్నలా పెత్తనం చేస్తున్న అమెరికా తన ప్రయోజనాలను తప్ప ఇతర దేశాలకు ఎదురవుతున్న ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోదు.

తమకు కంటిలో నలుసుగా మారితే, అందరూ తమ బాధలా బాధ పడాల్సిందే.. తమకు నచ్చని దేశాలపై దాడి చేయడం, ఆంక్షలతో ఇబ్బంది పెట్టడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. వారిని మరింత ఇబ్బంది పెట్టడానికి మిగతా దేశాలన్నీ తమతో కలిసి రావాల్సిందే. తాజాగా ఇరాన్, రష్యా విషయంలో యునైటెడ్ స్టేట్స్ అవలంభిస్తున్న విధానం ఇందుకు అద్దం పడుతోంది.

ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రారంభమై నాలుగున్నరేళ్లు గడచిపోయినా ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. ఇరు దేశాలు ఇప్పటి వరకూ శాంతి ఒప్పందానికి రాకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో రష్యాను అన్ని రకాలుగా కట్టడి చేసే చర్యలకు ఉపక్రమించింది అమెరికా. ఇందులో భాగంగా ఇటీవల 'లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026'ను తీసుకొచ్చింది. దీని ప్రకారం రష్యా నాయకత్వం, ఇంధన రంగం, రక్షణపరిశ్రమలు, ఆ దేశ వాణిజ్యనౌకల కార్యకలాపాలకు సహకరించే వారిపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. కొత్త చట్టంలోని ప్రధాన నిబంధన ప్రకారం అతిపెద్ద రష్యా ఇంధన దిగుమతిదారుల నుంచి వచ్చే వస్తువులపై 100 శాతం వరకు సుంకం విధించేందుకు అమెరికా అధ్యక్షుడికి అవకాశం ఉంటుంది. అయితే సుంకాలు విధించాలా? ఎంత శాతం విధించాలి? అనే అధికారం ట్రంప్ విచక్షణపై ఆధారపడి ఉంది.

రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేసే ప్రధాన దేశాల్లో భారత్, చైనా ఉన్నాయి. దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రష్యాతో వ్యాపారం చేస్తూ ఉక్రెయిన్‌తో ఆ దేశం చేస్తున్న యుద్ధానికి భారత్ పరోక్షంగా సహకరిస్తుందని ఆరోపిస్తున్నారు. తాజాగా తీసుకొచ్చిన చట్టం అమల్లోకి వస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థపై, ఇంకా చమురు, గ్యాస్ దిగుమతులపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

భారత్ దిగుమతి చేసుకునే మొత్తం ముడి చమురులో రష్యా వాటా ప్రస్తుతం దాదాపు 45% శాతంగా ఉంది. మన దేశం రోజుకు సుమారు 21 లక్షల బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ వాదన స్పష్టంగా ఉంది. దేశ పౌరుల ఇంధన భద్రత కాపాడుకోవడం, జాతీయ ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ మత బాధ్యత అని చెబుతోంది. కాగా కొత్త చట్టం భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ అంశంపై చర్చించేందుకుఐక్యరాజ్య సమితి సమావేశాల కోసం న్యూయార్క్‌‌లో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రష్యా నుంచి ముడిచమురు, సహజ వాయువు కొనే దేశాలపై 100 శాతం పన్నులు విధించేందుకు అమెరికా తీసుకొచ్చిన చట్టం కారణంగా భారత్‌ ఎదుర్కొనే ఇబ్బందులను జైశంకర్‌ ప్రస్తావించారు. కొత్త చట్టంతో భారత ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతింటాయో, అది ఏ విధంగా తమ దేశానికి ప్రతికూలమో రూబియోకు వివరించారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై జైశంకర్‌తో చర్చలు సానుకూల వాతావరణంలో కొనసాగాయని రూబియో ‘ఎక్స్‌’లో వెల్లడించారు. మరోవైపు రెండు దేశాలు వీలైనంత త్వరలో తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అంగీకరించినట్లు మార్కో రూబియో ఎక్స్ వేదికగా వెల్లడించారు.

కాగా మన దేశం రష్యా నంచి చమురు కొనుగోలు చేయొద్దని ఒత్తిడి తెస్తున్న అమెరికా, తాను మాత్రం ఆ దేశంతో వాణిజ్యం కొనసాగిస్తూ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది. అమెరికా పెద్ద మొత్తంలో రష్యా నుంచి ఎరువులను దిగుమతి చేసుకుంటోంది. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో కీలకమైన పల్లాడియం లోహం కోసం ఎక్కువగా రష్యా మీదే ఆధారపడుతోంది. అలాగే అమెరికా అణు విద్యుత్ ప్లాంటకు అవరమయ్యే యురేనియం కూడా రష్యా నుంచే దిగుమతి అవుతోంది.

