Burning Topic: చిలుకూరి బాలాజీ టెంపుల్ మీద అమెరికా కన్ను?
Burning Topic: హైదరాబాద్‌లోని ప్రముఖ చిలుకూరు బాలాజీ ఆలయం (వీసాల దేవుడు) పై అమెరికా సెనేటర్ ఎరిక్ స్మిట్ సంచలన ట్వీట్ చేశారు.
Burning Topic: చిలుకూరి బాలాజీ టెంపుల్ మీద అమెరికా కన్ను?
Burning Topic: అగ్రరాజ్యంలో ఉన్నత విద్య అభ్యసించాలి.. అక్కడే మంచి ఉద్యోగం సంపాదించి బంగారు భవిష్యత్తు నిర్మించుకుకోవాలి.. సగటు భారతీయ విద్యార్థుల డాలర్ గ్రీమ్స్ ఇవి. ఏటా వేలాది మంది భారతీయులు తమ కలలు పండించుకునేందుకు అమెరికా వెళుతుంటారు. ప్రతి ఏటా సుమారు 65,000 మందికి పైగా భారతీయులకు H-1B వీసాల ద్వారా అక్కడ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం ప్రతి ఏటా ఆమోదించే ఈ వీసాలలో అత్యధికంగా 71% నుండి 75% శాతం భారతీయులకే లభిస్తున్నాయి. ఆ తర్వాత స్థానంలో చైనా వారు ఉంటారు. ఇక అమెరికాలోని మొత్తం కొత్త అంతర్జాతీయ విద్యార్థులలో భారత్, చైనా దేశాల వాటా కలిపి 42% శాతం ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత వలస విధానంలో మార్పులు తేవడంతో భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి. భారతీయులు పెద్ద సంఖ్యలో తమ అవకాశాలే కొల్లగొడుతున్నారని అమెరికన్లలో అపోహలు పెరిగాయి.
ఇటీవల అమెరికాలోని మిస్సౌరీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ భారతీయుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్థానికులకు ఉద్యోగాలు రాకుండా హెచ్1బీ వీసాల మాటున అమెరికాలోని ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారని ఓ ట్వీట్ ద్వారా ఆరోపించారు. విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులేనని, వారు అమెరికన్ పన్ను చెల్లింపుదారుల నిధులతో రాయితీ వర్క్ పర్మిట్లను పొందుతున్నారని ఆరోపించారు. వారు చదువు అయ్యాక హెచ్1బీ పొందుతారు. ఆ తర్వాత గ్రీన్‌కార్డు సాధిస్తారు. తక్కువ వేతనాలతో పనిచేసే వీరితో అప్పులతో సతమతమయ్యే అమెరికన్ గ్రాడ్యుయేట్లు పోటీపడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మార్గంలో భారతీయులు ఉద్యోగాలను సాధిస్తుండటంతో పెద్ద టెక్ కంపెనీలు అమెరికన్లకు దారులు మూసేస్తున్నాయని, ప్రతిభ స్థానాన్ని జాతి పక్షపాతం ఆక్రమిస్తోందని ఆరోపించారు. అమెరికన్ గ్రాడ్యుయేట్లు చౌకైన కార్మికులతో పోటీ పడాల్సి వస్తోంది” అని వ్యాఖ్యానించారు.
తమ దేశ ఉపాధి ఆధారిత వీసా విధానాన్ని తీవ్రంగా విమర్శించారు సెనేటర్ ఎరిక్ ష్మిట్. ఇది స్థానిక వేతన వ్యవస్థలను ఒత్తిడికి గురిచేస్తూ అంతర్జాతీయ కార్టెల్‌ను సృష్టిస్తోందని, అమెరికా ఉద్యోగులను తొలగిస్తోందని ఆరోపించారు. హెచ్1బీ, ఎల్1, ఎఫ్1, ఓపీటీలు అమెరికన్లను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ఎరిక్ ష్మిట్ భారతీయులపై.. ముఖ్యంగా హైదరాబాదీయులపై అక్కసు వెళ్లగక్కారు తన ట్వీట్‌లో చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రస్ధావించడం విశేషం. ఈ వీసా కార్టెల్‌కు ఒక వీసాల దేవాలయం ఉంది. వేల మంది ఈ ఆలయం చుట్టూ తిరుగుతుంటారు. అమెరికా వర్క్ వీసాలు లభించేలా పాస్‌పోర్టులకు ఆశీర్వాదం తీసుకుంటుంటారు’’ అని ష్మిట్ వ్యాఖ్యానించారు. చిలుకూరు బాలాజీ ఆలయం చిత్రాన్నీ తన పోస్టులో ఆయన ఉంచారు. ఇదే వీసాల దేవాలయమని, భారతీయులతోపాటు వీసా కార్టెల్ అమెరికా వీసాల కోసం ఇక్కడ పూజలు చేస్తుంటారని పేర్కొన్నారు.
అమెరికా సెనెటర్ అక్కసుతో చిలుకూరి బాలాజీ ఆలయం పేరు ప్రపంచ వార్తల్లోకి వచ్చేసింది. హైదరాబాద్ నగరానికి 25 నుంచి 30 కి.మీ దూరంలో రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, చిలుకూరు గ్రామంలో ఆ ఆలయం ఉంది. 500 సం.ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి ప్రతి రోజూ పెద్ద సంఖ‌్యలో భక్తులు వస్తుంటారు. వారాంతాలు, సెలవు రోజుల్లో ఆలయ ప్రాంగణం జాతరను తలపిస్తుంది.
కాగా చిలుకూరు బాలాజీని వీసాల స్వామిగా కూడా పిలుస్తుంటారు. కొన్నేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి చదువుకొనే విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బందిపడేవారు. చిలుకూరి బాలాజీ విశిష్టత తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవటం .. ఆ కోరిక నెరవేరటం వెంటనే జరిగిపోయాయి. . కాగా అమెరికన్ సెనెటర్ వ్యాఖ్యలను నెగిటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీవీ రంగరాజన్.
కాగా ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. అందరూ సమానం అనే రీతిలో దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి విఐపి దర్శనాలు ఉండువు. అందరూ సాధారణ భక్తుల్లా రావాల్సిందే. భక్తుల నుండి ఎటువంటి కానుకలు, డబ్బు తీసుకోరు. ఇక్కడ హుండీ వ్యవస్థే లేదు.. ఈ ఆలయంలో కోరికలు నెరవేరడానికి భక్తులు ఒక విశిష్టమైన సాంప్రదాయాన్ని పాటిస్తారు. మొదటిసారి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరాలి అని మొక్కుకొని 11 ప్రదక్షిణలు చేస్తారు. అవి నెరవేరిన తర్వాత రెండోసారి వచ్చి స్వామివారికి కృతజ్ఞతగా 108 ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. అంతే ఇక వారి మొక్కు నెరవేరినట్లే. ముఖ్యంగా వీసాల కోసం ఎక్కువ వచ్చే యువత కారణంగా చిలుకూరి బాలాజీ స్వామి ప్రశస్తి నలుమూలలా వ్యాపించింది. ఇప్పుడు అమెరికన్లకు కూడా చిలుకూరి ఆలయ విశిష్టత అర్థమైపోయిందని సెనేటర్ ఎరిక్ ష్మిట్ వ్యాఖ‌్యల ద్వారా తెలుస్తోంది.




