Burning Topic: ఒకటికి.. నాలుగు.. అమెరికాకు ఇరాన్ డెత్ వారెంట్!

Burning Topic: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్ మూడు షరతులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 April 2026 7:16 AM IST
Burning Topic
X

Burning Topic: ఒకటికి.. నాలుగు.. అమెరికాకు ఇరాన్ డెత్ వారెంట్!

Burning Topic: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. ఎప్పుడు.. ఎటువంటి యుద్ధ పరిస్థితి నెలకొంటుందో తెలియక ఇరాన్‌తోపాటు సరిహద్దు ప్రజలు భిక్కుభిమంటూ కాలం గడుపుతున్నారు. అయితే యుద్ధానికి స్వస్తి పలికేందుకు ఇరాన్ కీలక ముందడుగు వేసింది. మూడు దశల ప్రతిపాదనలు అమెరికా ముందు ఉంచింది. పాకిస్థాన్‌లో జరిగిన రెండో విడత చర్చలు కూడా విఫలమయ్యాయి. ఈ క్రమంలో శాంతి చర్చలు ఫలించేలా ఇరాన్ అడుగులు వేస్తోంది. మధ్యవర్తుల ద్వారా ఇరాన్ ఓ సరికొత్త దౌత్య వ్యూహాన్ని డొనాల్డ్ ట్రంప్ సర్కార్‌కు చేరవేసింది. యుద్ధం, జలసంధి భద్రత, అణు అంశాలను ఇరాన్ ప్రధానంగా ప్రతిపాదించింది. ఆ కండిషన్‌లలో ముఖ్యంగా.. మొదటి దశలో భాగంగా యుద్ధానికి పూర్తిస్థాయిలో ముగింపు పలకాలి. భవిష్యత్తులో ఇరాన్, లెబనాన్‌లపై ఎలాంటి దాడులు జరగవని అమెరికా హామీ ఇవ్వాలి. ఇక రెండో దశలో భాగంగా.. యుద్ధం ముగిసిన తర్వాతే అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి నిర్వహణ, పరిపాలనపై ఇరు దేశాలు చర్చలు జరుపుతాయి. ఇక మూడో దశలో భాగంగా.. ఈ రెండు దశలు విజయవంతమైతేనే.. అమెరికా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న అణు అంశం, యురేనియం నిల్వలపై చర్చలకు వస్తామని ఇరాన్ షరతులు విధించింది.

ఇరాన్ ప్రతిపాదనపై అమెరికా అంతేఘాటుగా బదులిచ్చింది. దౌత్యపరమైన చర్చలు పత్రికల ద్వారా సాగవని శ్వేతశౌధం స్పష్టం చేసింది. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండనివ్వబోమని అమెరికా మరోసారి తేల్చి చెప్పింది. తదుపరి శాంతి చర్చలు నిర్వహించాలా లేదా అన్న తుది నిర్ణయం అమెరికాదేనని శ్వేతసౌధం ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ తీరుపై అసహనంతో ఉన్నారు. ఇకపై అమెరికా రాయబారులకు 18 గంటలపాటు విమాన ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. ఏదైనా ఉంటే ఫోన్ కాల్‌లోనే మాట్లాడుకోవచ్చంటూ ఆయన ఇరాన్‌కు చురకలు అంటించారు.

రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ఎటూ తేలని నేపథ్యంలో.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ రష్యా గడ్డపై అడుగు పెట్టారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆయన భేటీ కానున్నారు. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చల వ్యవహారం, పురోగతిపై పుతిన్‌తో అరాగ్చీ చర్చించనున్నారు. ఈ చర్చల్లో యుద్ధం ఆగిపోయి.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చల్లారుతాయా..? లేదా తేలిపోనుందని అంతర్జాతీయ నిపుణులు చర్చించుకుంటున్నారు. లేదంటే అరాగ్చీ, పుతిన్ కలిసి యుద్ధాన్ని మరింత బలపరుస్తారా అనే సందేహాలు కూడా లేకపోలేదు. పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా, ఇరాన్ దేశాల మధ్య ఇటీవలి కాలంలో రక్షణ, దౌత్య సంబంధాలు మరింత బలపడ్డాయి. అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న క్రమంలో.. రష్యా అండతో ఇరాన్ తన పట్టును నిలబెట్టుకోవాలని చూస్తోందా లేక ఈ భేటీ ద్వారా అమెరికాకు ఒక బలమైన సంకేతం పంపాలని రెండు దేశాలు భావిస్తున్నాయా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య రెండో దశ చర్చలు వాయిదా పడ్డాక.. అబ్బాస్ అరాగ్చీ.. పాక్ ప్రధాని, సైన్యాధిపతితో భేటీ అయ్యారు. అమెరికా ప్రతినిధులు రాకముందే అరాగ్చీ పాక్ చేరుకోవడం.. ట్రంప్‌కి ఏమాత్రం మింగుడుపడలేదని సమాచారం. ఇదే సాకుతో.. అమెరికా ప్రతినిధులు పాక్ వెళ్లడం లేదని ట్రంప్ అప్పటికప్పుడు ప్రకటించారు.