మరోవైపు రష్యా మిత్ర దేశమైన బెలారస్‌ నుంచి పొటాష్‌ కొనుగోలు కోసం కూడా అమెరికా ఒప్పందం చేసుకుంది. ఈ ద్వంద్వ వైఖరిని అమెరికా విదేశాంగ శాఖ మాజీ అధికారి ఇవాన్‌ ఫైగెన్‌బామ్ తప్పుపట్టారు. యుద్ధాన్ని ఆపడంతో విఫలమైన ట్రంప్ భారత్‌ను నిందించడం సరి కాదన్నారు.ఇరు దేశాల సంబంధాలపై ఇలాంటి వైఖరి ప్రతికూల ప్రభావం చూపుతుందని, భారత్‌ను చైనాతో కలిపి చూడటం యూఎస్‌కు మేలు చేయదు’ అని పేర్కొన్నారు.

గతంలో పోఖ్రాన్ అణు పరీక్షల సమయంలో భారత్‌పై ఆంక్షలు విధించిన అమెరికా, మరోసారి అదే దారిలో పయనిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. 1998లో పోఖ్రాన్ అణు పరీక్షల సమయంలో భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించగా, 2001 సెప్టెంబర్‌లో నాటికి వాటిని ఎత్తివేసింది. కానీ 25 ఏళ్ల తర్వాత అమెరికా మళ్లీ భారత్‌పై చర్యలకు సిద్ధమైంది. అయితే అమెరికా చర్యల వెనుక ఓ విచిత్ర వాదన తెర మీదకు వచ్చింది. భారత్‌‌ను ఇలాగే వదిలేసే తమ దేశానికి పోటీగా వస్తుందని కొద్ది నెలల క్రితం అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి క్రిస్టోఫర్ లాండౌ వ్యాఖ్యానించారు. గతంలో చైనాను అమెరికా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ దేశం అన్ని రకాలుగా అగ్రరాజ్యంతో ఢీకొనడం తెలిసిందే.. చైనాతో చేసిన తప్పును భారత్‌తో చేయదల్చుకోలేదని క్రిస్టోఫర్ లాండౌ తెలిపారు. తాము అవకాశం ఇస్తే, ఆ తర్వాత మీరు వాణిజ్యపరంగా మమ్మల్నే దెబ్బకొడతారు అని ఆయన అన్నారు.

కాగా పశ్చిమాసియాలో ఇరాన్ చెక్‌పోస్టుల వల్ల ఇంధన రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ)' మద్దతు పలికారు. 2023లో ఐఎంఈసీ కారిడార్ రూపకల్పన జరిగింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఆర్థిక కారిడార్ రెండు ప్రధాన మార్గాలుగా ఉంటుంది. ఒకటి తూర్పు కారిడార్. ఇది భారత్‌ను పశ్చిమ ఆసియాలోని గల్ఫ్ ప్రాంతంతో అనుసంధానిస్తుంది. రెండోది ఉత్తర కారిడార్. ఇది గల్ఫ్ ప్రాంతాన్ని నేరుగా ఐరోపా దేశాలతో కలుపుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సముద్ర మార్గాలపై ఒత్తిడి తగ్గడంతో పాటు, అత్యాధునిక రైల్వే నెట్‌వర్క్‌లు, షిప్-రైల్ ట్రాన్సిట్ సిస్టమ్స్, రోడ్డు రవాణా మార్గాల ద్వారా సరుకుల రవాణా అత్యంత వేగంగా, సురక్షితంగా జరుగుతుంది. దీనివల్ల రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గడమే కాకుండా, యూరప్, ఆసియా మధ్య వ్యాపార సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

మరోవైపు భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 14, 15 తేదీల్లో ఫ్లోరిడాలో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం, సాంకేతికత తదితర రంగాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారత దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తామన్న ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో మోదీ-ట్రంప్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే మోదీ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. సాధారణంగా ఇలాంటి పర్యటనల వివరాలను ప్రభుత్వం పర్యటన ఖరారయ్యాక అధికారికంగా వెల్లడిస్తుంది. గత జూన్‌లో ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా మోదీ, ట్రంప్ చివరిసారిగా సమావేశమయ్యారు. ఆ సమయంలో వాణిజ్యం, రక్షణ, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్