Burning Topic: అమెరికా దాడిలో ముగ్గురు భారత నావికుల మృ*తి.. మోదీని గెలికేసిన ట్రంప్?

Burning Topic: ఓమన్ తీరంలో అమెరికా జరిపిన సైనిక దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Jun 2026 7:04 AM IST
Burning Topic
X

Burning Topic: అమెరికా దాడిలో ముగ్గురు భారత నావికుల మృ*తి.. మోదీని గెలికేసిన ట్రంప్?

Burning Topic: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రంగా మారాయి. ఇరాన్ మీద భారీస్థాయిలో దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అన్నంత పని చేసి చూపించారు. హర్మూజ్‌ జలసంధి సమీపంలో తమ అపాచీ హెలికాప్టర్‌ కూలిపోవడంతో ఆగ్రహించిన అమెరికా ఒక్కసారిగా ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థలు, గ్రౌండ్‌ కంట్రోల్‌ స్టేషన్లు, నిఘా రాడార్‌ కేంద్రాలే లక్ష్యంగా.. టెహ్రాన్‌తో పాటు బందర్‌ అబ్బాస్‌, సిరిక్‌, టెహ్రాన్‌ ప్రాంతాలపై దాడులు జరిగాయి. ట్రంప్‌ ఆదేశాల మేరకు కేవలం ఆత్మరక్షణ కోసం దాడులు జరిపాయని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. మొత్తం 49 తోమహాక్‌ క్షిపణలను ఈ దాడుల్లో వినియోగించినట్లు పేర్కొంది. ఇరాన్‌కు 64 కిలోమీటర్ల దూరంలోని కొన్ని లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. దీంతోపాటు ఫైటర్‌ జెట్లు కూడా దాడుల్లో పాల్గొని పర్షియన్‌ గల్ఫ్‌ వద్ద ఇరాన్‌ రాడార్‌, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను దెబ్బతీసినట్లు వెల్లడించింది.

కాగా అమెరికా దాడులతో ఆగ్రహించిన ఇరాన్‌.. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ప్రతిదాడులు చేసింది. తమ దేశంలోని మువాఫాక్‌ సాల్టీ వైమానిక స్థావరం లక్ష్యంగా దూసుకొచ్చిన ఐదు క్షిపణులను కూల్చివేసినట్లు జోర్డాన్‌ తెలిపింది. అమెరికాకు చెందిన ఎఫ్‌-35 యుద్ధవిమానాలు ఈ స్థావరంలో ఉంటాయి. ఇరాన్‌ ప్రయోగించిన డ్రోన్లు,క్షిపణులను తాము అడ్డుకున్నట్లు కువైట్, బహ్రెయిన్‌ పేర్కొన్నాయి.

మరోవైపు అమెరికా తాజాగా ఇరాన్‌పై జరిపిన దాడుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. ఇకపై ఈ మార్గంలో ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఎవరైనా అతిక్రమిస్తే నౌకలను కాల్చేస్తామని హెచ్చరించింది. హర్మూజ్‌ను దాటేందుకు ప్రయత్నించిన రెండు నౌకలపై దాడి కూడా చేసింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్ జలసంధి మూసివేత అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు భద్రత కల్పించేందుకే అమెరికా రహస్య సైనిక చర్య చేపట్టిందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆ ఆపరేషన్‌ ఫలితంగా 10 మిలియన్​ బ్యారెళ్లకు పైగా చమురు సురక్షితంగా ప్రపంచ మార్కెట్లకు చేరిందని తెలిపారు. అంతేకాకుండా 200కు పైగా వాణిజ్య నౌకలు ఎలాంటి ప్రమాదం లేకుండా హర్మూజ్​ ద్వారా ప్రయాణించాయని తెలిపారు. ట్రంప్ వైట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మీకెవరికీ తెలియని ఓ విషయం చెబుతాను. మేం సీక్రెట్‌ మిషన్‌ చేపట్టి హర్మూజ్‌ మీదుగా లక్షలాది బ్యారెళ్ల చమురు తరలించాం. ఈ విషయాన్ని ఇరాన్‌ కూడా ఇప్పుడే తెలుసుకుంటుంది. ఒక్క రాత్రే 22 నౌకలను తరలించాం. చిమ్మచీకట్లో లైట్లు లేకుండా రాడార్లకు చిక్కకుండా వాటిని సురక్షితంగా పంపించాం’’ అని వివరించారు.శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్న టెహ్రాన్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్‌ హెచ్చరించారు.

మరోవైపు ఒమన్ తీరంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సెట్టెబెల్లో’ చమురు ట్యాంకర్‌పై అమెరికా దళాలు జరిపిన దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఈ నౌకలో ప్రయాణిస్తున్న 24 మంది భారతీయులలో 21 మందిని రక్షించగా, ముగ్గురు నావికులు గల్లంతయ్యారు.. అమెరికా చర్యలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్త జేసన్‌ మీక్స్‌కు సమన్లు జారీ చేసింది. భారతీయ నావికుల ప్రాణాలకు నష్టం కలిగించేలా వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడంపై తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని, దౌత్యపరమైన పరిష్కారం కోసం జరుగుతున్న చర్చలకు త్వరగా ముగింపు పలకాలని చూసించింది. ఈ విషాద సమయంలో నౌకాదళ కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించింది.

ప్రపంచ సముద్ర వాణిజ్యంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ వ్యాఖ్యానించారు. ప్రాంతీయ ఘర్షణల కారణంగా పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు అదృశ్యమైనట్లు సమాచారం ఉందని తెలిపారు. సముద్ర మార్గాలు అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడిలాంటివని, వాటిపై దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాణిజ్య నౌకలను సైనిక లక్ష్యాలుగా మార్చడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులను ఖండిస్తూ, ప్రాంతీయ శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో రాజకీయ పరిష్కారాలు, మధ్యవర్తిత్వం, శాశ్వత శాంతి కోసం సంభాషణ అంశంపై జరిగిన చర్చలో హరీష్ మాట్లాడారు.

అమెరికా జరిపిన దాడిలో మరణించిన ముగ్గురు భారతీయ నావికులను డెక్‌ క్యాడెట్‌ ఆదిత్య శర్మ, ఇంజిన్‌ ఫిట్టర్‌ శివానంద్ చౌరాసియా, చీఫ్‌ ఇంజినీర్‌ పట్నాల సురేశ్‌గా గుర్తించారు. వీరి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నామని నౌకాయాన మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. కాగా తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్‌ నుంచి చమురు రవాణా చేసేందుకు ప్రయత్నించినందుకే ట్యాంకర్‌పై కాల్పులు జరిపామని అమెరికా సైన్యం తెలిపింది. ఇదిలా ఉండగా.. భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై తాజాగా దాడి జరిగింది. ఒమన్ తీరంలో జలవీర్ అనే నౌకపై అమెరికా మిలిటరీ దాడి చేసింది. వారం రోజుల వ్యవధిలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడి చేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తాజా ఘటనను ఒమన్‌లోని భారత ఎంబసీ వెల్లడించింది. ఒమన్‌లోని షినాస్‌ పోర్టు సమీపంలో నౌకపై దాడి జరిగింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం’’ అని పేర్కొంది.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story