ఇలా ఉంటే.. శాంతి చర్చల విషయంలో ఇరాన్‌ నాయకత్వంలో ఏకాభిప్రాయం లేదని, వారిలో చీలికలు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. ఇరాన్ నాయకత్వం పిల్లులు, కుక్కల్లా పోట్లాడుకుంటోందని ఇటీవల ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇరాన్ నాయకత్వంలో ఎటువంటి విభేదాలు లేవని తేల్చి చెప్పింది. అంతేకాక.. తామంతా ఐక్యంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఇరాన్ పాలకులు ఇలా తామంతా ఒకటేనని బయటకు చెప్తున్నప్పటికీ, తెర వెనుక మాత్రం లోతైన సంక్షోభం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్.. మరోవైపు రాజకీయ నాయకత్వం అధికారంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీకి కీలక నాయకులు రాసిన ఓ రహస్య లేఖ కూడా ఇందుకు బలం చేకూరేలా ఉంది. రెండో దశ చర్చలు వాయిదా పడిన నేపథ్యంలో ఈ లేఖ సంచలనంగా మారింది.

ఆ లేఖపై ముఖ్యమైన అధికారులు కూడా సంతకాలు చేశారని సమాచారం. ప్రస్తుతం ఇరాన్ ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో నాయకత్వం తన వ్యూహాలను మార్చుకోవాలని ఆ లేఖలో సంతకాలు చేని అధికారులు కోరారని తెలుస్తోంది. తాజాగా ఇరాన్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంపై మోజ్తాబా హెచ్చరికలు చర్చనీయాంశమయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా వెంటనే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మోజ్తాబా ముఖ్య సూచనలు చేశారు.

ఇరాన్ నాయకత్వం అనుసరిస్తోన్న మొండి వైఖరి.. దేశ భద్రతకే ముప్పు అని ఆ దేశ ఉన్నతాధికారులు సుప్రీం లీడర్‌కు గుర్తు చేశారు. వెంటనే విదేశాంగ విధానాన్ని మార్చుకోవాల్సి అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వంపై రివల్యూషనరీ గార్డ్స్ మితిమీరిన ప్రభావం చూపిస్తోందని, పరిపాలనలో సైనిక జోక్యం తగ్గించి, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల మాటకు విలువ ఇవ్వాలని కూడా వారు లేఖలో కోరారని తెలుస్తోంది. కాగా ఈ లేఖపై ఇరాన్ మాజీ అణు చర్చల ప్రతినిధి అలీ బాఘేరి వంటి కొందరు హార్డ్‌లైనర్లు సంతకం చేయడానికి నిరాకరించారట. ఇంతకీ ఎంతో రహస్యంగా ఉండాల్సిన ఈ లేఖ ఎలా బహిర్గతమైందన్న ఇరాన్ ప్రభుత్వాధినేతలు ప్రశ్నించుకుంటున్నారట. ఈ లేఖ బాహ్య ప్రపంచానికి లీక్‌ కావడంపై ఇరాన్ రాజకీయాల్లో చిచ్చు రేపింది. అయితే ఓవైపు శాంతి కోసం చర్చలు జరుగుతుండగా.. ఇరాన్‌లో అంతర్గత కలహాల గురించి ట్రంప్ మాట్లాడటం ఆ దేశాన్ని ఆత్మరక్షణలో పడేసిందట. దీంతో ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా తామంతా ఏకతాటిపై ఉన్నామన్న సంతకేతాలు ఇచ్చేందుకు ఇరాన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి.. శాంతి చర్చలు ముందుకు సాగాలంటే మూడు షరతులు విధించిన ఇరాన్.. ఐక్యంగా ఉంటూ అమెరికా ముందు తేలిపోకుండా చూసుకోవాలి. ఇరాన్‌కంటూ ఓ జాతీయ విధానాన్ని అమలు చేసి.. అందరూ దానికి కట్టుబడి ఉండాలి. అయితే.. శాంతి చర్చలు ఫలించేందుకు రెండు దేశాలు ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తాయోనన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story