Burning Topic: రష్యా ఉక్రెయిన్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
Burning Topic: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ఇంధన ఒప్పందాలు, 'ఎనర్జీ సీజ్ఫైర్' ప్రకటనల నేపథ్యంలో తీవ్ర విభేదాలు, ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Burning Topic: రష్యా ఉక్రెయిన్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య దూరం మరింతగా పెరిగిపోయింది. "అమెరికా ఫస్ట్" అనే ట్రంప్ జాతీయవాద విధానానికి, "రష్యాపై పోరాటమే ఊపిరి"గా సాగుతున్న జెలెన్స్కీ ఆశయాలకు మధ్య ఉన్న సైద్ధాంతిక వైరుధ్యమే.. వారిద్దరి మధ్య దూరాన్ని పెంచుతోంది. గత నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడమే లక్ష్యం అంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు ట్రంప్.
అధికారం చేపట్టిన తర్వాత ఇందు కోసం ఆయన చేసి ప్రయత్నాలేవీ ఫలించలేదు. అదే సమయంలో రష్యాను అడ్డుకునే దిశగా ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ, ధన సాయం కొనసాగిస్తూ వచ్చారు. అయితే కొంత కాలంగా అమెరికా అధ్యక్షుని వైఖరిలో మార్పు వచ్చింది. అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ఉక్రెయిన్‌కు ఉచితంగా పెద్ద ఎత్తున సైనిక ప్యాకేజీలు ఇవ్వడాన్ని ట్రంప్ నిలిపివేశారు.
అమెరికాలో ఇంధన ధరలను తగ్గించేందుకు మరియు రాబోయే మధ్యంతర ఎన్నికల ఒత్తిడిని తట్టుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల రష్యాతో ఒక వివాదాస్పద డీజిల్ సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. నిన్నటి దాకా రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసిన దేశాలపై సుంకాలు, ఆంక్షలను విధించిన ట్రంప్, ఇప్పుడు స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఒప్పందానికి రావడం కలకలం సృష్టించింది.
దీన్ని ఉక్రెయిన్ అధ్యక్షు జెలెన్స్కీ తీవ్రంగా తప్పుబట్టారు. రష్యా నుంచి డీజిల్ కొనడం అంటే యుద్ధం చేయడానికి పుతిన్‌కు డబ్బులు ఇవ్వడమేనని విమర్శించారు. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య "ఎనర్జీ సీజ్ఫైర్" కుదిరిందని ట్రంప్ ప్రకటించగా.. ఆ విషయం తనకేమీ తెలియదని జెలెన్స్కీ తేల్చిచెప్పారు. ఇది అమెరికా అధ్యక్షునికి ఆగ్రహం తెప్పింది. యుద్ధానికి ముగింపు పలికేందుకు జెలెన్స్కీ కంటే పుతిన్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని తాజాగా వ్యాఖ్యానించారు.
ఇక రష్యా ఆయిల్ రిఫైనరీలపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడులను జెలెన్స్కీ ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు సరైన ఒప్పందం చేసుకోగల కొత్త నాయకత్వం ఉక్రెయిన్‌కు అవసరమని ఆయన బాహాటంగా సూచించారు.
అంతర్జాతీయ విపణిలో డీజిల్ ధరలను తగ్గించేందుకు రష్యాతో అమెరికా కుదుర్చుకున్న కొత్త ఒప్పందంపై జెలెన్స్కీ బహిరంగంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వెంటనే ట్రంప్ నుంచి ఈ ఘాటు స్పందన వచ్చింది. ఉక్రెయిన్ దాడుల వల్ల అమెరికా పౌరులపై కూడా ఇంధన ధరల భారం పడుతోందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఈ పరిణామం తీవ్ర దూరాన్ని పెంచింది. ఇక ట్రంప్ మాట వినకపోతే ఉక్రెయిన్‌కు అందిస్తున్న సైనిక సమాచారం నిలిపివేస్తామని అమెరికా హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక రష్యాతో యుద్ధం ఆపేందుకు ఒప్పందం చేసుకోలేకపోతున్నారా? అయితే ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిందే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని, ఇప్పటికే యుద్ధం కారణంగా ఉక్రెయిన్ చాలా భాగాలను కోల్పోయిందని విమర్శించారు.
ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహించి ప్రజలు కొత్త నాయకుడిని ఎన్నుకునే అవకాశం కల్పించాలని డొనాల్డ్ ట్రంప్ గతంలోనూ వ్యాఖ్యానించారు. 2022లో రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో మార్షల్ లా అమల్లో ఉంది. రష్యాతో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడంపై ఉక్రెయిన్‌లో భిన్నాభిప్రాయాలున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 60 రోజుల కాల్పుల విరమణకు హామీ ఇస్తే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని జెలెన్స్కీ ప్రతిపాదించారు. అయితే ఈ అంశంపై అటు వైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా సాగుతున్న నేపథ్యంలో జెలెన్స్కీ దేశీయంగా తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. రష్యా దాడి ప్రారంభమైన తొలినాళ్లలో ఆయనకు లభించిన అపూర్వమైన ప్రజాదరణ ప్రస్తుతం క్రమంగా క్షీణిస్తూ వస్తోంది.జెలెన్స్కీ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, రక్షణ శాఖ మరియు ఇతర కీలక విభాగాలకు చెందిన ప్రముఖులు వందల మిలియన్ల డాలర్ల అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణల్లో చిక్కుకున్నారు.
యుద్ధ సమయంలో సైనికుల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఆయుధాల కొనుగోళ్లు, విద్యుత్ గ్రిడ్ రక్షణ ఒప్పందాలలో కూడా అవినీతి జరగడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. జెలెన్స్కీ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు చెందిన స్వతంత్ర అవినీతి నిరోధక సంస్థల స్వతంత్రతను తగ్గించేలా చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నించింది. దీనిపై ఉక్రెయిన్ పౌరులు మొదటిసారి రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్థానంలో కొత్త నాయకుడు రావాలని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో.. ఆయనకు ప్రత్యామ్నాయంగా ఎవరెవరు పోటీ పడవచ్చనే చర్చ కూడామొదలైంది. మాజీ సైనికాధికారి, ప్రస్తుతం బ్రిటన్‌లో ఉక్రెయిన్ రాయబారిగా ఉన్న వలెరీ జలుజ్నీ ఈ జాబితాలో ముందున్నారు.
సైనిక గూఢచర్య విభాగం మాజీ అధిపతి కిరిలో బుడనోవ్, రక్షణ మంత్రి మైఖైలో ఫెడొరోవ్ కూడా కీలక ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తున్నారు. కాగా అక్టోబర్ 8న విడుదల చేసిన సర్వే ప్రకారం.. జలుజ్నీపై 64 శాతం మంది ఉక్రెయిన్ ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు. 2022లో రష్యా దాడుల సమయంలో కీవ్ రక్షణలో, అనంతరం ఎదురుదాడుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.
2023లో ఎదురుదాడి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయనను సైనికాధిపతి పదవి నుంచి తొలగించారు. మరోవైపు బుడనోవ్‌పై కూడా 53 శాతం మంది, యెవెనీ ఖ్మారాపై 29 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు.




